ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట! | YS Jagan Mohan Reddy Will Solve The Sea Erosion Problem | Sakshi
Sakshi News home page

ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట!

Published Sun, Feb 23 2020 12:58 PM | Last Updated on Sun, Feb 23 2020 1:09 PM

YS Jagan Mohan Reddy Will Solve The Sea Erosion Problem - Sakshi

సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ గ్రామం

  • తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామం 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. గత వందేళ్లలో దాదాపు 320 ఎకరాల భూమి కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. అలాగే 410 ఎకరాల్లో పంట భూములు, సరుగుడు తోటలు ఉండేవి. ఇందులో 320 ఎకరాలను బంగాళాఖాతం మింగేసింది. 
  • ఉప్పాడ సమీపంలోని కోనపాపపేట గ్రామంలో గత పదేళ్లలో దాదాపు 20 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. 150 ఇళ్లు కోతకు గురయ్యాయి. తుపాను వచ్చినప్పుడల్లా ఈ గ్రామం కోతకు గురవుతోంది. 
  • 8వ ఏషియన్‌ అండ్‌ పసిఫిక్‌ కోస్ట్స్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లెక్కల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 1990–2000 మధ్యకాలంలో 57.92 చదరపు కిలోమీటర్లు, 2000–2006 మధ్యకాలంలో 102.88 చదరపు కిలోమీటర్లు, 2006–2012 మధ్యకాలంలో 77.58 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైంది.  
  • కాకినాడ నుంచి తుని వరకూ తీర ప్రాంతాన్ని కలుపుతూ 1978లో నిర్మించిన బీచ్‌ రోడ్డు ఇప్పటిదాకా 28 సార్లు సముద్రపు కోతకు గురైంది. నాలుగుసార్లు రోడ్డు మొత్తం కొట్టుకుపోగా, దాని పక్కనే కొత్త రోడ్డు నిర్మిస్తూ వస్తున్నారు. తుపాన్లకు ఛిద్రమవుతున్న బీచ్‌ రోడ్డు రక్షణ, మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ శాఖ రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అంచనా. 

సాక్షి, తూర్పుగోదావరి: బంగాళాఖాతంలో తుపానులు వచ్చాయంటే చాలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని పల్లెలు వణికిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు తీరంపై విరుచుకుపడుతుంటాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కోత వల్ల ఇప్పటివరకూ వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోయాయి. వేలాది ఇళ్లు, ఆస్తులు కడలి కెరటాల్లో కలిసిపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు ప్రారంభించారు. సముద్రపు కోత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల కేంద్ర బృందం కాకినాడ ప్రాంతాన్ని పరిశీలించింది. ఉప్పాడలో మినీ హార్బర్‌ నిర్మాణానికి రూ.320 కోట్ల విడుదలకు సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వెల్లడించారు. అలాగే రూ.3 కోట్లతో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.350 కోట్లతో తీర రక్షణ చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది.

ఉప్పాడ సమీపంలో మినీ హార్బర్‌ నిర్మాణానికి నిర్దేశించిన స్థలం

హోప్‌ ఐలాండే కారణం! 
ఉప్పాడ తీరానికి సముద్రపు కోత వల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని  ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. కోత తీవ్రతను 1971లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినా తదుపరి చర్యలపై దృష్టి పెట్టలేదు. గోదావరి నది నుంచి భారీగా ఇసుక కొట్టుకురావడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్‌ ఐలాండ్‌ కారణంగానే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెప్పారు. అలల తాకిడితో హోప్‌ ఐలాండ్‌లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టి కోతకు గురవుతోందని తేల్చారు. 

నివారణకు ప్రతిపాదనలు
కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని అప్పట్లో బీచ్‌ ఎరోజన్‌ బోర్డు సూచించింది. ఏటా 1.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో నింపాలని సిఫారసు చేసింది. తద్వారా అలల తాకిడికి ఇసుక కోతకు గురవుతూ, తిరిగి అదే ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. అయితే, ఏటా ఇసుక తరలింపునకు అధికంగా ఖర్చవుతుందని ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. సీ వాల్స్‌ (రక్షణ గోడ) నిర్మించాలని 1975 ఫిబ్రవరి 12న జరిగిన సమావేశంలో మరో ప్రతిపాదన చేశారు. ఈ మేరకు 1982లో రూ.31.86 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని రాష్ట్ర వరద నివారణ బోర్డుకు చెందిన సాంకేతిక సంఘం పరిశీలించి 1982 జూలై 22న ఆమోదించింది. 

తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం 
సముద్రపు కోతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీఎస్‌సీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ రామచంద్రన్, శాస్త్రవేత్తలు పి.రామచంద్రన్, ఆర్‌ఎస్‌ రాబిన్, బి.సుబ్బారెడ్డి, ఎడ్విన్‌ రాజన్‌ తదితరులు ఇటీవల కోనపాపపేట, ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు. ఉప్పాడలో సూరాడపేట, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో జియోట్యూబ్‌ రక్షణ గోడ సైతం కోతకు గురై, శిథిలం కావడాన్ని పరిశీలించారు.

సముద్ర కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం (ఫైల్‌) 

వైఎస్సార్‌ హయాంలో రూ.12 కోట్లతో రక్షణ గోడ 
1,000 మీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణ వ్యయం 1994–95 నాటికి రూ.1.25 కోట్లకు చేరింది. మరో ఏడాదిలోనే రూ.2.25 కోట్లకు పెరిగింది. 2008 నాటికి రూ.12 కోట్లకు చేరుకుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో ఉప్పాడలో సముద్రపు కోత నివారణకు రూ.12 కోట్లతో జియో ట్యూబ్‌ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మించారు. పదేళ్ల క్రితం నిర్మించిన జియోట్యూబ్‌ రక్షణ గోడ నిర్వహణను తరువాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఇది శిథిలమై కోత మళ్లీ ప్రారంభమైంది. ఉప్పాడ వద్ద నిర్మించిన జియోట్యూబ్‌ రక్షణ గోడ సముద్రపు కెరటాల ఉధృతిని అడ్డుకోవడంతో కోత  ప్రభావం ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనపాపపేట గ్రామంపై పడింది.  

నూతన టెక్నాలజీతో కెరటాల ఉధృతికి బ్రేకులు 
‘‘సముద్రపు కోతను నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. జియో ట్యూబ్‌ టెక్నాలజీ అనేది శాశ్వత పరిష్కారం కాదు. కొత్త టెక్నాలజీ ద్వారా సముద్రపు కెరటాలను ఒడ్డుకు చేరేలోపే నిర్వీర్యం చేయొచ్చు. వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చు. తీరప్రాంతం కోతకు గురి కాకుండా ఉంటుంది. కొత్త టెక్నాలజీని ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు’’ – డాక్టర్‌ రమేష్‌ రామచంద్రన్, డైరెక్టర్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement