సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
తాడితోట(రాజమహేంద్రవరం):ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, దాడుల కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షపడేలా పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, ఐసీడీఎస్, స్వచ్ఛంద సేవా సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని 11 పోలీస్‌స్టేషన్లు పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళ, బాలికలపై నమోదైన కేసుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
గత ఏడాదితో పోల్చితే పెరిగిన కేసులు..
అర్బన్ జిల్లా పరిధిలో 2017లో వరకట్నం వేధింపుల కేసులో హత్యలు జరగలేదని, 2018లో ఇప్పటికే రెండు హత్యలు జరిగాయని పేర్కొన్నారు. అలాగే వరకట్నం వేధింపుల కేసులో మహిళాహత్యలు 2017లో ఒకటి జరగగా, ఈ ఏడాది 2 జరిగాయన్నారు.
వేధింపుల కేసులు గత ఏడాది 53 జరగగా, ఈ ఏడాది 55 జరిగాయని తెలిపారు. రేప్ కేసులు గత ఏడాది ఆరు, ఈ ఏడాది నాలుగు జరిగాయని పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులు గత ఏడాది జరగలేదని, ఈ ఏడాది ఒకటి జరిగిందని తెలిపారు. మహిళలను అవమానపరిచిన కేసులు గత ఏడాది 37 జరగగా, ఈ ఏడాది 22 జరిగాయని తెలిపారు. బాలికలపై వేధింపుల కేసులు గత ఏడాది రెండు నమోదు కాగా, ఈ ఏడాది నాలుగు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం గత ఏడాది మహిళ కేసులు 313 కేసులు నమోదు అయ్యాయని, బాలికల వేధింపులు ఇతర కేసులు 28 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
మహిళా చట్టాలపై అవగాహన పెంచాలి
పాఠశాలలు, కళాశాలలో విద్యార్థినులకు ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అనే అంశం పై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. బాలికలకు జుడో, మార్షల్ ఆర్ట్స్‌లలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్భన్ జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పరిష్కరించడంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్ బాగా పని చేస్తున్నారని అభినందించారు. పశ్చిమగోదావరి జిల్లాలలో మహిళల లైంగిక వేధింపులపై పుస్తకం ముద్రించారని, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కూడా పుస్తకం, పోస్టర్లు ముద్రించి ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో నిందితులకు సత్వరం శిక్షలు పడేలా కేసులు దర్యాప్తులో వేగవంతం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో కుల ధ్రువీకరణ పత్రాలు 24 గంటల నుంచి 48 గంటల్లోపు ఇచ్చేలా రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.
బాల్యవివాహాన్ని అడ్డుకున్నాం : ఎస్పీ
గోకవరంలో ఒక బాలికకు వివాహం చేస్తున్నట్టు సమాచారం అందిన వెంటనే పెళ్లి కుమారుడు గ్రామం అమలాపురంలో, గోకవరంలో అధికారులకు తెలియజేసి బాల్య వివాహాన్ని అడ్డుకున్నామని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పేర్కొన్నారు. షీ టీమ్ సేవలను ఆమె వివరించారు. అలాగే షీ టీమ్ ద్వారా కళాశాలలు, పాఠశాలలో బాలికలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల వివాదం కేసులు సుమారు వెయ్యి నమోదు కాగా, 900 వరకూ కేసులు రాజీ చేశామని తెలిపారు. మహిళలు, బాలికలపై దాడులు, వేధింపులు అరికట్టామని, వాటిని మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు, సబ్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ, డీఎస్పీలు నాగరాజు, కులశేఖర్, శ్రీనివాసరెడ్డి, భరత్ మాతాజీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment