ocp
-
ఇళ్లపై పడుతున్న ఓసీపీ బండరాళ్లు
సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీలో బాంబుల మోతలకు కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు–2లో జరుగుతున్న బొగ్గు, మట్టి వెలికితీత పనుల్లో భాగంగా చేపడుతున్న బాంబు బ్లాస్టింగ్లతో మంగళవారం బండరాళ్లు వచ్చి సమీప కాలనీల్లోని ఇళ్లపై పడినాయి. ఓసీపీ–2 సమీపంలోని గాంధీనగర్ కాలనీలోని చిక్కుల దేవేందర్ ఇంటిపై సుమారు 5 కిలోల బరువు గల బండరాయి పడడంతో పై కప్పు రేకులు పగిలిపోయాయి. అయితే ఆ సమయంలో దేవేందర్ భార్య ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ బండరాయి ఆమె మీద పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిబంధనలు గాలికి కాలనీలకు 500 మీటర్ల దూరంలో ఓసీపీలో బాంబు బ్లాస్టింగ్ పనులు చేపట్టాలని నేషనల్ గ్రీన్ట్రిబ్యూనల్ సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కేవలం వంద మీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్లు చేపట్టడం వలన ఇలా బండరాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పేలుళ్ల శబ్దంతో గోడలు పగుళ్లు బారుతున్నాయని వాపోయారు. బ్లాస్టింగ్ చప్పుళ్లతో బెంబేలెత్తుతున్న జనం ప్రతి రోజు రెండు సార్లు బాంబుబ్లాస్టింగ్ చేయడం వలన ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని జంగేడు, పక్కీరుగడ్డ, ఆకుదారివాడ, సుభాష్‌కాలనీ, గాంధినగర్, శాంతినగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక సామర్థ్యం గల బాంబులను వినియోగించడం వలన ఇళ్లు కదులుతున్నాయని బాధితులు గోడును వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఓసీపీ–1లో చేపట్టిన బ్లాస్టింగ్ వలన గడ్డిగానిపల్లి గ్రామంలోని ఇళ్లపైన బండరాళ్లు పడిన సందర్భాలు ఉన్నాయి. అయిన్నప్పటికీ ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పునరావాసంపై పట్టింపేది..?
ముత్తారం: సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణ కోసం భూసేకరణ చేపట్టిన రామగిరి మండలం లద్నాపూర్ నిర్వాసితులకు కల్పించాల్సిన పునరావాసంపై అధికారులకు పట్టింపు కరువైంది. భూసేకరణలో సర్వం కోల్పోయిన నిర్వాసితుల కోరిక మేరకు గ్రామ సమీపంలోనే పునరావాసం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈమేరకు గ్రామ సమీపంలో సర్వే నంబర్ 321, 322ల్లో సుమారు 17.17ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఈ భూమిని ఆనుకొని ఉన్న పట్టా భూముల్లో సుమారు 46 ఎకరాలు భూసేకరణ చేపట్టాలని అంచనా వేశారు. ఈమేరకు పట్టా భూముల సేకరణ కోసం 2013లో డీఎన్, డీడీలను ప్రచురించారు. డీఎన్, డీడీల కాలపరిమితి ముగిసినా ఇప్పటివరకు అధికారులు పునరావాసం కల్పించే ప్రదేశంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టపోవడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణాలు, భూములకు సంబంధించిన నష్టపరిహారం డబ్బులను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసిన నష్టపరిహారం డబ్బులు దుబారాగా ఖర్చు చేయకముందే పునరావసం కల్పిస్తే ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని నిర్వాసితులు వాపోతున్నారు. సగం ఖర్చు.. పరిహారం డబ్బుల్లో ఇప్పటికే దాదాపు 50శాతం పైగా వివిధ అవసరాల కోసం ఖర్చయ్యాయని కొంతమంది నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓసీపీ–2 క్వారీలో నిత్యం చేపడుతున్న బ్లాస్టింగ్ వల్ల బండరాళ్లు ఇళ్లపై వచ్చి పడుతుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్ సమయంలో వెలువడుతున్న దుమ్ము, ధూళి, దుర్వాసన వల్ల అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఓసీపీ క్వారీను ఆనుకొని మొలచిన సర్కార్ తుమ్మల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న అడవిపందులు ఎప్పుడు, ఎవరిపై దాడులు చేస్తాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పునరావాసం పనులను వేగవంతం చేయాలని, పునరావస ప్రదేశంలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు. వాతావరణం కలుషితం గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓసీపీ2 క్వారీలో నిత్యం చేపడుతున్న బ్లాస్టింగ్ వల్ల దుమ్ము, ధూళి లేచి వాతావరణం కలుషితం కావడంతో గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. బ్లాస్టింగ్ల బండరాళ్లు ఇళ్లపై పడుతుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించాల్సి వస్తోంది. – అడ్డూరి ప్రవీణ్, లద్నాపూర్ గ్రామస్తుడు వేగవంతం చేయాలి భూసేకరణ చేపట్టిన సింగరేణి సంస్థ నిర్వాసితులకు కల్పించాల్సిన పునరావసం పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నష్టపరిహారం కింద చెల్లించిన డబ్బులు వృథా కాకముందే పునరావాసం కల్పిస్తే నిర్వాసితులు ఇల్లు కట్టుకునే అవకాశముంది. అధికారులు పునరావాసం పనులను వేగవంతం చేయాలి. – సురేష్, లద్నాపూర్ -
సింగరేణిలో ‘కాపర్’ మాఫియా..!
♦ ఓపెన్కాస్టులే కేంద్రంగా దందా ♦ విద్యుత్ సరఫరా ఉండగానే చోరీ ♦ కిలో రూ.700 నుంచి రూ.1,200 వరకు ♦ రూ. లక్షలు గడిస్తున్న కొందరు ♦ పట్టించుకోని పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సాక్షి, పెద్దపల్లి సింగరేణి ఓపెన్ కాస్టుల నుంచి ఖరీదైన కాపర్‌వైర్ (రాగి తీగ) దందా జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు సింగరేణిలో స్క్రాప్‌ను ఎత్తుకెళ్లి అమ్ముకునే ముఠాలు రెండేళ్లుగా ఖరీదైన కాపర్ వైరు దందా వైపు దృష్టి మరల్చాయి. రాత్రిపూట యథేచ్ఛగా కాపర్ వైరును చోరీ చేసి ఎత్తుకెళ్లి, కాపర్ తీగను వేరు చేసి హైదరాబాద్ లాంటి ప్రాం తాల్లో అమ్ముకుంటున్నారు. పెద్దపల్లి, మం చిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాల్లో 8 ఓపెన్ కాస్టు ప్రాజెక్టు (ఓసీపీ)లు ఉన్నాయి. ఓసీపీలనే లక్ష్యంగా చేసుకుని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని, మంథని, పెద్దపల్లి ప్రాంత్రాలకు చెందిన ముఠాలు యథేచ్ఛగా కాపర్ వైరు చోరీలకు పాల్పడుతున్నాయి. ప్రతీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో భారీయంత్రాలు విద్యుత్ సరఫరా ద్వారా నడుస్తున్నాయి. వీటికోసం త్రీకోర్ కాపర్ ఆర్మ్డ్ కేబుల్ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే, యంత్రాలకు విద్యుత్ సరఫరా కోసం క్వారీ ఏరియాలో వందల మీట ర్ల కాపర్ కేబుల్‌ను సింగరేణి యాజమాన్యం వినియోగిస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో చోరీ ఓసీపీల్లో భారీ యంత్రాలు నడిచేందుకు 33/11 కేవీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే, విద్యుత్ సరఫరా అవుతుండగానే ముఠాలు కాపర్ వైరును చోరీకి వెనుకాడడం లేదు. విద్యుత్ సరఫరా జరుగుతుండగానే రాత్రి పూట పదునైన గొడ్డళ్లతో పవర్కేబుల్ను నరికి తీసుకెళ్తున్నారు. ఒకే సారి ఇలా మీటర్ల కొద్ది వైరును నరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లిన కాపర్ వైరులోంచి రాగి తీగను వేరుచేస్తున్నారు. లేదంటే గోదావరి నది తీరం వెంబడి చోరీ చేసి తీసుకొచ్చిన కేబుల్‌ను కాల్చి వైరును తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో అమ్మకాలు.. కాపర్ ముద్దలను కార్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాపర్ ముద్ద నాణ్యతను బట్టి కిలో రాగి ముద్దను రూ.700 నుంచి రూ.1,200 వరకు అమ్ముకుంటున్నారు. గతంలో వీటిని గోదావరిఖని, ౖయెటింక్లయిన్‌కాలనీ, పెద్దపల్లి, మంథనిలో స్థానికంగా ఉన్న స్క్రాప్ దుకాణాల్లోనూ విక్రయించేవారు. స్థానిక స్క్రాప్ దుకాణాల యజమానులు తక్కువ ధరకు అడుగుతుండడం, పోలీసులకు సమాచారమిచ్చిన సంఘటనలు ఉండడంతో కరీంనగర్, హైదరాబాద్‌లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. సంస్థకు భారీ నష్టం.. కాపర్ కేబుల్ చోరీ ముఠాలతో సింగరేణి సంస్థకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. భారీ యంత్రాలు నడుస్తున్న సమయంలో కేబుల్‌ను నరికి వేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి యంత్రాలు నిలిచిపోతున్నాయి. దీంతో భారీ యంత్రానికి అనుబంధంగా పనిచేసే డంపర్లు ఆగిపోతున్నాయి. దీన్ని గుర్తించి కొత్త కేబుల్ ఏర్పాటు చేసే సరికి ఒక షిఫ్టు మొత్తం సమయం పడుతోంది. దీంతో కార్మికులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. దీనికి తోడు కొత్తగా కొనుగోలు చేయాల్సిన కాపర్ కేబుల్‌ను కిలోకు రూ.900 నుంచి రూ.2,000 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇలా మొత్తంగా మిషన్లు, కార్మికులు ఖాళీగా ఉండడంతో భారీగా నష్టం వాటిల్లుతోందని అధికారులు పేర్కొంటున్నారు. పట్టించుకోని సెక్యూరిటీ,పోలీసు విభాగం.. సింగరేణి సంస్థ నుంచి భారీ స్థాయిలో ఐరన్‌స్క్రాప్, కాపర్ కేబుల్ చోరీలు పెద్దమొత్తంలో జరుగుతున్నా సింగరేణి సెక్యూరిటీ విభాగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తరచూ చోరీలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అలాగే కాఫర్, స్క్రాప్ ముఠాలపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ వినపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సింగరేణి నుంచి మాయమవుతున్న కాపర్ వైరుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు చేపడితే సింగరేణి సంస్థను కాపాడిన వారవుతారు. -
బ్లాస్టింగ్లతో ప్రమాదమంటూ ఆందోళన
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో సింగరేణి ఓసీపీ-3 పనులకు ఆటంకం ఏర్పడింది. ఓసీపీ ద్వారా బొగ్గు తీసే సమయంలో ప్రయోగించే బ్లాస్టింగ్ శబ్ధాలు,గనుల్లోంచి వెలువడే దుమ్ము, ధూళీలతో పెద్దంపేట గ్రామంలోని వాతారవరణం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి ఓసీపీ-3 ఓబీ పనులను అడ్డుకున్నారు. -
ఇరకాటంలో 'గులాబీ' నేతలు
'ప్రాణహిత' తరలింపుపై ఎటూ తేల్చుకోని వైనం పెదవి విప్పని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఊపందుకున్న ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పోరాటం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తరలింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం జిల్లాలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసింది. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు నాయకులూ ఈ అంశంపై నోరు మెదపడం లేదు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీని కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి తరలిస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గూడెం వద్ద జరిగిన బహిరంగ సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. తరలింపు నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు, పలు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రాజెక్టు తరలింపుతో జిల్లాలో సుమారు 56 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా.. ఇప్పటివరకు ఈ పనుల కోసం ఖర్చు చేసిన రూ.9 వేల కోట్లు నిధులు మట్టిపాలవుతాయని ప్రజా సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఆందోళనలు, నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉధృతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాకు పరిమితమైన నిరసనలు.. రాష్ట్ర స్థాయిలో చేపట్టారు. అయినప్పటికీ జిల్లాలోని అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం నోరు విప్పడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌లో చేసిన ప్రకటన మినహా.. జిల్లాలో ఒక్క నేత కూడా ఈ అంశంపై కనీసం మీడియాతో కూడా ప్రస్తావించడం లేదు. ఈ ప్రాజెక్టు కింద 56 వేల ఎకరాలున్న జిల్లా ఆయకట్టును 1.50 లక్షల ఎకరాలకు పెంచుతామని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి గానీ, నేత గానీ ప్రకటన చేసిన దాఖలాలు లేవు. ఈ బ్యారేజీ తరలింపుతో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే సిర్పూర్-టి, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల పరిధిలోని నేతలు సైతం నోరు విప్పేందుకు సాహసించడం లేదు. ఓసీపీల విషయంలోనూ.. ఓపెన్‌కాస్టు గనుల విషయంలోనూ అధికార పార్టీ నేతలది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ ఓసీపీలను వ్యతిరేకించింది. తెలంగాణ వచ్చాక భూగర్భ గనులనే ప్రారంభిస్తామని అధినేత కేసీఆర్‌తోపాటు, పార్టీ నాయకులు పలుమార్లు బహిరంగ సభల్లో ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంతో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగాయి. ఈ సంక్షోభాన్ని గట్టెక్కాలంటే విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తక్షణ బొగ్గు అవసరాలు తీరాలంటే ఓసీపీలే శరణ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో మందమర్రి, కాసిపేట మండలాల మధ్య కేకే ఓసీపీని ప్రారంభించే దిశగా సింగరేణి అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎర్రగుంటపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ఓసీపీల విషయంలో అధికార పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. -
సింగరేణిలో మరో నాలుగు గనులు
- రెండు భూగర్భ మైన్స్... మరో రెండు ఓసీపీలు - ఏడాదిలోగా పనులు ప్రారంభం - వార్షిక లక్ష్యం 3.30 మిలియన్ టన్నులు గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏడాదిలో నాలుగు కొత్త గనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాబోయే ఐదేళ్లలో మొత్తం 17 గనులు ప్రారంభించాలని నిర్ణయించింది. తొలిదశలో ఈ ఏడాది ఖమ్మం జిల్లా మణుగూరు వద్ద కొండాపూర్ భూగర్భ గని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వద్ద కాసిపేట-2 భూగర్భ గని, బెల్లంపల్లిలో ఓసీపీ-2, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కేకే- ఓసీపీ ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. కొత్తగనుల ద్వారా ఏటా 3.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయూలని లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్య సాధనకు కొత్త గనులు.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 56 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి యూజమాన్యం తన ఉత్పత్తి లక్ష్యాన్ని నివేదించింది. తన వార్షిక లక్ష్యాన్ని మాత్రం 60.03 మిలియన్ టన్నులుగా నిర్దేశించుకుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు కేటాయింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న ఉద్దేశంతో లక్ష్యం ఎక్కుగా నిర్దేశించుకున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తక్కువ చేసి చూపించింది. ఒడిశా ‘నైనీ’ బ్లాక్‌పై దృష్టి.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన బొగ్గు బ్లాకుల్లో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సింగరేణి సంస్థకు ఒడిశాలోని ‘నైనీ’ బ్లాక్ దక్కింది. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 600 మెగావాట్ల మూడో విద్యుత్ యూనిట్‌కు అందించే వీలుంది. దీంతో ఈ బ్లాక్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టే ఆలోచనలో ఉంది. అరుుతే, గతంలో నైనీ బ్లాక్‌ను జిందాల్ కంపెనీ చేపట్టింది. ఆ సంస్థ వెచ్చించిన సొమ్మును కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సూచన మేరకు తాను చెల్లించేందుకు సింగరేణి సిద్ధంగా ఉంది. తాను నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్య సాధన వైపు సాగుతోంది. నిర్దేశిత లక్ష్య సాధనకు కొత్త గనులు ప్రస్తుతం సింగరేణిలో 34 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని భావించిన యూజమాన్యం.. రాబోయే ఏడాదిలో కొత్త భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. -
మేడిపల్లి ఓసీపీలో డంపర్ బోల్తా
గోదావరిఖని : సింగరేణి ఆర్జీ-1 డివిజన్ పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బుధవారం మధ్యాహ్నం సీ-28 నెంబర్ గల డంపర్ బోల్తా పడింది. ప్రాజెక్టులోని ఫేజ్-1 ఏరియా 4వ సీమ్ వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న డంపర్ వాహనంలో స్టీరింగ్ రాడ్ లాక్ అయి తిరగకపోవడంతో పక్కనున్న మట్టి బర్మ్‌ను ఢీకొట్టి డంపర్ బోల్తాపడింది. దీంతో వాహనంలో బ్యాటరీలు ఆపరేటర్ కొమ్మిడి రాజిరెడ్డిపై పడడంతో అతను స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
మిగిలింది 27 రోజులే..
శ్రీరాంపూర్ : సింగరేణిలో ఉత్పత్తి కౌంట్ డౌన్ మొదలైంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ లోగా కంపెనీ నిర్దేశించిన లక్ష్యా న్ని సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కార్మికులు అధికసంఖ్యలో పని చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా గనులపై ఉత్పత్తి భారం ఎక్కువగా ఉంది. కా నీ.. పరిస్థితి చూస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా కనిపించడం లేదు. అయినా.. యాజమాన్యం ఉత్ప త్తి కోసం అధికారుల నుంచి మొదలుకుని కార్మికుల వరకు ఉరుకులు పరుగులు పెటిస్తోంది. మొదటి మూడు త్రైమాసికాల్లో శ్రద్ధచూపని యాజమాన్యం ఇప్పుడు ఒక్కసారిగా లక్ష్య సాధనకు కార్మికులపై ఒత్తిడి తెస్తోంది. జిల్లాలో మూడు డివిజన్లు.. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. రీజియన్ వ్యాప్తంగా ఉత్పత్తిని పరిశీలిస్తే ఈ మూడు డివిజన్లు 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం అనుమానే అనిపిస్తోంది. ఈ మూడు ఏరియాల్లో ఒక్క శ్రీరాంపూర్ మాత్రమే 102 శాతంతో లక్ష్యాన్ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా.. మిగిలిన మందమర్రి, బెల్లంపల్లి చాలా వెనుకంజలో ఉన్నాయి. రీజియన్ మొత్తం మార్చి 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 123.39 లక్షల టన్నులు ఉంటే.. అందులో కేవలం 100.47 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 80 శాతం ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది. బెల్లంపల్లి ఏరియాలో.. బెల్లంపల్లి వార్షిక లక్ష్యం 54 లక్షల టన్నులుగా ఉంది. కానీ.. ఇప్పటికీ అందులో సాధించింది 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. ఇంకా 16.15 లక్షల టన్నుల లోటు ఉంది. ఇదిలా ఉంటే రోజు వారి ఉత్పత్తి లక్ష్యం ఈ డివిజన్లో 21 వేలు ఉంది. కానీ.. ఇందులో 14 వేల టన్నులు మాత్రమే వస్తోంది. రోజుకు 6 వేల టన్నుల లోటుతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యం పరిశీలిస్తే(3 తేదీ నాటికి) 55.63 లక్షల టన్నులుంటే.. అందులో కేవలం 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 68 శాతం ఉత్పత్తి నమోదైంది. ఉన్న ఓసీపీల్లో అనుకున్నంత బొగ్గు రావడం లేదు. ఓబీ సమస్య ప్రధాన కారణంగా ఉంది. మందమర్రి డివిజన్లో.. మందమర్రి డివిజన్‌కు మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యం 21.8 లక్షల టన్నులు ఉంది. కానీ.. ఈ లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలే లేవు. డివిజన్ రోజువారి ఉత్పత్తి లక్ష్యం 9 వేల టన్నులు ఉంది. ఇందులో 7500 టన్నులు మాత్రమే వస్తోంది. ఎక్కుగా భూగర్భ గనులు ఉండడం, దీనికితోడు ఉత్పత్తికి దిక్కనుకున్న ఆర్కేపీ ఓసీపీలో కూడా ఆశించినంత బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నారు. ఈ నెల 3వ తేదీ నాటికి ఉన్న లక్ష్యాన్ని పరిశీలిస్తే 20.03 లక్షల టన్నులకు గాను 14.09 టన్నులు మాత్రమే సాధించి 70 శాతం లక్ష్యాన్ని సాధించింది. దీంతో మిగిలిన లక్ష్యంతోపాటు ఉన్న లోటును భర్తీ చేయడం కష్టతరమే అని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీరాంపూర్ డివిజన్లో.. శ్రీరాంపూర్ డివిజన్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ డివిజన్ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 52.60 లక్షల టన్నులు. ఇది మార్చి 31 వరకు సాధిం చాలి. రీజియన్‌లో ఉత్పత్తి లక్ష్యం సాధించే డివిజన్ ఇది ఒక్కటేనని అర్థమవుతోంది. ఈ డివిజన్ గనుల్లో రోజువారి ఉత్పత్తి లక్ష్యం 23వేల టన్నులుంటే.. అం తే ఉత్పత్తిని సాధిస్తూ వస్తోంది. మిగిలిన 27 రోజు ల్లో కూడా ఇదే ఉత్పత్తితో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యం సాధించడం ఖాయమని అధికారులు పేర్కొం టున్నారు. ఈ నెల 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 47.71 లక్షల టన్నులకు గాను 48.52 టన్నులు సాధించి 102 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకుంది. ఉత్పత్తి నష్టానికి అనేక కారణాలు.. ఇదిలా ఉంటే ఉత్పత్తి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓసీపీల్లో వర్షాకాలంలో కురిసిన వర్షాలతో ఉత్పత్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఇటీవల జరిగిన దేశ వ్యాప్త సమ్మె కూడా కొంత కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపింది. సమ్మెతో ఓసీపీల్లో ఓబీ పనులకు ఆటకం కలిగి దాని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. దీనికితోడు భూగర్భ గనుల్లో వర్కింగ్ ప్లేస్‌లు లేకపోవడంతో దీనికి తోడు మొదటి మూడు త్రైమాసికాల్లో కూడా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రభావం చూపాయి. గాడితప్పిన పాలనతో ఉత్పత్తిపై పైస్థాయి అజమాయిషి కొరవడింది. కొత్తగా సీఅండ్ఎండీగా శ్రీధర్ వచ్చిన తరువాత నే కంపెనీ మెల్లిమెల్లిగా గాడిల పడిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఉత్పత్తి లక్ష్యంలో రీజియన్ ఈ సారి వెనుకబడుతుందనే సంకేతాలే కనిపిస్తున్నాయి. -
సింగరేణిలో మరో ఓసీపీ
యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-2 ఏరియాలో మూసివేసిన జీడీకే-8, 8ఏ గనుల స్థానంలో ఓసీపీ-3 ఎక్స్టెన్షన్-2 ప్రాజెక్టు పేరున కొత్త ఓసీపీని ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలను వేగవంతం చేసింది. దీనికోసం ముందుగా పర్యావ రణ అనుమతులు లభించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. అధికారులు నూతన ఓసీపీకి సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తుండగా పర్యావరణ అనుమతుల కోసం ఓసీపీ-3 సమీప గ్రామాలలైన పెద్దంపేట్, వెంకట్రావ్పల్లి, వకీల్ పల్లి, రాజీవ్‌నగర్‌తండా ప్రజలతో బహిరంగసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే పనులు వేగవంతం చేస్తున్నారు. ముందుగా కలెక్టర్‌కు ఈ నివేదికలు సమర్పించి ఆయన సూచనల మేరకు జూలై చివరి లేదా ఆగస్టు మొదటివారంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. బహిరంగసభ నిర్వహించేందుకు స్థానిక రెస్క్యూ స్టేషన్ ముందు గల జీడీకే-8ఏ గని మామిడితోట ప్రాంతంలో భూమిని చదును చేస్తున్నారు. పర్యావరణ అధికారులతో సింగరేణి యాజమాన్యం చర్చించి కావాల్సిన ఏర్పాట్లను చేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత పర్యావరణ అనుమతులు లభించిన వెంటనే ప్రాజెక్టు ప్రారంభించాలని యాజమాన్యం యోచిస్తోంది. శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఈఈ శంకర్‌నాయక్, సింగరేణి అధికారులు రవీందర్, శ్రీవాస్తవ, కృపాకర్ ప్రాజెక్టు మ్యాప్‌పై చర్చించారు.