వేటు ఎవరిపైనో? | copper missing in transco store room | Sakshi
Sakshi News home page

వేటు ఎవరిపైనో?

Published Mon, Feb 10 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

copper missing in transco store room

నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్:  లక్షల రూపాయల విలువ చేసే రాగి తీగను అమ్ముకుని జేబులు నింపుకున్న సంఘటనలో అసలు దోషులను తప్పించే యత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని ట్రాన్స్‌కో స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన స్టాక్‌ను సిబ్బంది అమ్ముకున్నారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు.. నివేదికను ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రాకు పంపించారు. ఆయన ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది.

 ఏం జరిగిందంటే
 ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్, అల్యూమినియం తీగలను వినియోగిస్తారు. మరమ్మతుల అనంతరం పాత వైరును స్టోర్ రూమ్‌లో నిల్వ చేస్తారు. కొత్త వైరు కూడా స్టోర్ రూమ్‌లోనే భద్రపరుస్తారు. 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్, మిగిలిన ట్రాన్స్‌ఫార్మర్లలో అల్యూమినియం వైరు ఉపయోగిస్తారు. సుమారు రూ. 60 లక్షల విలువ చేసే వైరును సిబ్బంది అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఒక ఏడీఈ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు.

విచారణ జరిపి నాలుగు రోజులలో నివేదిక పంపాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ జరి పి న అధికారులు స్టోర్ రూమ్‌లోని తీగలను తూకం వేయించారు. కాపర్, అల్యూమినియం నిల్వ లెక్కలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారం క్రితం సీఎండీకి ఎస్‌ఈ ద్వారా నివేదిక పంపించారు. అయితే బాధ్యుడిని తప్పించేందుకు ఓ ఉన్నతాధికారి యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 నెలలోనే
 ఏటా డిసెంబర్‌లో స్టోర్ రూమ్‌లోని నిల్వలు లెక్కిస్తారు. వరంగల్ కార్యాలయం నుంచి అకౌంట్స్ అధికారులు వచ్చి, ఈ వ్యవహారం చూస్తారు. 2013 డిసెంబర్‌లో లెక్కలు కలిశాయి. అయితే నెల రోజులలోనే స్టోర్ రూమ్‌లోని కాపర్ వైరు మాయం కావడం గమనార్హం. కాగా స్టోర్ రూమ్‌లో ఉన్న ప్రతి వస్తువు బాధ్యత ఏడీఈదే. ఆయన నిల్వను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు దోషులను వదిలి, ఇతరులను బలి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement