తూర్పు గోదావరి ,తుని: మానవత్వం మంట కలిసింది. కామాంధుడు అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన తుని మండలం అటికవానిపాలెంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన అందరినీ విస్మయపరిచింది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, బాధితురాలి తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అటికవానిపాలేనికి చెందిన బాధితురాలి తల్లిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఆమె 17 ఏళ్ల వయసున్న కుమార్తె మానసిక దివ్యాంగురాలు. జన్యులోపం వలన పుట్టుక నుంచీ మానసికంగా ఎదుగుదల లేదు. తల్లి కూలి పనులకు వెళ్లి కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. గతంలో ఆమె ఇంట్లో అద్దెకు ఉండే మానవ మృగం బత్తిన తాతారావు మానసిక వికలాంగురాలైన 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్ప డ్డారు.
తనకు జరిగిన అన్యాయాన్ని తల్లికి నేరుగా చెప్పుకునే స్థితిలో ఆ బాలిక లేదు. అమ్మా ఏం జరిగిందని తల్లి అడిగితే తాతారావు వచ్చి ఏదో చేశాడని చెప్పింది. తల్లి జరిగిన దారుణాన్ని గమనించి చుట్టుపక్కల వారిని పిలిచి కన్నీరు పెట్టుకుంది. దీంతో గ్రామపెద్దల దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్లారు. నిందితుడు తాతారావు మాత్రం తనకు ఏ పాపం తెలియదని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో బాధితురాలిని తీసుకుని తల్లి, బంధువులు తుని రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక, మానసిక వికలాంగురాలు కావడంతో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలి. ఈ నెల మూడో తేదీన జరిగిన ఘటనపై పెద్దాపురం డీఎస్సీ సీహెచ్.రామారావు గురువారం విచారణ జరిపారు. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
అసలేం జరిగింది?
ఈ నెల మూడో తేదీన బాధితురాలి తల్లి పింఛన కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. ఇది గమనించిన కామాంధుడు తాతారావు ఆమె ఇంటికి వెళ్లి బాలికతో మాటలు కలిపాడు. ఇది గమనించిన స్థానికులు ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ఏమీ లేదని చెప్పి పంపించేశాడు. ఎవరూ లేని సమయం చూసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో వచ్చిన బాలిక తల్లిని చూసి తాతారావు పలాయనం చిత్తగించాడు. అనుమానం వచ్చిన తల్లి.. కుమార్తె వేసుకున్న దుస్తులను పరిశీలించగా అసలు విషయం బయట పడింది. గతంలో వారి ఇంట్లో అద్దెకు ఉన్న తాతారావు ఇంత దారుణానికి పాల్పడినట్టు తెలుసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
మానవత్వాన్ని మంట కలిపిన మృగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలను పరిశీలించారు. బాలికను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. బాధితురాలి దుస్తులపై లభించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితుడిపై ఐపీసీ 376, 5 (కె), రెడ్ విత్ ఫోక్సా యాక్టు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారని, నిందితుడి నేరం రుజువైతే 11 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుందని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. కాగా పలు ప్రజా సంఘాలు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చూపిస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment