పర్యావరణానికి తూట్లు
⇒ ఏపీఎండీసీ గనుల్లో తవ్వకాలు
⇒ కాలుష్యం కోరల్లో మంగంపేట
ఓబులవారిపల్లె:
పర్యావరణ నిబంధనలతోపాటు చట్టాలు సైతం కాంట్రాక్టర్ చుట్టాలు అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నామనే ధ్యాస మరచి ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు జరుపుతున్నారు. రాయలసీమ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ రాజ్యసభసభ్యుడు బినామీగా చెప్పుకొనే కాంట్రాక్టర్ మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో జరుగుతున్న తవ్వకాల గురించి ప్రశ్నించే అధికారి లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
అధికారులు సూచించిన ప్రాంతంలో కాకుండా తనకు ఇష్టంవచ్చిన చోట కాంట్రాక్టర్ తవ్వకాలు జరుపుతున్నాడు. దీనివల్ల గనుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏపీఎండీసీ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగామట్టి నిల్వలు:
గనుల నుంచి తోడే వృథా మట్టిని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ ప్రాంతీయ గనుల భధ్రత సంచాలకులు కాంట్రాక్టర్‌తో పాటు ఏపీఎండీసీ అధికారులను హెచ్చరించారు. డంపింగ్ చేసే ప్రాంతం 120 మీట్లర్ల ఎత్తు ఉండాలనే నిబంధలు ఉన్నా అంతకు మించి ఎత్తు పెరిగింది. దీంతో వాహనాలు మొరాయిస్తున్నారు. రెండునెలల కిందట ఏపీఎండీసీ గనుల్లో ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్ మసిపూసి మారేడుకాయ చేసి జరిగిన సంఘటనలను బయటకు పొక్కనీయలేదు. ఇందుకు ఏపీఎండీసీ మేనేజ్‌మెంట్ సైతం వంతపాడింది.
అగచాట్లు పడుతున్న గ్రామస్థులు
గ్రామాలకు కేవలం 200మీటర్లలోపు ఏపీఎండీసీ అధికారులు వృథామట్టి నిల్వలను చేపడుతున్నారు. వృథామట్టి వల్ల ధూళి కాలుష్యం మూడు గ్రామాలను కప్పేస్తోంది. ఈ విషయాన్ని బాధిత గ్రామాలప్రజలు అధికారులు దృష్టికి తీసుకెళితే అడవిలో కేక వేసినట్టుంది తప్ప స్పందనలేదు.గనుల్లో నిర్వహించే డ్రిల్లింగ్, పేలుళ్లతో ఇప్పటికే మంగంపేట, కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతీవాడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. ఇటీవల ఏపీఎండీసీవారు రెవెన్యూశాఖ ద్వారా గనుల విస్తరణకు మంగంపేట పరిసర ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టారు. కేవలం ఏపీఎండీసీవారి అవసరాలకోసం భూసేకరణ చేశారే గానీ బెరైటీస్ గనుల సమీపంలోని గ్రామాల గురించి ఆలోచించలేదు. దీంతో ఆ గ్రామాలనుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంగంటపే గనుల్లో జరిపే చర్యలవల్ల వందలాది మంది శ్వాసకోస వ్యాధులకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదపు టంచులలో ఉన్న గ్రామాల గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గనుల్లో జరిగే పేలుళ్లవల్ల పక్కాగృహాలు బీటలు వారుతున్నాయి. ప్రస్తుత బెరైటీస్ గనుల విస్తీర్ణాన్నిబట్టి సుమారు 35 హెక్టార్ల వరకు పచ్చదనాన్ని పెంచి కాలుష్యాన్ని నివారించాలని చట్టాలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రికార్డుల్లో మాత్రం మొక్కల పెంపకం భద్రంగా ఉన్న లక్షలాదిరూపాయలు దుర్వినియోగంమైన ట్లు విమర్శలు ఉన్నాయి. అధికారపార్టీ అండదండలతో ఏపీఎండీసీ గనుల తవ్వకాలను చేపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయడానికి సిద్ధమయ్యారు.