
తూర్పుగోదావరి కలెక్టర్ కార్తికేయ మిశ్రా(పాత చిత్రం)
తూర్పుగోదావరి జిల్లా: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని, కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లకు హాజరుకావాలని సూచించారు. స్ట్రాంగ్‌రూంల దగ్గరలోనే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం ఏడున్నర గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తామన్నారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమౌతుందని తెలిపారు.
నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను బట్టి 12 నుంచి 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యధికంగా 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, పెద్దాపురం, కాకినాడ సిటీ, రాజమహేంద్రవరం సిటీ, మండపేట నియోజకవర్గాల్లో అత్యల్పంగా 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ రోజున కాకినాడ సిటీలో ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ హాల్‌లో ఏ పార్టీ ఏజెంట్ అయినా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే ఆర్‌ఓ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కోసం 5098 మంది ప్రభుత్వ సిబ్బందిని వినియోగిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు 21,727, మూడు పార్లమెంటు స్థానాలకు 19,418 పోస్టల్ బ్యాలెట్లు అందాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment