Underground mines
-
భూగర్భ గనులను కాపాడాలి
మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జి.లక్ష్మణ్ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, శ్రీరాంపూర్ డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నుంచి కే.సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్రావు, బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, హెచ్ఎమ్మెస్ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి, ఏరియా ఎస్ఓటు జీఎం రఘుకుమార్, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్మెంట్ హనుమాన్‌గౌడ్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం.. సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది. –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్ ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్ మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్ -
సింగరేణి భూగర్భ గనులు మూసివేత
సాక్షి, హైదరాబాద్/ పెద్దపల్లి: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భూగర్భ గనులకు లే ఆఫ్ ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండో షిఫ్టు నుంచి మూసేయాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ వ్యాప్తంగా 27 భూగర్భ గనులు, 18 ఓసీపీలు కొనసాగుతు న్నాయి. ఇందులో పూర్తిస్థాయి యాంత్రీకరణతో సాగుతున్న ఐదు భూగర్భ గనులు, 18 ఓసీపీల్లో యథావిధిగా ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు పూనుకున్నాయి. మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. అనంతరం ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. భౌతిక దూరం పాటించడంతోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కావడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో కార్మికులు యథావిధిగా విధులు నిర్వహించడం పట్ల పలు కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకేచోట పెద్ద మొత్తంలో పని స్థలాల్లో గుమిగూడాల్సి వస్తుండటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇద్దరు సింగరేణి కార్మికులు ఉన్నట్లు ప్రచారం జరగడం.. వారు విధులకు హాజరైనట్లు తెలియడంతో మరింత గంద రగోళం నెలకొంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి యాంత్రీకరణ గనులు, ఓసీపీలను మినహాయించి భూగర్భ గనుల్లో పనులు నిలిపివేయాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ మైన్స్ సేఫ్టీ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. 22 భూగర్భ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. సింగరేణి యాజమాన్యం నిర్ణయంతో సంస్థ వ్యాప్తంగా ఉన్న 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ గనుల్లో 26,692 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అత్యవసర సిబ్బంది మినహా మిగతా కార్మికులందరికీ 1947 లేబర్ యాక్ట్ ప్రకారం సగం వేతనం చెల్లించనున్నారు. కాగా, సింగరేణి లే ఆఫ్ ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి యాంత్రీకరణ ఉన్న ఐదు గనులతో పాటు 18 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి యథావిధిగా కొనసాగనుంది. యాంత్రీకరణ ఉన్న ఐదు భూగర్భ గనులు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు, వీకే–7, శాంతిఖని, జీడీకే–11, కొండాపూర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. కాగా, సింగరేణి వ్యాప్తంగా ప్రతి రోజు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా, 22 గనుల్లో లే ఆఫ్ మూలంగా ప్రతిరోజు 15 నుంచి 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. అందుబాటులో మాస్కులు.. శానిటైజర్లు: పర్సనల్ మేనేజర్ పనిచేసే గనులు, కార్యాలయాల వద్ద శాని టై జర్లు, మాస్కులను అందుబాటులో ఉంచిన ట్టు సంస్థ పర్సనల్ మేనేజర్ ఎ.ఆనందరావు ఓ ప్రకటనలో తెలిపారు. గనులు, కార్యాల యాల ఆవరణలో శానిటైజర్లను స్ప్రే చేస్తున్నా మని, అత్యవసర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. సింగరేణి కాలనీల్లో రసాయనాల పిచికారి చేస్తున్నామన్నారు. లే ఆఫ్‌లో ఉన్న ఉద్యోగులు ఆరోగ్య నియమాలను పాటిస్తూ, ఇంటివద్దనే ఉండాలని ఆయన కోరారు. మంచి నిర్ణయం కరోనా వైరస్ మూలంగా గనులకు లే ఆఫ్ ప్రకటించడం మంచి నిర్ణయం. వందల మంది ఒకే గనిలో పని చేయాల్సి వచ్చింది. లే ఆఫ్ మూలంగా కార్మికులంతా ఇళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇదే మంచి సమయం. – పసుపులేటి హరిప్రసాద్, జనరల్ మజ్దూర్ పూర్తి వేతనం ఇవ్వాలి లే ఆఫ్ నిర్ణయం మూలంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. అండర్ గ్రౌండ్ మైన్‌లో ఒకే చోట ఎక్కువ మంది పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లే ఆఫ్ కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాలి. – శ్రీనివాస్‌రెడ్డి, సపోర్ట్‌మెన్ -
సింగరేణిలో లాక్‌డౌన్‌కు బదులు లేఆఫ్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ సింగరేణి కార్మికులు తమ విధులకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ మైన్స్‌లో పనిచేస్తున్న కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణిలో లాక్‌డౌన్‌కు బదులు లేఆఫ్ అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. బుధవారం రెండో షిప్టు నుంచి భూగర్భ గనులను మూసివేస్తున్నట్టుగా వెల్లడించింది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు సామాజిక దూరం పాటించలేని పరిస్థితులు ఉండటంతో.. కార్మికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు బుధవారం సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. అయితే మెషిన్ మైనింగ్ ఉన్న ఏఎల్పీ, వీకే-7, శాంతి ఖని, జీడేకే-11ఏ ఇంక్లైన్, కొండాపూరం భూగర్భ గనులతో పాటు, అన్ని ఉపరితల గనులను యథావిథిగా నడపనున్నట్టు తెలిపింది. మూసివేసిన గనుల్లో కూడా అవసరమైన విభాగాలకు చెందిన వారు మాత్రం హాజరుకావాల్సి ఉంటుందని చెప్పింది. ఏప్రిల్ 14వ తేదీ అర్థరాత్రి లేదా లాక్డౌన్ ఎత్తివేసే వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది. లేఆఫ్ కాలంలో చట్టప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించడం జరుగుతందని సింగరేణి వెల్లడించింది. అలాగే పనులు జరుగుతన్న చోట కరోనా కట్టడి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. -
5బీ భవిష్యత్ ప్రశ్నార్థకం
కొత్తగూడెం : ఒకసారి రూఫ్ ఫాల్.. మరోసారి భారీ యంత్రాలతో ఇబ్బందులు.. ఇంకోసారి వెంటిలేషన్ సమస్య.. వీటికితోడు విషవాయువులు.. భూగర్భగనుల్లో బొగ్గు వెలికితీసే కార్మికులు అనునిత్యం ప్రమాదాలతో సహవాసం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెంలోని 5బీ షాఫ్ట్ గనిలో వెలువడిన గ్యాస్(కార్బన్‌మోనాక్సైడ్) కార్మికులను కలవరానికి గురిచేస్తోంది. నివారణ చర్యలు చేపడుతున్నా అదుపులోకి రాకపోవడంతో గని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 360 మీటర్ల లోతులో బొగ్గు ఉత్పత్తి 5బీ షాఫ్ట్ గనిని 1952లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 8.71 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయగా ఇంకా 24 లక్షల టన్నులు ఉంది. మరో పదేళ్లపాటు తీయవచ్చు. ప్రస్తుతం 360 మీటర్ల లోతులో 10-17 డీప్, 86 నుంచి 91 లెవెల్ వద్ద బాటమ్ సీమ్‌లో ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 1,050 మంది కార్మికులు పనిచేస్తుండగా అధునాతన యంత్రాలు, నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మిథేన్ గ్యాస్ అంటే..? గనిలో ముఖ్యంగా కింగ్ సీమ్, టాప్ సీమ్, బాటమ్ సీమ్‌లు ఉంటాయి. వీటిలోని బొగ్గు నాణ్యతను బట్టి వెలికితీస్తారు. ఒక్కో సీమ్‌ను కొన్ని బ్లాక్‌లుగా విభజించి యంత్రాల సహాయంతో బొగ్గు తీస్తారు. ఆయా బ్లాక్‌లలో బొగ్గు వెలికితీత పూర్తయిన తర్వాత అటువైపు ఎవరూ వెళ్లకుండా బ్లాక్‌లకు అడ్డుగా గోడలు కట్టి మూసివేస్తారు. అలా మూసివేసిన బ్లాక్‌లలో గాలి ఉండిపోయి కొన్ని రోజులకు మిథేన్ గ్యాస్‌గా మారుతుంది. దీనికి మండే స్వభావం ఉంటుంది. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సమయాల్లోనూ మిథేన్ గ్యాస్ వెలువడుతుంది. అక్కడ అడ్డు గోడ కట్టి బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తారు. ప్రస్తుతం కొత్తగూడెం 5బీ షాఫ్ట్ గనిలో మూసివేసిన బ్లాక్ నుంచి మిథేన్ గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఫైర్ సీల్స్ మిథేన్ గ్యాస్‌కు ముఖ్యంగా మండే స్వభావం ఉండటం వల్ల ఫైర్ సీల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశానికి నీరు, సీఓటూ(కార్బన్ డై ఆక్సైడ్)ను పంపించడం ద్వారా గ్యాస్ లీకేజీని నివారించవచ్చు. గ్యాస్ సాంద్రత తగ్గిన తరువాత తిరిగి అడ్డుగోడ కట్టి సీల్ చేయాల్సి ఉంటుంది. మూసివేసిన ఫైర్ సీల్స్‌ను ఎప్పటికప్పుడు రక్షణ విభాగం అధికారులు పరిశీలించాలి. విషవాయువు సాంద్రత పెరిగితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అయితే 5బీ గనిలో సేఫ్టీ, వెంటిలేషన్ విభాగాల వైఫల్యం కారణంగా మిథేన్ గ్యాస్ గనిలో విస్తరించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 420 వరకు ఫైర్ సీల్స్ ఉండటం గమనార్హం. ఇవి చాలా ఎక్కువే. కార్మికుల్లో ఆందోళన గనిలో మొత్తం 1,050 మందికి పైగా కార్మికులు పలు షిఫ్టులలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మిథేన్ గ్యాస్ వెలువగడటంతో 12 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు మినహా సుమారు 700 మందిని డిప్యుటేషన్‌పై ఏరియా పరిధిలోని ఇతర గనులకు పంపించారు. మరో పదేళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేసే వీలున్న ఈ గనిలో మిథేన్ గ్యాస్ వెలువడటం, దాని నియంత్రణ ఇబ్బందిగా మారడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం మరో 10 రోజుల్లో పూర్తి అదుపులోకి తీసుకువస్తామని చెబుతున్నారు. ఇలా మొదలైంది.. ఈ నెల 8న.. శుక్రవారం సుమారు 200 మంది కార్మికులు సెకెండ్ షిఫ్టు డ్యూటీకి వెళ్లారు. రాత్రి విధులు ముగిం చుకుని గని ఉపరితలానికి రావడానికి బయలు దేరారు. ఇంతలో మిథేన్ గ్యాస్ వాసన రావడంతో సమాచారం అందించగా రక్షణ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని దాని సాంద్రతను పరిశీలించారు. కేవలం 20శాతం మాత్ర మే ఉండడంతో పెద్ద ప్రమాదమేమీ లేదని నిర్లక్ష్యం చేసినట్లు కార్మికులు చెబుతున్నారు. వారం రోజుల వ్యవధిలో మిథేన్ గ్యాస్ సాంద్రత 120 శాతానికి చేరుకోగా హడావుడిగా గని అధికారులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. మిథేన్ గ్యాస్ సాంద్రతను తగ్గించేందుకు గనిలోకి సీఓ-2 పంపిణీ చర్యలు కొనసాగుతున్నాయి. -
సింగరేణిలో మరో నాలుగు గనులు
- రెండు భూగర్భ మైన్స్... మరో రెండు ఓసీపీలు - ఏడాదిలోగా పనులు ప్రారంభం - వార్షిక లక్ష్యం 3.30 మిలియన్ టన్నులు గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏడాదిలో నాలుగు కొత్త గనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాబోయే ఐదేళ్లలో మొత్తం 17 గనులు ప్రారంభించాలని నిర్ణయించింది. తొలిదశలో ఈ ఏడాది ఖమ్మం జిల్లా మణుగూరు వద్ద కొండాపూర్ భూగర్భ గని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వద్ద కాసిపేట-2 భూగర్భ గని, బెల్లంపల్లిలో ఓసీపీ-2, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కేకే- ఓసీపీ ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. కొత్తగనుల ద్వారా ఏటా 3.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయూలని లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్య సాధనకు కొత్త గనులు.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 56 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి యూజమాన్యం తన ఉత్పత్తి లక్ష్యాన్ని నివేదించింది. తన వార్షిక లక్ష్యాన్ని మాత్రం 60.03 మిలియన్ టన్నులుగా నిర్దేశించుకుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు కేటాయింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న ఉద్దేశంతో లక్ష్యం ఎక్కుగా నిర్దేశించుకున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తక్కువ చేసి చూపించింది. ఒడిశా ‘నైనీ’ బ్లాక్‌పై దృష్టి.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన బొగ్గు బ్లాకుల్లో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సింగరేణి సంస్థకు ఒడిశాలోని ‘నైనీ’ బ్లాక్ దక్కింది. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 600 మెగావాట్ల మూడో విద్యుత్ యూనిట్‌కు అందించే వీలుంది. దీంతో ఈ బ్లాక్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టే ఆలోచనలో ఉంది. అరుుతే, గతంలో నైనీ బ్లాక్‌ను జిందాల్ కంపెనీ చేపట్టింది. ఆ సంస్థ వెచ్చించిన సొమ్మును కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సూచన మేరకు తాను చెల్లించేందుకు సింగరేణి సిద్ధంగా ఉంది. తాను నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్య సాధన వైపు సాగుతోంది. నిర్దేశిత లక్ష్య సాధనకు కొత్త గనులు ప్రస్తుతం సింగరేణిలో 34 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని భావించిన యూజమాన్యం.. రాబోయే ఏడాదిలో కొత్త భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. -
భూగర్భ గనుల్లో ఇక వైర్లెస్ ఫోన్లు
కొత్తగూడెం: సింగరేణి సంస్థ అధునాతన టెక్నాలజీతో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గతంలో భూగర్భ గనుల నుంచి బయటకు సమాచారం వచ్చేందుకు కేవలం వైర్లెస్ ఫోన్లనే వినియోగించేవారు. ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితంగా ఉండటం వల్ల గులాయిల్లో పనిచేసే కార్మికులు, యంత్రాల సమాచారం పైన ఉన్నవారికి తెలవడం జాప్యమయ్యేది. భూగర్భ గనిలోని పని ప్రదేశాల్లో ఉన్నవారు తప్పిపోయిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. దీన్ని నివారించేందుకు భూగర్భగనిలో జీపీఆర్ఎస్ సిస్టమ్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. గనుల్లో వైర్లెస్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్లు సిద్ధం చేసింది. ఈ ఫోన్లను ప్రయోగాత్మకంగా అడ్రియాల్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా మిగిలిన భూగర్భ గనుల్లో వైర్లెస్ ఫోన్లను అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు అనుభవం కలిగిన వైర్లెస్ ఫోన్ల తయారీదారులు తమ సమాచారం అందించాలని సింగరేణి సంస్థ లేఖలు రాసింది. -
కొండంత ఆశ
► భూగర్భ గనుల ప్రారంభానికి సీఎం చర్యలు ► సర్వే చేసిన అధికారులు ► 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ► బెల్లంపల్లికి పూర్వవైభవం బెల్లంపల్లి : సింగరేణిలో భూగర్భగనులపై ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు భూగర్భగనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి సూచించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భగనులకు మోక్షం లభిస్తుందనే ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. 1927 సంవత్సరంలో తాండూర్ కోల్‌మైన్స్ పేరిట ఈ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, శాంతిఖని, బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6, గోలేటీ-1, 1ఎ గనులతో బెల్లంపల్లి వేలాది మంది కార్మికులతో రెండున్నర దశాబ్దాల క్రితం కళకళలాడింది. ఆ తర్వాత కొందరు సింగరేణి అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, కొన్ని గనుల భూగర్భ భౌగోళిక పరిస్థితులు, సాంకేతిక సమస్యలతో ఒక్కొక్కటిగా గనుల మూసివేతకు పాల్పడ్డారు. మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, బోయపల్లి, ఎంవీకే-1,2,3,5,6 గనులను మూసివేసి ఇక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. బెల్లంపల్లిలో 7 మెగావాట్స్తో నిర్మించిన పవర్‌హౌస్‌ను అర్ధంతరంగా మూసివేసి ప్రైవేట్ సంస్థకు విక్రయించారు. వర్క్‌షాప్, స్టోర్, ఆటోగ్యారేజ్, రెస్య్కూస్టేషన్ తదితర విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో బెల్లంపల్లి ఏరియా క్రమంగా మనుగడను కోల్పోయింది. ప్రస్తుతం ఏరియా పరిధిలోని గోలేటీ, డోర్లి, కైరిగూడ ప్రాంతాల్లో మూడు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, ఒక భూగర్భ గని మాత్రమే పని చేస్తున్నాయి. ఏరియా వ్యాప్తంగా సుమారు 2,400 మంది కార్మికులు సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి ఏరియా పరిధిలోని శాంతిఖని గనిని మందమర్రి ఏరియాలోకి విలీనం చేశారు. ఈ క్రమంలో కొత్తగా భూగర్భ గనులకు శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భ గనులు ప్రారంభమవుతాయనే కొండంత ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. సర్వే చేసిన భూగర్భ గనులు బెల్లంపల్లి ఏరియా పరిధిలో ఐదు భూగర్భ గనుల కోసం కొన్నేళ్ల క్రితం సర్వే జరిగింది. సింగరేణికి చెందిన ఎక్స్‌ప్లోరేషన్ విభాగం అధికారులు ఈ మేరకు అన్వేషణ చేసి భూగర్భంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. తాండూర్ మండలం మాదారం పరిధిలోని ఎంవీకే-1, 2 గనుల మధ్య సుమారు 20 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ సుమా రు 300 మీటర్ల పరిధిలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ భూగర్భ గని జీవిత కాలం సుమారు 25 నుంచి 30 ఏళ్లుగా సర్వేలో వెల్లడైంది. బెల్లంపల్లి శివారులో బెల్లంపల్లి షాఫ్ట్‌బ్లాక్-1,2,3లను గుర్తించారు. ఆయా బ్లాక్‌లలో సుమారు 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 300 నుంచి 350 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు భూగర్భ గనుల కోసం ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. ఆయా బ్లాక్‌ల జీవిత కాలం సుమారు 50 నుంచి 60 ఏళ్ల వరకు ఉంటుందని సూత్రప్రాయంగా నిర్ధారించారు. నెన్నెల మండలం శ్రావణ్పల్లిలో సుమారు 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ సుమారు 250 నుంచి 300 మీటర్ల లోతులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సర్వే అధికారులు తేల్చారు. ఈ గని జీవిత కాలం సుమారు 30 నుంచి 40 ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు కూడా సింగరేణి యాజమాన్యం సిద్ధం చేసింది. ఆ రకంగా బెల్లంపల్లి ప్రాంతంలో ఐదు భూగర్భ గనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. వేలాది మందికి ఉపాధి భూగర్భ గనులు ప్రారంభించడం వల్ల బెల్లంపల్లికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కార్మికుల పిల్లలు ప్రధానంగా వారసత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు. భూగర్భ గనులను ప్రారంభించడం వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒక్కో భూగర్భ గనిని ప్రారంభిస్తే సగటున 3 వేల నుంచి 4 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆ తీరుగా ఐదు గనులను ప్రారంభించడం వల్ల సుమారు 20 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. తద్వారా బెల్లంపల్లి పారిశ్రామికంగా వృద్ధిలోకి వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోపు రెండు, మూడు భూగర్భ బొగ్గు గనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించడంతో బెల్లంపల్లి ప్రాంతంలో భూగర్భ గని ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సింగరేణి అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.