karthikeya mishra
-
ఏపీ సీఎం అడిషనల్ సెక్రటరీగా కార్తికేయ మిశ్రా
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్థికశాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపించాలని సీఎం కేంద్రానికి లేఖ రాయగా, ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. -
పోలవరం పనులు భేష్
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే, గేట్ల పనితీరు, ఎగువ కాఫర్ డ్యామ్, ఫిస్ లాడర్, దిగువ కాఫర్ డ్యామ్ పనుల పురోగతిపై వివరాలడిగి తెలుసుకున్నారు. వరదల సమయంలో వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేసే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, గేట్ల పనితీరు తదితర అంశాలపై ఆయనకు వివరించారు. సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ కె.లతాకుమారి, ఈఈలు పి.సుధాకర్‌రావు, మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వాసితుల వినతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌కు నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. వరదల సమయంలో పాత గ్రామాలను విడిచి అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేరుకున్నామన్నారు. పాత గ్రామాల్లో తమకు సంబంధించిన పశువులు, ఇంటి సామగ్రి, వ్యవసాయ పనిముట్లు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని తెచ్చుకునేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని తూటికుంట సర్పంచ్ కుంజం లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. -
‘కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత’
తూర్పుగోదావరి జిల్లా: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని, కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లకు హాజరుకావాలని సూచించారు. స్ట్రాంగ్‌రూంల దగ్గరలోనే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం ఏడున్నర గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తామన్నారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమౌతుందని తెలిపారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను బట్టి 12 నుంచి 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యధికంగా 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, పెద్దాపురం, కాకినాడ సిటీ, రాజమహేంద్రవరం సిటీ, మండపేట నియోజకవర్గాల్లో అత్యల్పంగా 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ రోజున కాకినాడ సిటీలో ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ హాల్లో ఏ పార్టీ ఏజెంట్ అయినా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే ఆర్ఓ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కోసం 5098 మంది ప్రభుత్వ సిబ్బందిని వినియోగిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు 21,727, మూడు పార్లమెంటు స్థానాలకు 19,418 పోస్టల్ బ్యాలెట్లు అందాయని పేర్కొన్నారు. -
కొనసీమ వైపు ముంచుకొస్తున్న పెథాయ్ తుపాన్
సాక్షి, తూర్పుగోదావరి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అమలాపురం ఆర్డీఓ కార్యలయం వద్ద తుపాన్ ప్రభావం పై సమీక్ష నిర్వహించారు. తుపాన్ జిల్లాలోనే తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉందని కానీ అది ఎక్కడ తీరం దాటుతుందో తెలియడం లేదని అన్నారు. పెథాయ్ తుపాన్ గంటకుబ 90 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. తుపాన్ తీరం దాటే ప్రాంతం ఇవాళ సాయంత్రంలోగా తెలిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమలో ఇరవై ఏడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. తిత్లీ తుపాన్లో పని చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నాం. ప్రజలకు కావలిసిన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచ్చామని చెప్పారు. కమ్యూనికేషన్ నిలిచిపోకుండా సెల్ టవర్లు వద్ద జనరేటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని పాఠశాలలకు సోమ, మంగళవారం సెలవు దినాలుగా ప్రకటించారు. పెథాయ్ తుపాన్‌ను ఎదుర్కొవడానికి జిల్లాకు ఎన్డీఆర్ఫ్, ఎస్‌టీఆర్‌ఫ్ బృందాలు వచ్చాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కోనసీమలో 27 పునరావాస కేంద్రాల వివరాలు... అమలాపురం నియోజకవర్గానికి సంబందించి అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలలో ఏడు పునరావాస కేంద్రాలలు. ఉప్పలగుప్తం మండలంలో వాసాలతిప్ప, చల్లపల్లి, ఎన్. కొత్తపల్లి, ఎస్. యానంలోని పాఠశాలలు. అలవంరం మండలంలో ఓడలరేవు సైక్లోన్ షెల్టర్లు సామంతకుర్రు సైక్లోన్ షెల్టర్లుతో పాటు కొమరిగిరిపట్నం సైక్లోన్ షెల్టర్లును ఏర్పాటు చేశారు. ప.గో.జిల్లా : నిడదవోలులో పెథాయ్ తుఫాన్ నేపధ్యంలో నిడదవోలు తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు మండలంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అప్రమత్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల వి.ఆర్.ఓలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు తమ ధాన్యాలను, భద్ర పరచుకోవలని, పాడుబడిన ఇళ్లలో, పూరి గుడిసెల్లో ఉండరాదని దీని పై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. తుపాన్ ప్రభావం పై గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ఆరా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం పెథాయ్ తుపాన్ ప్రభావం పై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్. ఎల్. నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పోన్ చేసి ముందస్తు చర్యలపై ఆరా తీశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్థినష్టం వాటిలకుండా చర్యలు తీసుకొవాలని తెలిపారు. -
ప్చ్.. నిరాశే!
తూర్పు గోదావరి, యానాం: గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్నా విపత్తు దళాలు సముద్రం, నదీముఖ ద్వారాలలో మృతదేహాల కోసం వేటను కొనసాగిస్తున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోనైనా వారి జాడ కనుగొనాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఐ.పోలవరం మండల పరిధిలోని పశువుల్లంక వృద్ధ గౌతమీనదిలో ఈనెల 14న జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో మిగిలిన ముగ్గురు బాలికల ఆచూకీ కోసం శుక్రవారం జరిపిన భారీ సంయుక్త ఆపరేషన్ ఫలితానివ్వలేదు. సుమారు వివిధ విపత్తు దళాలైన ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్పీఎఫ్, ఎస్డీఎఫ్, స్థానిక మత్స్యకారులతో కూడిన 25 బృందాలతో పాటు భైరవపాలెం నుంచి మరో ఆరు బృందాలు సముద్రముఖద్వారంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఉదయం 6.30 నుంచే యానాం రాజీవ్బీచ్లో ఏర్పాటు చేసిన బేస్‌క్యాంప్ నుంచి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. భైరవపాలెం, సావిత్రినగర్, మగసానితిప్ప, గోగుళ్లంక, గుత్తెనదీవి, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ ఆపరేషన్‌లో ఒక వైపు డ్రోన్లు ఉపయోగించడంతో పాటు మరో వైపు నావికాదళాలకు సంబం«ధించి డైవర్స్, మరోపక్క యానాంకు చెందిన మత్స్యకారుల బోట్లతో ఈ భారీ సర్చ్ ఆపరేషన్ సాయంత్రం వరకు కొనసాగించారు. అయినప్పటికీ ఒక్కరి జాడ కూడా గుర్తించకపోవడంతో విపత్తు దళాలు నిరాశతో వెనుదిరిగాయి. మరోవైపు గల్లంతైన పోలిశెట్టి అనూష, పోలిశెట్టి సుచిత్ర, కొండేపూడి రమ్యల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే రాజీవ్‌బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఒక్కోదళం టెంట్లను తొలగిస్తుండంతో కొన్ని దళాలు ఇంటిముఖం పడుతున్నాయి. గత ఆరురోజులుగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్కు చెందిన టెంట్‌ను శుక్రవారం సాయంత్రం తొలగించడంతో ఇంకా సర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గాలింపు చర్యలను పర్యవేక్షించిన కలెక్టర్ ఒకేసారి 27 బృందాలతో సముద్ర, నదీముఖద్వారాల్లోని ప్రాంతాల్లో చేపట్టిన గాలింపు చర్యలను శుక్రవారం కలెక్టర్ కార్తికేయమిశ్రా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజీవ్‌బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బేస్‌క్యాంప్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముగ్గురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతుందని, లభ్యమవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ బి.వెంకటరమణ, రామచంద్రపురం ఆర్డీఓ రాజశేఖర్, అమలాపురం సబ్‌డివిజనల్ పోలీస్అధికారి ప్రసన్నకుమార్, ఎస్డీఎఫ్ డీఎస్పీ ఎస్ దేవానందరావు, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అంకితకుమార్, పుష్కరరావు పాల్గొన్నారు. -
దాడులు అరికట్టాలి..
తాడితోట(రాజమహేంద్రవరం):ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, దాడుల కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షపడేలా పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, ఐసీడీఎస్, స్వచ్ఛంద సేవా సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని 11 పోలీస్స్టేషన్లు పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళ, బాలికలపై నమోదైన కేసుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గత ఏడాదితో పోల్చితే పెరిగిన కేసులు.. అర్బన్ జిల్లా పరిధిలో 2017లో వరకట్నం వేధింపుల కేసులో హత్యలు జరగలేదని, 2018లో ఇప్పటికే రెండు హత్యలు జరిగాయని పేర్కొన్నారు. అలాగే వరకట్నం వేధింపుల కేసులో మహిళాహత్యలు 2017లో ఒకటి జరగగా, ఈ ఏడాది 2 జరిగాయన్నారు. వేధింపుల కేసులు గత ఏడాది 53 జరగగా, ఈ ఏడాది 55 జరిగాయని తెలిపారు. రేప్ కేసులు గత ఏడాది ఆరు, ఈ ఏడాది నాలుగు జరిగాయని పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులు గత ఏడాది జరగలేదని, ఈ ఏడాది ఒకటి జరిగిందని తెలిపారు. మహిళలను అవమానపరిచిన కేసులు గత ఏడాది 37 జరగగా, ఈ ఏడాది 22 జరిగాయని తెలిపారు. బాలికలపై వేధింపుల కేసులు గత ఏడాది రెండు నమోదు కాగా, ఈ ఏడాది నాలుగు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం గత ఏడాది మహిళ కేసులు 313 కేసులు నమోదు అయ్యాయని, బాలికల వేధింపులు ఇతర కేసులు 28 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహిళా చట్టాలపై అవగాహన పెంచాలి పాఠశాలలు, కళాశాలలో విద్యార్థినులకు ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అనే అంశం పై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. బాలికలకు జుడో, మార్షల్ ఆర్ట్స్లలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్భన్ జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పరిష్కరించడంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్ బాగా పని చేస్తున్నారని అభినందించారు. పశ్చిమగోదావరి జిల్లాలలో మహిళల లైంగిక వేధింపులపై పుస్తకం ముద్రించారని, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కూడా పుస్తకం, పోస్టర్లు ముద్రించి ప్రతీ పోలీస్ స్టేషన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో నిందితులకు సత్వరం శిక్షలు పడేలా కేసులు దర్యాప్తులో వేగవంతం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో కుల ధ్రువీకరణ పత్రాలు 24 గంటల నుంచి 48 గంటల్లోపు ఇచ్చేలా రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాన్ని అడ్డుకున్నాం : ఎస్పీ గోకవరంలో ఒక బాలికకు వివాహం చేస్తున్నట్టు సమాచారం అందిన వెంటనే పెళ్లి కుమారుడు గ్రామం అమలాపురంలో, గోకవరంలో అధికారులకు తెలియజేసి బాల్య వివాహాన్ని అడ్డుకున్నామని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పేర్కొన్నారు. షీ టీమ్ సేవలను ఆమె వివరించారు. అలాగే షీ టీమ్ ద్వారా కళాశాలలు, పాఠశాలలో బాలికలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల వివాదం కేసులు సుమారు వెయ్యి నమోదు కాగా, 900 వరకూ కేసులు రాజీ చేశామని తెలిపారు. మహిళలు, బాలికలపై దాడులు, వేధింపులు అరికట్టామని, వాటిని మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు, సబ్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ, డీఎస్పీలు నాగరాజు, కులశేఖర్, శ్రీనివాసరెడ్డి, భరత్ మాతాజీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వేటు ఎవరిపైనో?
నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్: లక్షల రూపాయల విలువ చేసే రాగి తీగను అమ్ముకుని జేబులు నింపుకున్న సంఘటనలో అసలు దోషులను తప్పించే యత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని ట్రాన్స్‌కో స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన స్టాక్‌ను సిబ్బంది అమ్ముకున్నారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు.. నివేదికను ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రాకు పంపించారు. ఆయన ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఏం జరిగిందంటే ట్రాన్స్ఫార్మర్లలో కాపర్, అల్యూమినియం తీగలను వినియోగిస్తారు. మరమ్మతుల అనంతరం పాత వైరును స్టోర్ రూమ్‌లో నిల్వ చేస్తారు. కొత్త వైరు కూడా స్టోర్ రూమ్‌లోనే భద్రపరుస్తారు. 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్, మిగిలిన ట్రాన్స్ఫార్మర్లలో అల్యూమినియం వైరు ఉపయోగిస్తారు. సుమారు రూ. 60 లక్షల విలువ చేసే వైరును సిబ్బంది అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఒక ఏడీఈ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. విచారణ జరిపి నాలుగు రోజులలో నివేదిక పంపాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ జరి పి న అధికారులు స్టోర్ రూమ్‌లోని తీగలను తూకం వేయించారు. కాపర్, అల్యూమినియం నిల్వ లెక్కలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారం క్రితం సీఎండీకి ఎస్ఈ ద్వారా నివేదిక పంపించారు. అయితే బాధ్యుడిని తప్పించేందుకు ఓ ఉన్నతాధికారి యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలలోనే ఏటా డిసెంబర్లో స్టోర్ రూమ్‌లోని నిల్వలు లెక్కిస్తారు. వరంగల్ కార్యాలయం నుంచి అకౌంట్స్ అధికారులు వచ్చి, ఈ వ్యవహారం చూస్తారు. 2013 డిసెంబర్లో లెక్కలు కలిశాయి. అయితే నెల రోజులలోనే స్టోర్ రూమ్‌లోని కాపర్ వైరు మాయం కావడం గమనార్హం. కాగా స్టోర్ రూమ్‌లో ఉన్న ప్రతి వస్తువు బాధ్యత ఏడీఈదే. ఆయన నిల్వను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు దోషులను వదిలి, ఇతరులను బలి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.