కొండంత ఆశ | cm actions for underground mining starts | Sakshi
Sakshi News home page

కొండంత ఆశ

Published Sat, Jul 26 2014 12:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

కొండంత ఆశ - Sakshi

కొండంత ఆశ

భూగర్భ గనుల ప్రారంభానికి సీఎం చర్యలు
సర్వే చేసిన అధికారులు
20 వేల మందికి ఉపాధి అవకాశాలు
బెల్లంపల్లికి పూర్వవైభవం
బెల్లంపల్లి : సింగరేణిలో భూగర్భగనులపై ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు భూగర్భగనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి సూచించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భగనులకు మోక్షం లభిస్తుందనే ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. 1927 సంవత్సరంలో తాండూర్ కోల్‌మైన్స్ పేరిట ఈ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, శాంతిఖని, బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6, గోలేటీ-1, 1ఎ గనులతో బెల్లంపల్లి వేలాది మంది కార్మికులతో రెండున్నర దశాబ్దాల క్రితం కళకళలాడింది. ఆ తర్వాత కొందరు సింగరేణి అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, కొన్ని గనుల భూగర్భ భౌగోళిక పరిస్థితులు, సాంకేతిక సమస్యలతో ఒక్కొక్కటిగా గనుల మూసివేతకు పాల్పడ్డారు.

మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, బోయపల్లి, ఎంవీకే-1,2,3,5,6 గనులను మూసివేసి ఇక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. బెల్లంపల్లిలో 7 మెగావాట్స్‌తో నిర్మించిన పవర్‌హౌస్‌ను అర్ధంతరంగా మూసివేసి ప్రైవేట్ సంస్థకు విక్రయించారు. వర్క్‌షాప్, స్టోర్, ఆటోగ్యారేజ్, రెస్య్కూస్టేషన్ తదితర విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో బెల్లంపల్లి ఏరియా క్రమంగా మనుగడను కోల్పోయింది. ప్రస్తుతం ఏరియా పరిధిలోని గోలేటీ, డోర్లి, కైరిగూడ ప్రాంతాల్లో మూడు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, ఒక భూగర్భ గని మాత్రమే పని చేస్తున్నాయి.

ఏరియా వ్యాప్తంగా సుమారు 2,400 మంది కార్మికులు సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి ఏరియా పరిధిలోని శాంతిఖని గనిని మందమర్రి ఏరియాలోకి విలీనం చేశారు. ఈ క్రమంలో కొత్తగా భూగర్భ గనులకు శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భ గనులు ప్రారంభమవుతాయనే కొండంత ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది.
 
సర్వే చేసిన భూగర్భ గనులు
బెల్లంపల్లి ఏరియా పరిధిలో ఐదు భూగర్భ గనుల కోసం కొన్నేళ్ల క్రితం సర్వే జరిగింది. సింగరేణికి  చెందిన ఎక్స్‌ప్లోరేషన్ విభాగం అధికారులు ఈ మేరకు అన్వేషణ చేసి భూగర్భంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.
     తాండూర్ మండలం మాదారం పరిధిలోని ఎంవీకే-1, 2 గనుల మధ్య సుమారు 20 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ సుమా రు 300 మీటర్ల పరిధిలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ భూగర్భ గని జీవిత కాలం సుమారు 25 నుంచి 30 ఏళ్లుగా సర్వేలో వెల్లడైంది.
     బెల్లంపల్లి శివారులో బెల్లంపల్లి షాఫ్ట్‌బ్లాక్-1,2,3లను గుర్తించారు. ఆయా బ్లాక్‌లలో సుమారు 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 300 నుంచి 350 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు భూగర్భ గనుల కోసం ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. ఆయా బ్లాక్‌ల జీవిత కాలం సుమారు 50 నుంచి 60 ఏళ్ల వరకు ఉంటుందని సూత్రప్రాయంగా నిర్ధారించారు.
     నెన్నెల మండలం శ్రావణ్‌పల్లిలో సుమారు 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ సుమారు 250 నుంచి 300 మీటర్ల లోతులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సర్వే అధికారులు తేల్చారు. ఈ గని జీవిత కాలం సుమారు 30 నుంచి 40 ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు కూడా సింగరేణి యాజమాన్యం సిద్ధం చేసింది. ఆ రకంగా బెల్లంపల్లి ప్రాంతంలో ఐదు భూగర్భ గనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి.
 వేలాది మందికి ఉపాధి
భూగర్భ గనులు ప్రారంభించడం వల్ల బెల్లంపల్లికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కార్మికుల పిల్లలు ప్రధానంగా వారసత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు. భూగర్భ గనులను ప్రారంభించడం వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒక్కో భూగర్భ గనిని ప్రారంభిస్తే సగటున 3 వేల నుంచి 4 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ఆ తీరుగా ఐదు గనులను ప్రారంభించడం వల్ల సుమారు 20 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. తద్వారా బెల్లంపల్లి పారిశ్రామికంగా వృద్ధిలోకి వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోపు రెండు, మూడు భూగర్భ బొగ్గు గనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి  యాజమాన్యాన్ని ఆదేశించడంతో బెల్లంపల్లి ప్రాంతంలో భూగర్భ గని ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సింగరేణి అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement