సింగరేణికి నిరాశ | singareni employees dissatisfied with union budget | Sakshi
Sakshi News home page

సింగరేణికి నిరాశ

Published Fri, Feb 2 2018 2:45 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

singareni employees dissatisfied with union budget - Sakshi

శ్రీరాంపూర్‌(మంచిర్యాల) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బొగ్గు గని కార్మికులకు ఎలాంటి ఊరటనివ్వలేదు. ఈసారి బడ్జెట్‌లో ఏమైనా సానుకూల నిర్ణయాలు వస్తాయకున్న కార్మిక వర్గానికి నిరాశే మిగిలింది. కార్మికులే కాకుండా బొగ్గు పరిశ్రమ భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు ఏవీ కూడా ఈ బడ్జెట్‌లో లేకపోవడంపై కార్మికుల సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో సుమారు మూడున్నర లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్జాతీయ కోల్‌మార్కెట్‌లో దేశీయ బొగ్గు సంస్థలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఏమైనా గట్టెక్కించే నిర్ణయాలు తీసుకొంటారని ఆశిస్తే నిరాశ పరిచింది. పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను ఆదుకొనే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం వేలాది కోట్ల పన్ను బొగ్గు పరిశ్రమలను నుంచి వివిధ సెస్‌ల రూపంలో కేంద్ర ఖజానాకు వెళ్తుంది. కాని అటు నుంచి రూపాయి కేటాయింపు కూడా లేదు.

కొత్త గనులకు, బృహత్తర ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం లేదు. కొత్త గనుల కోసం కొన్ని నిధులు ఇస్తే తద్వారా సంస్థలు కొత్త గనులు ఏర్పాటు చేసి మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వీలుంది.  సీఎంపీఎఫ్‌ ట్రస్టీలో నిధులు నిండుకొని లోటు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో పెన్షన్‌ చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసం కొంత నిధిని సమకూర్చాలని చాలా ఏళ్లుగా డిమాండ్‌ ఉండగా.. బడ్జెట్‌లో దీన్ని విస్మరించారు.

ఆదాయ పన్ను పరిధి ఏమాత్రం పెంచకుండా çపçన్ను రహిత స్లాబ్‌ను రూ.2.5 లక్షలకే పరిమితం చేశారు. రూ.2.5 లక్షల దాటిని వారందరు పన్ను పరిధిలోకి వస్తారు. దీనికి తోడు పొదుపు పథకాల కింద సీఎంపీఎఫ్, పోస్టల్‌ వంటి వాటిలో పొదుపు చేసుకుంటే పొదుపు కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఉండదు. ఇది కూడా పాతదే. కొత్తగా ఎలాంటి మార్పులు లేవు. దీంతో కార్మికవర్గం తీవ్ర ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుంది. 10వ వేతన ఒప్పందం జరిగిన నేపథ్యంలో కార్మికుల వేతనాలు ఇటీవల పెరిగాయి. ఈ పెరిగిన వేతనాలు ఐటీ రూపంలో ప్రభుత్వానికే పోతుంది. 10 వేతన ఒప్పందం వేతనాలతో మొదటి కేటగిరి కార్మికులు కూడా ఆదాయ పన్ను బారిన పడుతున్నారు. సీనియర్‌ కార్మికులైతే వారికి వచ్చిన వేతనం ప్రతి సంవత్సరం రూ.లక్ష వరకు ఆదాయ పన్నుకే పోతుంది. స్లాబ్‌ పరిధి పెరుగకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పన్ను మాఫీ అందని ద్రాక్ష....
బొగ్గు గని కార్మికులకు ఆదాయ పన్ను మాఫీ అందని ద్రాక్షగానే మారింది. 15 ఏళ్లుగా కార్మికులు ఈ డిమాండ్‌ చేస్తున్నారు. మిలటరీ, ఆర్మీ వంటి త్రివిద దళాల్లో పనిచేసే వారికి ఆదాయ పన్ను మాఫీ ఉంది. సరిహదుల్లో ఉండే జవాను యుద్ధం వచ్చినప్పుడు తన ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తుంటే బొగ్గు గనుల్లో కార్మికులు నిత్యం ప్రాణాలకు పణంగా పెట్టి పని చేస్తుంటారు. కాబట్టి వీరికి కూడా ఆదాయ పన్ను మాఫీ ఇవ్వాలని డిమాండ్‌ ఉంది. ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నేతలు ఓట్ల కోసం ఈ డిమాండ్‌ను వాడుకుంటున్నారు. తమ ప్రభుత్వం గెలిస్తే ఐటీ మాఫీ చేయిస్తామని హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత విస్మరించడం జరుగుతోంది. బడ్జెట్‌ సమావేశాలకు ముందు జరిగిన శీతాకాల సమావేశాల్లో ఎంపీలు కూడా కేంద్రంపై ఈ అంశం గురించి ఒత్తిడి తేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం.

రూ.2 వేల కోట్లతో ఒరిగేదేమీ లేదు..
బడ్జెట్‌లో సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రంలోని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ప్రతి బడ్జెట్‌లో ఈ ప్రకటన ఉంటుంది. దీని ఉద్దేశం సింగరేణి రూ.2 వేల కోట్ల వరకు ప్రణాళిక వ్యయం కింద ఖర్చు చేసుకొనే వెసులుబాటు కల్పిచడం అని. అంతే తప్ప కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఉండవని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కంపెనీ తన నిధులే తాను ఖర్చు చేసుకోవడానికి ఇచ్చే అనుమతిగా పరిగణించుకోవాలని పేర్కొంటున్నారు.

పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలకు చేసింది శూన్యం
పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను మరోసారి కేంద్రం విస్మరించింది. ఇది కేవలం కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేసే ప్రభుత్వం అని మరోసారి రుజువైంది. ఎలాంటి బడ్జెట్‌ సపోర్టు బొగ్గు పరిశ్రమకు అందించలేదు. కనీసం ఆదాయ పన్ను స్లాబు పెంచితేనైనా కొంత లాభం ఉంటుందనుకుంటే ఆది కూడా లేకుండా పోయింది. వేతనాలు పెరిగినా లాభం లేకుండా పోయింది. తమను గెలిపిస్తే ఆదాయ పన్ను మాఫీ చేయిస్తామని ఓట్ల సమయంలో కార్మికులకు హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి.– వీ.సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి

బడ్జెట్‌ నిరాశ పరిచింది
ఈ బడ్జెట్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. కార్మికులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు. ఆదాయ పన్ను స్లాబు పెంచకపోవడం వల్ల చాలా వేతనం ఐటీకి కోల్పోవాల్సి వస్తుంది. 10 వేజ్‌బోర్డుతో పెరిగిన కొత్త వేతనం ఆదాయ పన్నుకే పోతుంది. పెంచిన వేతనాన్ని ఒక చేతిలో ఇచ్చి.. మరో చేతితో పన్ను రూపంలో తీసుకుంటుంది.– పెట్టం వినోద్, సింగరేణి ఉద్యోగి

దోపిడీ ప్రభుత్వమని రుజువైంది
బీజేపీ దోపిడీ ప్రభుత్వమని మరోసారి రుజువైంది. సగటు ఉద్యోగిని పన్ను రూపంలో దోచుకొనే విధంగానే బడ్జెట్‌ ఉంది. ఐటీస్లాబ్‌ పెంచకపోవడం వల్ల వచ్చిన వేతనంలో 20 నుంచి 30 శాతం పన్నుకే పోతుంది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాçష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి ఎలాంటి రాయితీలు, బడ్జెట్‌ సపోర్టు ఇవ్వలేదు.– ఎన్నం గోవర్ధన్, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement