సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ సింగరేణి కార్మికులు తమ విధులకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ మైన్స్‌లో పనిచేస్తున్న కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణిలో లాక్‌డౌన్‌కు బదులు లేఆఫ్ అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. బుధవారం రెండో షిప్టు నుంచి భూగర్భ గనులను మూసివేస్తున్నట్టుగా వెల్లడించింది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు సామాజిక దూరం పాటించలేని పరిస్థితులు ఉండటంతో.. కార్మికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు బుధవారం సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది.
అయితే మెషిన్ మైనింగ్ ఉన్న ఏఎల్‌పీ, వీకే-7, శాంతి ఖని, జీడేకే-11ఏ ఇంక్లైన్, కొండాపూరం భూగర్భ గనులతో పాటు, అన్ని ఉపరితల గనులను యథావిథిగా నడపనున్నట్టు తెలిపింది. మూసివేసిన గనుల్లో కూడా అవసరమైన విభాగాలకు చెందిన వారు మాత్రం హాజరుకావాల్సి ఉంటుందని చెప్పింది. ఏప్రిల్ 14వ తేదీ అర్థరాత్రి లేదా లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది. లేఆఫ్ కాలంలో చట్టప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించడం జరుగుతందని సింగరేణి వెల్లడించింది. అలాగే పనులు జరుగుతన్న చోట కరోనా కట్టడి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment