Copper Wire
-
కాపర్‌వైరు చోరీ నిందితుడికి రిమాండ్
మామడ: ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ చోరీ కేసులో మండల కేంద్రానికి చెందిన రాపని ఎల్లయ్యను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నవీన్‌కుమార్, ఎస్సై అశోక్ గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాపని ఎల్లయ్య 2017 నుంచి వరంగల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఆరేళ్ల నుంచి ప్రతి ఆరు నెలలకోసారి పెరోల్‌పై 30 రోజులు ఇంటికి వచ్చి జైలుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌వైరు చోరీ చేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న పాత నేరస్తులు మహారాష్ట్రకు చెందిన ఫఖర్ గోరే, నిజామాబాద్‌కు చెందిన బాబురావు దండేల్వర్తో కలిసి కడెం, సోన్, లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్, మామడ మండలంలోని లింగాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్‌వైర్ చోరీ చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక సాయంతో వలపన్ని నిందితుడు ఎల్లయ్యను పట్టుకున్నారు. చోరీ కోసం వినియోగించిన రింగు పానలు, సెల్‌ఫోన్, కాపర్‌వైరును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో ఫఖర్ గోరేను గత వారం అరెస్ట్ చేయగా, మరో నిందితుడు బాబూరావ్ దండేల్వర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
అతి తెలివితో స్టీల్‌ప్లాంట్ సొత్తు చోరీ
ఉక్కునగరం(గాజువాక): రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు స్టీల్‌ప్లాంట్ సొత్తు దొంగల పాలు అవుతూనే ఉంది. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంత పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినా దొంగలు విభిన్న పద్ధతుల్లో సొత్తును తరలిస్తూనే ఉన్నారు. ప్రహరీ గోడకు కన్నం పెట్టడం, గోడ లోపల నుంచి బయటకు చోరీ సొత్తును విసరడం, బైకు ట్యాంకు కింద ప్రత్యేక అమరిక ద్వారా సొత్తును తరలించడం వంటి పద్ధతుల్లో దొంగలు చోరీలు చేస్తుండేవారు. వాటిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో ఏకంగా శరీరానికి చుట్టుకుని రాగిని తరలిస్తుండగా శుక్రవారం ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. స్టీల్‌ప్లాంట్ కోక్ ఓవెన్ ఐదో బ్యాటరీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న నడుపూరుకు చెందిన జి.మన్మథరావు (49) సాయంత్రం 7 గంటల సమయంలో విధుల నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. బీసీ గేటు వద్ద అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేయగా ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకోవడం చూసి సీఐఎస్ఎఫ్ సిబ్బంది నివ్వెరపోయారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. రాగి వైరు మాత్రమే తరలించడం చూస్తే దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదో ప్రాంతంలో కేబుల్ దాచి అక్కడ దాని నుంచి తీగను వేరు చేసి బయటకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చోరీ ఎన్నాళ్ల నుంచి ఎంత మంది చేస్తున్నారు.. ఎంత మంది ఉన్నారు అన్నది సమగ్ర దర్యాప్తు చేస్తే వాటి మూలాలు బయటపడే అవకాశం ఉంది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు దీనిని కేవలం ఒక దొంగతనంగా మాత్రం కాకుండా లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఆకాశవాణిలో దొంగలు పడ్డారు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)ఢిల్లీ కేంద్రంలో దొంగలు పడ్డారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ని ఆకాశవాణి కేంద్రంలో విలువైన రాగి వైర్లను కొందరు వ్యక్తులు అపహరించుకుపోయారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. 300 ఎకరాలలో విస్తరించి ఉన్న ఆల్ ఇండియా రేడియో హై పవర్ ట్రాన్స్మిషన్ ఏరియల్ ఫీల్డ్ వద్ద రాగి తీగను దొంగిలించిన కేసులో షాన్ మొహమాద్ (24), షాజాద్ (26), అభిషేక్ (22) అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వద్ద నుంచి మొత్తం 200 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కొట్టేసిన వైర్లను కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్క్రాప్ డీలర్ మొహమద్ (26) ను కూడా అరెస్టు చేశారు. అతని నుండి రాగి తీగల కట్టలను స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలు దాడులు నిర్వహించిన తరువాత ఉమేద్ (33), అక్షయ్ (22) అనే మరో ఇద్దర్ని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఏఐఆర్‌లో రాగి తీగలను దొంగిలించి, తక్కువ ధరలకు స్క్రాప్ డీలర్లకు విక్రయించడమే వీరి పని అనీ, మరో ముగ్గురు వ్యక్తుల కోసం వేట కొనసాగుతోందని, దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
సింగరేణిలో ‘కాపర్’ మాఫియా..!
♦ ఓపెన్కాస్టులే కేంద్రంగా దందా ♦ విద్యుత్ సరఫరా ఉండగానే చోరీ ♦ కిలో రూ.700 నుంచి రూ.1,200 వరకు ♦ రూ. లక్షలు గడిస్తున్న కొందరు ♦ పట్టించుకోని పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సాక్షి, పెద్దపల్లి సింగరేణి ఓపెన్ కాస్టుల నుంచి ఖరీదైన కాపర్‌వైర్ (రాగి తీగ) దందా జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు సింగరేణిలో స్క్రాప్‌ను ఎత్తుకెళ్లి అమ్ముకునే ముఠాలు రెండేళ్లుగా ఖరీదైన కాపర్ వైరు దందా వైపు దృష్టి మరల్చాయి. రాత్రిపూట యథేచ్ఛగా కాపర్ వైరును చోరీ చేసి ఎత్తుకెళ్లి, కాపర్ తీగను వేరు చేసి హైదరాబాద్ లాంటి ప్రాం తాల్లో అమ్ముకుంటున్నారు. పెద్దపల్లి, మం చిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాల్లో 8 ఓపెన్ కాస్టు ప్రాజెక్టు (ఓసీపీ)లు ఉన్నాయి. ఓసీపీలనే లక్ష్యంగా చేసుకుని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని, మంథని, పెద్దపల్లి ప్రాంత్రాలకు చెందిన ముఠాలు యథేచ్ఛగా కాపర్ వైరు చోరీలకు పాల్పడుతున్నాయి. ప్రతీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో భారీయంత్రాలు విద్యుత్ సరఫరా ద్వారా నడుస్తున్నాయి. వీటికోసం త్రీకోర్ కాపర్ ఆర్మ్డ్ కేబుల్ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే, యంత్రాలకు విద్యుత్ సరఫరా కోసం క్వారీ ఏరియాలో వందల మీట ర్ల కాపర్ కేబుల్‌ను సింగరేణి యాజమాన్యం వినియోగిస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో చోరీ ఓసీపీల్లో భారీ యంత్రాలు నడిచేందుకు 33/11 కేవీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే, విద్యుత్ సరఫరా అవుతుండగానే ముఠాలు కాపర్ వైరును చోరీకి వెనుకాడడం లేదు. విద్యుత్ సరఫరా జరుగుతుండగానే రాత్రి పూట పదునైన గొడ్డళ్లతో పవర్కేబుల్ను నరికి తీసుకెళ్తున్నారు. ఒకే సారి ఇలా మీటర్ల కొద్ది వైరును నరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లిన కాపర్ వైరులోంచి రాగి తీగను వేరుచేస్తున్నారు. లేదంటే గోదావరి నది తీరం వెంబడి చోరీ చేసి తీసుకొచ్చిన కేబుల్‌ను కాల్చి వైరును తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో అమ్మకాలు.. కాపర్ ముద్దలను కార్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాపర్ ముద్ద నాణ్యతను బట్టి కిలో రాగి ముద్దను రూ.700 నుంచి రూ.1,200 వరకు అమ్ముకుంటున్నారు. గతంలో వీటిని గోదావరిఖని, ౖయెటింక్లయిన్‌కాలనీ, పెద్దపల్లి, మంథనిలో స్థానికంగా ఉన్న స్క్రాప్ దుకాణాల్లోనూ విక్రయించేవారు. స్థానిక స్క్రాప్ దుకాణాల యజమానులు తక్కువ ధరకు అడుగుతుండడం, పోలీసులకు సమాచారమిచ్చిన సంఘటనలు ఉండడంతో కరీంనగర్, హైదరాబాద్‌లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. సంస్థకు భారీ నష్టం.. కాపర్ కేబుల్ చోరీ ముఠాలతో సింగరేణి సంస్థకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. భారీ యంత్రాలు నడుస్తున్న సమయంలో కేబుల్‌ను నరికి వేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి యంత్రాలు నిలిచిపోతున్నాయి. దీంతో భారీ యంత్రానికి అనుబంధంగా పనిచేసే డంపర్లు ఆగిపోతున్నాయి. దీన్ని గుర్తించి కొత్త కేబుల్ ఏర్పాటు చేసే సరికి ఒక షిఫ్టు మొత్తం సమయం పడుతోంది. దీంతో కార్మికులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. దీనికి తోడు కొత్తగా కొనుగోలు చేయాల్సిన కాపర్ కేబుల్‌ను కిలోకు రూ.900 నుంచి రూ.2,000 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇలా మొత్తంగా మిషన్లు, కార్మికులు ఖాళీగా ఉండడంతో భారీగా నష్టం వాటిల్లుతోందని అధికారులు పేర్కొంటున్నారు. పట్టించుకోని సెక్యూరిటీ,పోలీసు విభాగం.. సింగరేణి సంస్థ నుంచి భారీ స్థాయిలో ఐరన్‌స్క్రాప్, కాపర్ కేబుల్ చోరీలు పెద్దమొత్తంలో జరుగుతున్నా సింగరేణి సెక్యూరిటీ విభాగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తరచూ చోరీలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అలాగే కాఫర్, స్క్రాప్ ముఠాలపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ వినపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సింగరేణి నుంచి మాయమవుతున్న కాపర్ వైరుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు చేపడితే సింగరేణి సంస్థను కాపాడిన వారవుతారు. -
ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు
కడప(చిన్నమండెం): గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను దొంగలించుకుపోయారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామ పరిధిలో జరిగింది. స్థానిక నేరాలవంక పల్లెకు చెందిన రైతులు ట్రాన్స్ఫార్మర్ కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వ అధికారులు స్పందించలేదు. దీంతో రైతులంతా కలిసి సొంత డబ్బులతో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని మంగళవారం గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉండే కాపర్‌వైర్ ఎత్తుకెళ్లారు. బుధవారం విద్యుత్ వచ్చే సమయానికి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతులు విషయం తెలిసి బోరుమన్నారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు
- ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లలో రాగివైరు చోరీ - గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 22 దొంగతనాలు - మొత్తం రూ.4.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చిలకలూరిపేట రూరల్ (గుంటూరు) : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లాల దొంగల ముఠాను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు దొంగిలిస్తుంటారు. నిందితుల వద్ద నుంచి రూ.3,55,225 విలువైన రాగివైరు, రూ.75,000 విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు కలిపి మొత్తం రూ.4,30,225 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు రూరల్ ఆపరేషన్స్ ఓఎస్డీ, నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ కె.సి.వెంకటయ్య ఆ వివరాలు వెల్లడించారు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులకొట్టి రాగివైరును దొంగిలించిన ఐదు కేసులపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జాతీయరహదారి సమీపంలోని గొర్రెలమండి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ఎస్సై జగదీష్ విచారించారు. ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరు అపహరించే ముఠాగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు గ్రామానికి చెందిన పొత్తూరు లక్ష్మీనారాయణ అలియాస్ ఎఫ్రా నాయకుడిగా తన సమీప బంధువులైన పొత్తూరు కిషోర్, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన పొత్తూరు వెంకటనారాయణ, గుంటూరు సంగడిగుంటకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ రహీమ్‌తో కలిసి గతేడాది డిసెంబర్ నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠానాయకుడు చిలకలూరిపేట పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో 2001లో జరిగిన దొంగతనం కేసులో నిందితునిగా ఉన్నాడు. గ్రామాలకు దూరంగా ఎత్తిపోతల పథకాల వద్ద, మూతపడిన పరిశ్రమల్లో ఉండే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో ఉండే రాగివైరును వీరు అపహరిస్తుంటారు. వివిధ కంపెనీల్లో కంప్యూటర్లు కూడా చోరీ చేశారు. నిందితులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 11 పోలీస్స్టేషన్ల పరిధిలోని 33 గ్రామాల్లో 22 దొంగతనాలు చేశారు. వీటికి సంబంధించి చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 5, యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో 1, ఫిరంగిపురం 3, దాచేపల్లి 1, గుంటూరు రూరల్ 2, నకరికల్లు 2, బండ్లమోటు 2, పెదనందిపాడు 1, ఈపూరు 2, ప్రకాశం జిల్లా ముండ్లమూరు 2, అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి అరెస్టు చేసిన నలుగురు నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఓఎస్డీ చెప్పారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ టి.సంజీవ్‌కుమార్, ఎస్సై ఎస్.జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి ఓఎస్డీ అభినందనలు.. రెండు జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులను విచారించి చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఓఎస్డీ వెంకటయ్య అభినందించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ సంజీవ్‌కుమార్, ఎస్సై జగదీష్‌లను అభినందించడంతోపాటు.. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎన్.ఇర్మియ, బాషా, హోంగార్డు మధు, డ్రైవర్ ఎ.రామ్లాల్నాయక్లకు రూ.500 చొప్పున నగదు బహుమతి అందించారు. -
వేటు ఎవరిపైనో?
నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్: లక్షల రూపాయల విలువ చేసే రాగి తీగను అమ్ముకుని జేబులు నింపుకున్న సంఘటనలో అసలు దోషులను తప్పించే యత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని ట్రాన్స్‌కో స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన స్టాక్‌ను సిబ్బంది అమ్ముకున్నారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు.. నివేదికను ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రాకు పంపించారు. ఆయన ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఏం జరిగిందంటే ట్రాన్స్ఫార్మర్లలో కాపర్, అల్యూమినియం తీగలను వినియోగిస్తారు. మరమ్మతుల అనంతరం పాత వైరును స్టోర్ రూమ్‌లో నిల్వ చేస్తారు. కొత్త వైరు కూడా స్టోర్ రూమ్‌లోనే భద్రపరుస్తారు. 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్, మిగిలిన ట్రాన్స్ఫార్మర్లలో అల్యూమినియం వైరు ఉపయోగిస్తారు. సుమారు రూ. 60 లక్షల విలువ చేసే వైరును సిబ్బంది అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఒక ఏడీఈ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. విచారణ జరిపి నాలుగు రోజులలో నివేదిక పంపాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ జరి పి న అధికారులు స్టోర్ రూమ్‌లోని తీగలను తూకం వేయించారు. కాపర్, అల్యూమినియం నిల్వ లెక్కలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారం క్రితం సీఎండీకి ఎస్ఈ ద్వారా నివేదిక పంపించారు. అయితే బాధ్యుడిని తప్పించేందుకు ఓ ఉన్నతాధికారి యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలలోనే ఏటా డిసెంబర్లో స్టోర్ రూమ్‌లోని నిల్వలు లెక్కిస్తారు. వరంగల్ కార్యాలయం నుంచి అకౌంట్స్ అధికారులు వచ్చి, ఈ వ్యవహారం చూస్తారు. 2013 డిసెంబర్లో లెక్కలు కలిశాయి. అయితే నెల రోజులలోనే స్టోర్ రూమ్‌లోని కాపర్ వైరు మాయం కావడం గమనార్హం. కాగా స్టోర్ రూమ్‌లో ఉన్న ప్రతి వస్తువు బాధ్యత ఏడీఈదే. ఆయన నిల్వను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు దోషులను వదిలి, ఇతరులను బలి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. -
ఇంటి దొంగలు
నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్‌వైర్‌ను అమ్ముకోగా వచ్చిన డబ్బులను, కాంట్రాక్టులు అధికారులు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో యూనియన్ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ అవీనీతిపై ట్రాన్స్‌కో సీఎండీ కార్తికేయమిశ్రా సీరియస్‌గా తీసుకొని ప్రాథమిక విచారణ అనంతరం ఒక ఏడీ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ విషయంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక కావాలని ట్రాన్కో ఎస్ఈ నగేశ్కుమార్కు ఆదేశించారు. ఏం జరిగిందంటే కొద్ది నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కోసం జిల్లా స్టోర్ నుంచి రూ. 20 లక్షల విలువ చే సే కాపర్ వైరును విడుదల చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే రూ. 20 లక్షల విలువ చేసే మెటీరియల్ ఇచ్చిన సదరు అధికారులు.. దానిని కాంట్రాక్టరే కొనుగోలు చేశారని రికార్డుల్లో పేర్కొన్నారు. అందుకుగాను రూ. 20 లక్షల బిల్లును కాంట్రాక్టర్లకు చెల్లించారు. అంటే రూ. 20 లక్షల వైరుతోపాటు, 20 లక్షల రూపాయలనూ కాంట్రాక్టర్‌కు దోచిపెట్టారన్నమాట. అధికారులు ఇలా ‘అదనపు సంపాదన’ కోసమే చేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు అనంతరం కాలిపోయిన కాపర్‌వైరును స్టోర్‌లో జమచేయా ల్సి ఉంటుంది. ఇలా చేస్తే పాతదాని బదులు కొత్త వైరు ఇస్తారు. స్టాక్ లేకపోతే డబ్బులు చెల్లిస్తారు. కానీ ఏడాదిగా పాత వైరును స్టోర్‌లో జమ చేయడం లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 20 లక్షల విలువ చేసే పాత వైరుకు లెక్కలు చూపలేదని సమాచారం. కాపర్ వైరుకు డిమాండ్ ఉండడంతో మరమ్మతు కేంద్రాల్లోని అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాత వైరును అమ్ముకున్నట్లు తెలుస్తోంది. రికార్డులు మాయం అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు రికార్డులను సరిగా నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. కొందరైతే రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఏడీ నాగరాజు.. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకు సంబంధించిన రికార్డులను ఏడాది కాలంగా నిర్వహించడం లేదు. తన సెక్షన్‌కు సంబంధించి స్టాక్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేశామన్న వివరాలను ఆయన రికార్డు చేయాల్సి ఉంటుంది. అయితే ఉన్నతాధికారులను బుట్టలో వేసుకొన్న సదరు ఏడీ.. కాంట్రాక్టర్లతో దోస్తీ కట్టి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ఏడీ కార్యాలయానికి వచ్చిన డీఈ.. ట్రాన్స్ఫార్మర్ల సంబంధించిన రికార్డ్స్ చూపించాలని అడగ్గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లను అమ్ముకున్నారని, అందుకే రికార్డులు మెయింటెయిన్ చేయలేదని, ఉన్న రిజిస్టర్లను సైతం మాయం చేశారని తెలుస్తోంది. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి -నగేశ్, ఎస్ఈ, ట్రాన్స్‌కో, నిజామాబాద్ ట్రాన్స్‌కోలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులను విచారణ అధికారులుగా నియమించాం. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి, సీఎండీకి నివేదిక పంపిస్తాం. ఏ మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది విచారణ నివేదిక అందిన తర్వాతే తెలుస్తుంది.