- 'ప్రాణహిత' తరలింపుపై ఎటూ తేల్చుకోని వైనం
- పెదవి విప్పని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
- ఊపందుకున్న ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పోరాటం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తరలింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం జిల్లాలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసింది. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు నాయకులూ ఈ అంశంపై నోరు మెదపడం లేదు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీని కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి తరలిస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గూడెం వద్ద జరిగిన బహిరంగ సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. తరలింపు నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు, పలు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రాజెక్టు తరలింపుతో జిల్లాలో సుమారు 56 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా.. ఇప్పటివరకు ఈ పనుల కోసం ఖర్చు చేసిన రూ.9 వేల కోట్లు నిధులు మట్టిపాలవుతాయని ప్రజా సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఆందోళనలు, నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉధృతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాకు పరిమితమైన నిరసనలు.. రాష్ట్ర స్థాయిలో చేపట్టారు. అయినప్పటికీ జిల్లాలోని అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం నోరు విప్పడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌లో చేసిన ప్రకటన మినహా.. జిల్లాలో ఒక్క నేత కూడా ఈ అంశంపై కనీసం మీడియాతో కూడా ప్రస్తావించడం లేదు. ఈ ప్రాజెక్టు కింద 56 వేల ఎకరాలున్న జిల్లా ఆయకట్టును 1.50 లక్షల ఎకరాలకు పెంచుతామని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి గానీ, నేత గానీ ప్రకటన చేసిన దాఖలాలు లేవు. ఈ బ్యారేజీ తరలింపుతో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే సిర్పూర్-టి, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల పరిధిలోని నేతలు సైతం నోరు విప్పేందుకు సాహసించడం లేదు.
ఓసీపీల విషయంలోనూ..
ఓపెన్‌కాస్టు గనుల విషయంలోనూ అధికార పార్టీ నేతలది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వరకు టీఆర్‌ఎస్ పార్టీ ఓసీపీలను వ్యతిరేకించింది. తెలంగాణ వచ్చాక భూగర్భ గనులనే ప్రారంభిస్తామని అధినేత కేసీఆర్‌తోపాటు, పార్టీ నాయకులు పలుమార్లు బహిరంగ సభల్లో ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంతో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగాయి. ఈ సంక్షోభాన్ని గట్టెక్కాలంటే విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తక్షణ బొగ్గు అవసరాలు తీరాలంటే ఓసీపీలే శరణ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో మందమర్రి, కాసిపేట మండలాల మధ్య కేకే ఓసీపీని ప్రారంభించే దిశగా సింగరేణి అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎర్రగుంటపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ఓసీపీల విషయంలో అధికార పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.