సింగరేణిలో ‘కాపర్‌’ మాఫియా..! | Copper mafia in Singareni | Sakshi
Sakshi News home page

సింగరేణిలో ‘కాపర్‌’ మాఫియా..!

Published Sat, May 27 2017 3:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

సింగరేణిలో ‘కాపర్‌’ మాఫియా..! - Sakshi

సింగరేణిలో ‘కాపర్‌’ మాఫియా..!

ఓపెన్‌కాస్టులే కేంద్రంగా దందా
విద్యుత్‌ సరఫరా ఉండగానే చోరీ
కిలో రూ.700 నుంచి రూ.1,200 వరకు
రూ. లక్షలు గడిస్తున్న కొందరు
పట్టించుకోని పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ


సాక్షి, పెద్దపల్లి
సింగరేణి ఓపెన్‌ కాస్టుల నుంచి ఖరీదైన కాపర్‌వైర్‌ (రాగి తీగ) దందా జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు సింగరేణిలో స్క్రాప్‌ను ఎత్తుకెళ్లి అమ్ముకునే ముఠాలు రెండేళ్లుగా ఖరీదైన కాపర్‌ వైరు దందా వైపు దృష్టి మరల్చాయి. రాత్రిపూట యథేచ్ఛగా కాపర్‌ వైరును చోరీ చేసి ఎత్తుకెళ్లి, కాపర్‌ తీగను వేరు చేసి హైదరాబాద్‌ లాంటి ప్రాం తాల్లో అమ్ముకుంటున్నారు. పెద్దపల్లి, మం చిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి.

 ప్రస్తుతం ఈ జిల్లాల్లో 8 ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టు (ఓసీపీ)లు ఉన్నాయి. ఓసీపీలనే లక్ష్యంగా చేసుకుని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని, మంథని, పెద్దపల్లి ప్రాంత్రాలకు చెందిన ముఠాలు యథేచ్ఛగా కాపర్‌ వైరు చోరీలకు పాల్పడుతున్నాయి. ప్రతీ ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులో భారీయంత్రాలు విద్యుత్‌ సరఫరా ద్వారా నడుస్తున్నాయి. వీటికోసం త్రీకోర్‌ కాపర్‌ ఆర్మ్‌డ్‌ కేబుల్‌ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే, యంత్రాలకు విద్యుత్‌ సరఫరా కోసం క్వారీ ఏరియాలో వందల మీట ర్ల కాపర్‌ కేబుల్‌ను సింగరేణి యాజమాన్యం వినియోగిస్తోంది.

ప్రమాదకర పరిస్థితుల్లో చోరీ
ఓసీపీల్లో భారీ యంత్రాలు నడిచేందుకు 33/11 కేవీ విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అయితే, విద్యుత్‌ సరఫరా అవుతుండగానే ముఠాలు కాపర్‌ వైరును చోరీకి వెనుకాడడం లేదు. విద్యుత్‌ సరఫరా జరుగుతుండగానే రాత్రి పూట పదునైన గొడ్డళ్లతో పవర్‌కేబుల్‌ను నరికి తీసుకెళ్తున్నారు. ఒకే సారి ఇలా మీటర్ల కొద్ది వైరును నరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లిన కాపర్‌ వైరులోంచి రాగి తీగను వేరుచేస్తున్నారు. లేదంటే గోదావరి నది తీరం వెంబడి చోరీ చేసి తీసుకొచ్చిన కేబుల్‌ను కాల్చి వైరును తరలిస్తున్నారు.

హైదరాబాద్‌లో అమ్మకాలు..
కాపర్‌ ముద్దలను కార్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాపర్‌ ముద్ద నాణ్యతను బట్టి కిలో రాగి ముద్దను రూ.700 నుంచి రూ.1,200 వరకు అమ్ముకుంటున్నారు. గతంలో వీటిని గోదావరిఖని, ౖయెటింక్లయిన్‌కాలనీ, పెద్దపల్లి, మంథనిలో స్థానికంగా ఉన్న స్క్రాప్‌ దుకాణాల్లోనూ విక్రయించేవారు. స్థానిక స్క్రాప్‌ దుకాణాల యజమానులు తక్కువ ధరకు అడుగుతుండడం, పోలీసులకు సమాచారమిచ్చిన సంఘటనలు ఉండడంతో కరీంనగర్, హైదరాబాద్‌లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు.

సంస్థకు భారీ నష్టం..
కాపర్‌ కేబుల్‌ చోరీ ముఠాలతో సింగరేణి సంస్థకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. భారీ యంత్రాలు నడుస్తున్న సమయంలో కేబుల్‌ను నరికి వేయడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగి యంత్రాలు నిలిచిపోతున్నాయి. దీంతో భారీ యంత్రానికి అనుబంధంగా పనిచేసే డంపర్లు ఆగిపోతున్నాయి. దీన్ని గుర్తించి కొత్త కేబుల్‌ ఏర్పాటు చేసే సరికి ఒక షిఫ్టు మొత్తం సమయం పడుతోంది. దీంతో కార్మికులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. దీనికి తోడు కొత్తగా కొనుగోలు చేయాల్సిన కాపర్‌ కేబుల్‌ను కిలోకు రూ.900 నుంచి రూ.2,000 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇలా మొత్తంగా మిషన్లు, కార్మికులు ఖాళీగా ఉండడంతో భారీగా నష్టం వాటిల్లుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

పట్టించుకోని సెక్యూరిటీ,పోలీసు విభాగం..
సింగరేణి సంస్థ నుంచి భారీ స్థాయిలో ఐరన్‌స్క్రాప్, కాపర్‌ కేబుల్‌ చోరీలు పెద్దమొత్తంలో జరుగుతున్నా సింగరేణి సెక్యూరిటీ విభాగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తరచూ చోరీలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అలాగే కాఫర్, స్క్రాప్‌ ముఠాలపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ వినపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సింగరేణి నుంచి మాయమవుతున్న కాపర్‌ వైరుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు చేపడితే సింగరేణి సంస్థను కాపాడిన వారవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement