
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)ఢిల్లీ కేంద్రంలో దొంగలు పడ్డారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ని ఆకాశవాణి కేంద్రంలో విలువైన రాగి వైర్లను కొందరు వ్యక్తులు అపహరించుకుపోయారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు.
300 ఎకరాలలో విస్తరించి ఉన్న ఆల్ ఇండియా రేడియో హై పవర్ ట్రాన్స్‌మిషన్ ఏరియల్ ఫీల్డ్ వద్ద రాగి తీగను దొంగిలించిన కేసులో షాన్ మొహమాద్ (24), షాజాద్ (26), అభిషేక్ (22) అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వద్ద నుంచి మొత్తం 200 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కొట్టేసిన వైర్లను కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్క్రాప్ డీలర్ మొహమద్ (26) ను కూడా అరెస్టు చేశారు. అతని నుండి రాగి తీగల కట్టలను స్వాధీనం చేసుకున్నారు
నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలు దాడులు నిర్వహించిన తరువాత ఉమేద్ (33), అక్షయ్ (22) అనే మరో ఇద్దర్ని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఏఐఆర్‌లో రాగి తీగలను దొంగిలించి, తక్కువ ధరలకు స్క్రాప్ డీలర్లకు విక్రయించడమే వీరి పని అనీ, మరో ముగ్గురు వ్యక్తుల కోసం వేట కొనసాగుతోందని, దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment