సాక్షి, అమరావతి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలోని సుల్యారీ బొగ్గు గని నుంచి తొలి ఏడాదిలోనే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఇంత బొగ్గు తవ్వడం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండీసీ జాతీయ స్థాయి మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా మారుతోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఏపీఎండీసీ ముందంజలో ఉందని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గనిలో 2021, ఏప్రిల్ నెలలో బొగ్గు తవ్వకాలను ఏపీఎండీసీ లాంఛనంగా ప్రారంభించింది. స్థానికంగా నెలకొన్న ఇబ్బందులు, కోర్టు కేసులన్నింటినీ పరిష్కరించుకుని 2022, మార్చి నుంచి పూర్తిస్థాయిలో తవ్వకాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది మార్చి నాటికి 1.9 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దీనిద్వారా రూ.483.5 కోట్ల రెవెన్యూ వచ్చింది.
ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే 8 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,624 కోట్ల రెవెన్యూ సాధించాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తోంది. సుల్యారీ బొగ్గు గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును దాదాపు 22 సంవత్సరాలపాటు వెలికితీసేందుకు అవకాశం ఉంది. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఏపీఎండీసీ ముందుకెళుతోంది. అలాగే ఝార్ఖండ్‌లోని బ్రహ్మదియా గనిలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్‌ను ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
సీఎం ముందుచూపు నిర్ణయాలే కారణం
రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలైన మొదటి ఏడాదే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఆయన దూరదృష్టం కారణం. ఈ బొగ్గు గని ద్వారా మున్ముందు మంచి ఫలితాలు రానున్నాయి. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాం. సుల్యారీ బొగ్గు గనుల తవ్వకాల ద్వారా ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పరిధిని విస్తరించుకోవడంతోపాటు సత్తా చాటుకుంది. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment