
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమర శంఖం పూరించారు. కాకినాడ వేదికగా సోమవారం జరిగిన సమర శంఖారావ సభకు వచ్చిన జగన్ తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఢంకా మోగించారు. ఆ సమయంలో పార్టీశ్రేణులు జేజేలు పలుకుతూ ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేశారు. సభ పూర్తయ్యాక జగన్ శంఖాన్ని పూరించారు. ఆ సమయంలో కిక్కిరిసిన సభాప్రాంగణంలోని కార్యకర్తలంతా జయజయధ్వానాలు చేశారు. కాకినాడ వేదికగా విజయఢంకా మోగించి, శంఖాన్ని పూరించడంతోపార్టీ శ్రేణుల్లో ఎన్నికల కదనోత్సాహం పరవళ్లు తొక్కింది.