సింగరేణిలో మరో ఓసీపీ
యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-2 ఏరియాలో మూసివేసిన జీడీకే-8, 8ఏ గనుల స్థానంలో ఓసీపీ-3 ఎక్స్‌టెన్షన్-2 ప్రాజెక్టు పేరున కొత్త ఓసీపీని ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలను వేగవంతం చేసింది. దీనికోసం ముందుగా పర్యావ రణ అనుమతులు లభించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. అధికారులు నూతన ఓసీపీకి సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తుండగా పర్యావరణ అనుమతుల కోసం ఓసీపీ-3 సమీప గ్రామాలలైన పెద్దంపేట్, వెంకట్రావ్‌పల్లి, వకీల్ పల్లి, రాజీవ్‌నగర్‌తండా ప్రజలతో బహిరంగసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే పనులు వేగవంతం చేస్తున్నారు.
ముందుగా కలెక్టర్‌కు ఈ నివేదికలు సమర్పించి ఆయన సూచనల మేరకు జూలై చివరి లేదా ఆగస్టు మొదటివారంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. బహిరంగసభ నిర్వహించేందుకు స్థానిక రెస్క్యూ స్టేషన్ ముందు గల జీడీకే-8ఏ గని మామిడితోట ప్రాంతంలో భూమిని చదును చేస్తున్నారు.
పర్యావరణ అధికారులతో సింగరేణి యాజమాన్యం చర్చించి కావాల్సిన ఏర్పాట్లను చేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత పర్యావరణ అనుమతులు లభించిన వెంటనే ప్రాజెక్టు ప్రారంభించాలని యాజమాన్యం యోచిస్తోంది. శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఈఈ శంకర్‌నాయక్, సింగరేణి అధికారులు రవీందర్, శ్రీవాస్తవ, కృపాకర్ ప్రాజెక్టు మ్యాప్‌పై చర్చించారు.