సింగరేణిలో మరో నాలుగు గనులు
- రెండు భూగర్భ మైన్స్... మరో రెండు ఓసీపీలు
- ఏడాదిలోగా పనులు ప్రారంభం
- వార్షిక లక్ష్యం 3.30 మిలియన్ టన్నులు
గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏడాదిలో నాలుగు కొత్త గనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాబోయే ఐదేళ్లలో మొత్తం 17 గనులు ప్రారంభించాలని నిర్ణయించింది.
తొలిదశలో ఈ ఏడాది ఖమ్మం జిల్లా మణుగూరు వద్ద కొండాపూర్ భూగర్భ గని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వద్ద కాసిపేట-2 భూగర్భ గని, బెల్లంపల్లిలో ఓసీపీ-2, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కేకే- ఓసీపీ ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. కొత్తగనుల ద్వారా ఏటా 3.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయూలని లక్ష్యంగా పెట్టుకుంది.
లక్ష్య సాధనకు కొత్త గనులు..
2015-16 ఆర్థిక సంవత్సరంలో 56 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి యూజమాన్యం తన ఉత్పత్తి లక్ష్యాన్ని నివేదించింది. తన వార్షిక లక్ష్యాన్ని మాత్రం 60.03 మిలియన్ టన్నులుగా నిర్దేశించుకుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు కేటాయింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న ఉద్దేశంతో లక్ష్యం ఎక్కుగా నిర్దేశించుకున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తక్కువ చేసి చూపించింది.
ఒడిశా ‘నైనీ’ బ్లాక్‌పై దృష్టి..
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన బొగ్గు బ్లాకుల్లో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సింగరేణి సంస్థకు ఒడిశాలోని ‘నైనీ’ బ్లాక్ దక్కింది. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 600 మెగావాట్ల మూడో విద్యుత్ యూనిట్‌కు అందించే వీలుంది. దీంతో ఈ బ్లాక్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టే ఆలోచనలో ఉంది. అరుుతే, గతంలో నైనీ బ్లాక్‌ను జిందాల్ కంపెనీ చేపట్టింది. ఆ సంస్థ వెచ్చించిన సొమ్మును కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సూచన మేరకు తాను చెల్లించేందుకు సింగరేణి సిద్ధంగా ఉంది. తాను నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్య సాధన వైపు సాగుతోంది.
నిర్దేశిత లక్ష్య సాధనకు కొత్త గనులు
ప్రస్తుతం సింగరేణిలో 34 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని భావించిన యూజమాన్యం.. రాబోయే ఏడాదిలో కొత్త భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు నిర్ణయించింది.