సభకు హాజరైన అశేష జన వాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న జగన్
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ సీపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో సోమవారం కాకినాడలో జరిగిన ‘సమరశంఖారావం’ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ శ్రేణులకు ఓ వైపు ధైర్యం నూరిపోస్తూ, టీడీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం పార్టీ కేడర్‌కు ఇతోధిక స్ఫూర్తిని కలిగించింది. నాలుగున్నరేళ్ళుగా ప్రతి కార్యకర్తా ఆర్థికంగా, కేసుల పరంగా ఎంతగానో నష్టపోయారని, వీరందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయంటూ జగన్ ధైర్యం నూరిపోశారు.
రానున్న నెలరోజులు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్తా బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక జరిగిన తొలి సభ కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు తరలి రావడంతో సభాప్రాంగణం ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఆయా ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. మంచిరోజులు రానున్నాయన్న ఆనందం పార్టీ శ్రేణుల్లో కనిపించింది.
సైనికుల్లా పనిచేయాలి
రానున్న నెలరోజులూ ఎంతో కీలకం. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలి. బూత్‌స్థాయి కన్వీనర్లు, సభ్యులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రూపొందించిన నవరత్న పథకాలను ప్రజలకు చేరవేయాలి. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి.
– పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ
పచ్చి అవకాశవాది చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దగా చేసిన బీజేపీతో ఇంతకాలం కొనసాగి ఇప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులు చేసే గిమ్మిక్కులను ప్రజలు నమ్మేస్థితిలో లేరు.
– కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment