Erosion
-
మినోకా!..రక్తనాళాలు బ్లాక్ కాకుండానే హార్ట్ అటాక్!
గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయనీ, అందుకే హార్ట్ అటాక్ వచ్చిందనే మాట తరచూ వినేదే. కానీ కొన్ని హార్ట్ అటాక్స్... ప్రధాన ధమనులు మూసుకుపోనప్పటికీ, అంటే అవి నార్మల్‌గా ఉన్నప్పటికీ వస్తుంటాయి. అలాంటి హార్ట్ అటాక్స్నే మినోకా (మయో కార్డియల్ ఇన్ఫార్క్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరొనరీ ఆర్టరీస్) అంటారు. ఈమధ్య వస్తున్న గుండెపోట్లలో మినోకా తరహావి పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ‘మినోకా’ హార్ట్ అటాక్స్ గురించి అవగాహన కల్పించేదే ఈ కథనం. వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళాల (ధమనుల)లో కొవ్వులు (ప్లాక్స్) పేరుకుపోవడం సహజం. ఈ ప్లాక్స్ క్రమంగా పెరుగుతూ బ్లాక్స్‌లా గుండెపోటుకు దారితీస్తాయి. అయితే సుమారు 6 నుంచి 10 శాతం మంది గుండెపోటు వచ్చిన వారి యాంజియోగ్రామ్‌లో బ్లాక్స్ ఏవీ కనిపించకపోవడం కార్డియాలజిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి వాళ్లకు గుండెపోటు ఎందుకు వస్తోందనే విషయాన్ని మరింత లోతుగా పరిశీలించినప్పుడు అబ్బురం కలిగించే విషయాలు తెలిశాయి. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ప్లాక్స్ లేనప్పటికీ కొన్నిసార్లు గుండె కండరం దెబ్బతినవచ్చు. ఇలా గుండెకండరం దెబ్బ తినడం వల్ల, రక్తనాళాల బ్లాక్స్‌తో సంబంధం లేకుండా వచ్చే గుండెపోటునే ‘మినోకా’ అంటారు. మినోకాకు కారణాలు... మినోకాకు అనేక అంశాలు దోహదపడుతుంటాయి. వాటిల్లో ప్రధానమైనవి... 1. గుండె రక్తనాళాలు తాత్కాలికంగా కుంచించుకుపోవడం: ఈ కండిషన్‌ను ‘కరోనరి స్పాసమ్’ అని పిలుస్తారు. సిరల గోడల్లో కండరం ఉండదు. కానీ ధమనుల గోడలు కండరంతో నిర్మితమై ఉంటాయి. ధమని కండరం సంకోచించి అలాగే ఉండిపోతే గుండె కండరం దెబ్బ తింటుంది. మహిళల్లో కరోనరీ స్పాసమ్ ఎక్కువ. అందుకే ఈ గుండెపోటుకు అవకాశాలూ ఎక్కువే. 2. ప్లాకులలో పగుళ్ల (ఎరోషన్స్)తో: వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల్లో ప్లాకులేర్పడుతూ ఉంటాయి. ఈ ప్లాకులపై ఎరోషన్స్) వల్ల కూడా కొన్నిసార్లు గుండెపోటు రావచ్చు. 3. మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్: గుండె తాలూకు మూడు ప్రధాన రక్తనాళాలు... పోను పోను మరింత చిన్న రక్తనాళాలుగా మారి గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటిల్లో అడ్డంకులతో వచ్చిన గుండెపోటునూ ‘మినోకా’గానే పరిగణిస్తారు. ఇలా సూక్ష్మ రక్తనాళాల్లో వచ్చే జబ్బునే మైక్రో వాస్కులర్ డిస్ ఫంక్షన్ అంటారు. 4. కరోనరీ ఎంబాలిజం: దేహంలో వేరేచోట ఏర్పడిన రక్తం గడ్డలు గుండె రక్తనాళాల్లో అడ్డంకిగా మారి గుండెపోటుని కలిగించవచ్చు. దీన్ని కరోనరీ ఎంబాలిజం అంటారు. 5. రక్తనాళాల్లో ఎలాంటి తేడాలూ లేకుండా గుండె కండరం దెబ్బ తినటం: కొన్నిసారు గుండె రక్తనాళాల్లో ఏమాత్రం తేడాలు లేకపోయినా మినోకా రావచ్చు. అవసరమైన వైద్య పరీక్షలు... గుండెపోటు లక్షణాలు కనిపించగానే తొలుత ఈసీజీ, ఎకో, ఆ తర్వాత ట్రోపొనిన్ అనే పరీక్షలు చేస్తారు. లక్షణాలతో పాటు ఈ పరీక్షల ఫలితాలను బట్టి గుండెపోటును నిర్ధారణ చేస్తారు. నిజానికి గుండెపోటు నిర్ధారణకు యాంజియోగ్రామ్ అవసరం ఉండదు. కానీ ఏ తరహా చికిత్స అవలంబించాలనే అంశానికి యాంజియోగ్రామ్ సహాయపడుతుంది. మినోకా ఉన్న వారిలో గుండెపోటు వచ్చినట్లు అన్ని ఆధారాలూ ఉంటాయి కానీ, యాంజియోగ్రామ్ చేసినప్పుడు అందులో బ్లాక్స్ కనిపించవు. కాబట్టి వీళ్లలో స్టెంట్ వేసే అవకాశం ఉండదు. మినోకా నివారణ ఎలా? మినోకా నివారణకు ప్రత్యేకమైన చర్యలేమీ లేనప్పటికీ మామూలు గుండెజబ్బు నివారణ తీసుకునే జాగ్రత్తలే మినోకానూ నివారిస్తాయి. సమతులాహారం, వ్యాయామం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవడం, మంచి నిద్ర, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉంటే... మిగతా గుండె జబ్బులు లాగానే మినోకానూ నివారించేందుకూ, కొంతమేర ముందుగా పసికట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎవరిలో ఎక్కువ? పురుషులతో పోలిస్తే మినోకా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కాస్త వయసు తక్కువ వాళ్లలోనూ మినోకా వచ్చే అవకాశం ఎక్కువ. పొగతాగే అలవాటు ఉన్నవారిలోనూ మినోకా వచ్చే అవకాశాలెక్కువ. లక్షణాలు : సాధారణ గుండెపోటు లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయి. అంటే శ్వాస అందకపోవడం, ఆయాసపడటం, ఛాతీపై నొప్పి, ఎడమ భుజం, వీపులో ఎడమవైపు నొప్పి, ఎడమ దవడలోనూ నొప్పి కనిపించడం, చెమటలు పట్టడం వంటివి. సాధారణ గుండెపోటుకి, మినోకా గుండెపోటుకీ తేడా ఏమిటి? మినోకా వచ్చిన వారిలో యాంజియోగ్రామ్ చేశాక... డాక్టర్లకు బాధితుల్లో బ్లాక్స్ ఏవీ పెద్దగా కనిపించవు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పినప్పుడు వారు సంతోషిస్తారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే... మినోకా కూడా గుండెపోటే. గుండెపోటులో ఏ దుష్పరిణామాలు ఉంటాయో మినోకాలోనూ అవే ఉంటాయి. అంటే... గుండె పంపింగ్ తగ్గడం, ఆకస్మికంగా మరణం సంభవించడం వంటివి. మినోకాని గుర్తించాక...? మినోకాని గుర్తించాక దానికి కారణాలని అన్వేషించడం తప్పనిసరి. ఇందుకు ఇంట్రా–కరోనరీ ఇమేజింగ్ ప్రధాన భూమిక నిర్వర్తిస్తుంది. ఇంట్రాకరోనరీ ఇమేజింగ్ అంటే గుండె రక్తనాళాల్లోనికి చిన్న కెమెరా వంటి సాధనాన్ని పంపి గుండె రక్తనాళం గోడని నిశితంగా పరిశీలించటం. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ , ఆప్టికల్ కోహరె¯Œ ్స టోమోగ్రఫి అనే రెండు రకాల పరీక్షల్లో దేని ద్వారానైనా మినోకాకు కారణాన్ని కొంతమేరకు తెలుసుకోవచ్చు. మినోకా వచ్చాక చేయాల్సిన పరీక్షల్లో కార్డియాక్ ఎమ్మారై కూడా ముఖ్యమైనది. చికిత్స... మినోకాకు నిర్దిష్టంగా ఒక ప్రత్యేకమైన కారణం లేనందున చికిత్స కూడా నిర్దిష్టంగా ఉండదు. మినోకాకి రకరకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కరోనరి స్పాసమ్ వల్ల వచ్చే మినోకాలో క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్, నైట్రేట్స్ అనే మందులు వాడటం ముఖ్యం. అన్ని రకాల మినోకాలలోనూ రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం తప్పనిసరి అయినప్పటికీ కరోనరీ ఎంబాలిజం వల్ల వచ్చే మినోకాలో బాగా ఎక్కువ శక్తివంతమైన బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుంది. మినోకాలోనూ... సాధారణ గుండెపోటు వచ్చిన వాళ్లలోలాగే గుండె పంపింగ్ బలహీనపడే అవకాశం ఉంటుంది. అప్పుడు గుండెలో బలం నింపడానికి ఔషధాల్ని వాడాలి. వీటిలో బీటా బ్లాకర్లు, ఏస్ ఇన్హిబిటార్స్, స్టాటిన్సు వంటివీ ఉంటాయి. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ సీనియర్ కార్డియాలజిస్ట్ -
కరిగిపోతూ.. కడలిలో కలసిపోతూ..
పిఠాపురం: జవాద్ తుపాను ప్రభావంతో కొత్తపల్లి మండల తీర ప్రాంతంలో కడలి కల్లోలం సృష్టించింది. ఎక్కడ చూసినా సుమారు 5 మీటర్ల మేర ముందుకు వచ్చిన సముద్రం తీరప్రాంతాన్ని కబళించింది. పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్రంగా కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లు సుమారు 12 ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. మరికొన్ని ఇళ్లు ఏ క్షణంలోనైనా సముద్ర కోతకు గురయ్యే ప్రమాదకర పరిస్థితికి చేరాయి. కోతతో కోనపాపపేటలో సముద్రంలో కలిసిపోతున్న కొబ్బరి చెట్లు విలువైన కొబ్బరి చెట్లు కడలిలో కలసిపోతున్నాయి. కోతకు గురవుతున్న తమ ఇళ్లలోని సామగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించుకునే పనిలో కొందరు మత్స్యకారులు నిమగ్నమయ్యారు. కోతకు గురైన ప్రాంతాలను కొత్తపల్లి ఎంపీపీ కారే సుధ, మత్స్యకార నాయకుడు కారే శ్రీనివాసరావు తదితరులు ఆదివారం పరిశీలించారు. మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతం రెండో రోజు కూడా కోతకు గురైంది. పలు ఇళ్లతో పాటు బీచ్ రోడ్డు సుమారు కిలోమీటరు మేర ధ్వంసమైంది. శుక్రవారం నిలిపివేసిన రాకపోకలను ఆదివారం పునరుద్ధరించారు. కెరటాల ఉధృతి కొనసాగుతుండడంతో బీచ్ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కోతకు గురైన ఇంట్లో భయాందోళనల నడుమ మత్స్యకార కుటుంబం నేల మాయమై.. బావి మిగిలిందిలా.. కోనపాపపేటలో సముద్ర కోత తీవ్రతకు ఈ బావి సాక్ష్యంగా నిలుస్తోంది. పక్కనే సముద్రం ఉన్నా మంచినీటిని ఇచ్చి ప్రజల అవసరాలను తీర్చిన ఈ నేల బావి.. తీవ్రంగా అలల కోతకు గురైంది. ఫలితంగా చుట్టూ ఉన్న నేల కొట్టుకుపోగా బావి మట్టితో పూడుకుపోయి ఇలా మిగిలింది. -
వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!
బ్రిటన్: వర్షాలు మావనాళి మనుగడకు ఎంతో అవసరం.. అదే ఉగ్రరూపం దాలిస్తే.. ఎంతటి భయంకర పరిస్థితులు తలెత్తుతాయో గత వారం రోజులుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఏటా వర్షాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నష్టాని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ వర్షాలకు నదులు కోసుకుపోవడం.. వరద బీభత్సం వంటి వాటి గురించి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వర్షాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వర్షాలు భారీ శిఖరాలను సైతం కదిలిస్తాయని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. భూగర్భ శాస్త్రవేత్తలకు పర్వతాలపై వర్షం ఎలా ప్రభావం చూపిస్తుందో సమర్థవంతంగా అధ్యయనం చేయడంలోనే కాకుండా, వందల ఏళ్ల క్రితం శిఖరాలు, లోయలు ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు సహకరిస్తాయి. (చదవండి: కలిసికట్టుగా ఊడ్చేశారు.. టీంవర్క్ అంటే ఇది) పీర్-రివ్యూ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన ‘క్లైమెట్ కంట్రోల్స్ ఆన్ ఎరోషన్ ఇన్ టెక్టోనికల్లీ యాక్టీవ్ ల్యాండ్‌స్కేప్స్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనాన్ని డాక్టర్ బైరాన్ ఆడమ్స్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించింది. ఇందుకు గాను, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన బృందం తూర్పు హిమాలయాల్లో భాగామైన భూటాన్, నేపాల్‌లో అధ్యయనం నిర్వహించింది. బ్రిస్టల్ క్యాబోట్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ రాయల్ సొసైటీ డోరతీ హోడ్కిన్కి చెందిన డాక్టర్ బైరాన్ ఆడమ్స్ ఈ అధ్యయనం కోసం అరిజోనా స్టేట్ యూనివర్శిటీ (ఏఎస్యూ), లూసియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులతో కలిసి పనిచేశారు. నదులు వాటి క్రింద ఉన్న రాళ్ళను క్షీణింపజేసే వేగాన్ని కొలవడానికి వారు ఇసుక రేణువుల లోపల విశ్వ గడియారాలను ఉపయోగించారు. టెక్టోనిక్స్పై వాతావరణం ప్రభావాన్ని అధ్యయనం చేయడం ఈ స్టడీ ప్రధాన లక్ష్యం. (చదవండి: 'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు') ఈ స్టడీ ప్రధాన రచయిత, డాక్టర్ బైరాన్ ఆడమ్స్ మాట్లాడుతూ, భూటాన్, నేపాల్ అంతటా గమనించిన "ఎరోషన్ రేట్ ప్యాటర్" ను పునరుత్పత్తి చేయడానికి బృందం అనేక సంఖ్యా నమూనాలను పరీక్షించింది. కోత రేటును ఖచ్చితంగా అంచనా వేయగల ఒక నమూనాను వారు గుర్తించగలిగారు. ఆ తర్వాత, వర్షపాతం "కఠినమైన భూభాగాలలో కోత రేటు" ను ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి పరిశోధకులు ఈ నమూనాను ఉపయోగించారు. -
ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట!
తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామం 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. గత వందేళ్లలో దాదాపు 320 ఎకరాల భూమి కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. అలాగే 410 ఎకరాల్లో పంట భూములు, సరుగుడు తోటలు ఉండేవి. ఇందులో 320 ఎకరాలను బంగాళాఖాతం మింగేసింది. ఉప్పాడ సమీపంలోని కోనపాపపేట గ్రామంలో గత పదేళ్లలో దాదాపు 20 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. 150 ఇళ్లు కోతకు గురయ్యాయి. తుపాను వచ్చినప్పుడల్లా ఈ గ్రామం కోతకు గురవుతోంది. 8వ ఏషియన్ అండ్ పసిఫిక్ కోస్ట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లెక్కల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 1990–2000 మధ్యకాలంలో 57.92 చదరపు కిలోమీటర్లు, 2000–2006 మధ్యకాలంలో 102.88 చదరపు కిలోమీటర్లు, 2006–2012 మధ్యకాలంలో 77.58 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైంది. కాకినాడ నుంచి తుని వరకూ తీర ప్రాంతాన్ని కలుపుతూ 1978లో నిర్మించిన బీచ్ రోడ్డు ఇప్పటిదాకా 28 సార్లు సముద్రపు కోతకు గురైంది. నాలుగుసార్లు రోడ్డు మొత్తం కొట్టుకుపోగా, దాని పక్కనే కొత్త రోడ్డు నిర్మిస్తూ వస్తున్నారు. తుపాన్లకు ఛిద్రమవుతున్న బీచ్ రోడ్డు రక్షణ, మరమ్మతులకు ఆర్అండ్బీ శాఖ రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అంచనా. సాక్షి, తూర్పుగోదావరి: బంగాళాఖాతంలో తుపానులు వచ్చాయంటే చాలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని పల్లెలు వణికిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు తీరంపై విరుచుకుపడుతుంటాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కోత వల్ల ఇప్పటివరకూ వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోయాయి. వేలాది ఇళ్లు, ఆస్తులు కడలి కెరటాల్లో కలిసిపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు ప్రారంభించారు. సముద్రపు కోత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల కేంద్ర బృందం కాకినాడ ప్రాంతాన్ని పరిశీలించింది. ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.320 కోట్ల విడుదలకు సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వెల్లడించారు. అలాగే రూ.3 కోట్లతో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.350 కోట్లతో తీర రక్షణ చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. ఉప్పాడ సమీపంలో మినీ హార్బర్ నిర్మాణానికి నిర్దేశించిన స్థలం హోప్ ఐలాండే కారణం! ఉప్పాడ తీరానికి సముద్రపు కోత వల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. కోత తీవ్రతను 1971లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినా తదుపరి చర్యలపై దృష్టి పెట్టలేదు. గోదావరి నది నుంచి భారీగా ఇసుక కొట్టుకురావడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెప్పారు. అలల తాకిడితో హోప్ ఐలాండ్‌లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టి కోతకు గురవుతోందని తేల్చారు. నివారణకు ప్రతిపాదనలు కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని అప్పట్లో బీచ్ ఎరోజన్ బోర్డు సూచించింది. ఏటా 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో నింపాలని సిఫారసు చేసింది. తద్వారా అలల తాకిడికి ఇసుక కోతకు గురవుతూ, తిరిగి అదే ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. అయితే, ఏటా ఇసుక తరలింపునకు అధికంగా ఖర్చవుతుందని ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. సీ వాల్స్ (రక్షణ గోడ) నిర్మించాలని 1975 ఫిబ్రవరి 12న జరిగిన సమావేశంలో మరో ప్రతిపాదన చేశారు. ఈ మేరకు 1982లో రూ.31.86 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని రాష్ట్ర వరద నివారణ బోర్డుకు చెందిన సాంకేతిక సంఘం పరిశీలించి 1982 జూలై 22న ఆమోదించింది. తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం సముద్రపు కోతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్‌సీఎస్‌సీఎం) డైరెక్టర్ డాక్టర్ రమేష్ రామచంద్రన్, శాస్త్రవేత్తలు పి.రామచంద్రన్, ఆర్ఎస్ రాబిన్, బి.సుబ్బారెడ్డి, ఎడ్విన్ రాజన్ తదితరులు ఇటీవల కోనపాపపేట, ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు. ఉప్పాడలో సూరాడపేట, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో జియోట్యూబ్ రక్షణ గోడ సైతం కోతకు గురై, శిథిలం కావడాన్ని పరిశీలించారు. సముద్ర కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం (ఫైల్) వైఎస్సార్ హయాంలో రూ.12 కోట్లతో రక్షణ గోడ 1,000 మీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణ వ్యయం 1994–95 నాటికి రూ.1.25 కోట్లకు చేరింది. మరో ఏడాదిలోనే రూ.2.25 కోట్లకు పెరిగింది. 2008 నాటికి రూ.12 కోట్లకు చేరుకుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఉప్పాడలో సముద్రపు కోత నివారణకు రూ.12 కోట్లతో జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మించారు. పదేళ్ల క్రితం నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ నిర్వహణను తరువాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఇది శిథిలమై కోత మళ్లీ ప్రారంభమైంది. ఉప్పాడ వద్ద నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ సముద్రపు కెరటాల ఉధృతిని అడ్డుకోవడంతో కోత ప్రభావం ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనపాపపేట గ్రామంపై పడింది. నూతన టెక్నాలజీతో కెరటాల ఉధృతికి బ్రేకులు ‘‘సముద్రపు కోతను నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. జియో ట్యూబ్ టెక్నాలజీ అనేది శాశ్వత పరిష్కారం కాదు. కొత్త టెక్నాలజీ ద్వారా సముద్రపు కెరటాలను ఒడ్డుకు చేరేలోపే నిర్వీర్యం చేయొచ్చు. వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చు. తీరప్రాంతం కోతకు గురి కాకుండా ఉంటుంది. కొత్త టెక్నాలజీని ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు’’ – డాక్టర్ రమేష్ రామచంద్రన్, డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ -
తీరం ఘోరం
1.5 కి.మీ. మేర కోతకు గురైన రుషికొండ బీచ్ కొట్టుకుపోయిన పర్యాటక, జీవీఎంసీ రోడ్లు రూ.15 లక్షలు సముద్రం పాలు మారిటైం యూనివర్సిటీ నిపుణులతో అధ్యయనం రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు కోతకు గురైన బీచ్‌ను పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, విశాఖపట్నం : పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్ ఘోరంగా తయారైంది. రోజురోజుకూ మరింత కోతకు గురవుతూ పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఒకటిన్నర కిలోమీటర్ల మేర కోతకు గురైనట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఏడాది క్రితం జీవీఎంసీ రూ.10 లక్షలతోనూ, మూడేళ్ల క్రితం పర్యాటక శాఖ రూ.5లక్షలతోనూ నిర్మించిన రహదారులు పూర్తిగా కోతకు గురయ్యాయి. తీరం నుంచి 200 అడుగుల మేర కోతకు గురైనట్టుగా గుర్తించారు. తీరంలో నిర్మించుకున్న దుకాణాల వరకు సముద్రం చొచ్చుకొచ్చింది. ఇక్కడ నిర్మించిన పర్యాటక కట్టడాలు సైతం ప్రమాదస్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతాలను గురువారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జీవీఎంసీ సీఈ చంద్రయ్య పరిశీలించారు. బీచ్‌కోతపై అధ్యయనం ఈ ప్రాంతంలో బీచ్ ఎందుకు కోతకు గురవుతోంది? ఇంకా ఎంత మేర కోతకు గురయ్యే అవకాశం ఉంది? వంటి అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. బీచ్ పరిరక్షణ కోసం రక్షణ గోడ నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మేరకు మారిటైం యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ శివకొందులుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సీఈ నేతృత్వంలో ఓ బందం నేడు విజయవాడ వెళ్లనుంది. శివకొందులుతో భేటీ అయి ఇక్కడి పరిస్థితిని వివరించనున్నారు. ఆయన కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత చేసే సిఫార్సుల మేరకు రక్షణ గొడను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించారు. బీచ్ కోత వల్ల ప్రమాదకర స్థితిలో ఉన్న కట్టడాలతో పాటు దుకాణాలను కూడా తొలగించి వారికి వేరే చోట వసతి కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంపీ థియేటర్ నిర్మించనున్నందున, దీనికి అవసరమైన అప్రోచ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. బీచ్‌కోతపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని దీనిపై నివేదిక వచ్చాక ఇతర బీచ్‌లతో పాటు ఇక్కడ కూడా శాశ్వత పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈలోగా తాత్కాలిక చర్యలు చేపట్టి తీరాన్ని పరిరక్షించాలన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్కుల అభివద్ధి తదిర పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా బీచ్‌కు పూర్వవైభవం తీసుకు రావాలని కోరారు. -
తీరంలో అలజడి
గార: శుక్రవారం ఉదయం 8 గంటలు... సుమారు 5వేల మంది ప్రజలు నివసించే బందరువానిపేట సముద్ర తీరం... వేకువజామున వేటకు వెళ్లే మత్స్యకారుల పడవలు తీరానికి మరి కొద్ది నిమిషాల్లో చేరుకుంటాయనగా... ఒక్కసారిగా అలలు పెరుగుతూ బందరువానిపేట వైపు దూసుకొచ్చింది. సముద్రానికి బందరువానిపేట 150 మీటర్లు దూరంలో ఉండగా సుమారు 70 మీటర్లు మేర అలలు వచ్చి ఎగసిపడ్డాయి. ఇలా రెండు గంటలపాటు అలల ఉధృతి కనిపించి, తరువాత సాధారణ స్థితికిచేరుకుంది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో చేపల ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ దాటి 5 మీటర్ల మేర భూమికి కోతకు గురయ్యింది. ప్లాట్ఫారం నుంచి రక్షణ గోడ వరకు ఉన్న సిమెంట్ రోడ్ కూడా విరిగిపోయింది. అంతేకాక రక్షణ గోడ కిందినుంచి సముద్రం నీరు చొచ్చుకుపోయి భూమిని కోసేసింది. అప్రమత్తమైన మత్స్యకారులు పడవులను ఒడ్డుకు చేర్చుకున్నారు. నీలం, లైలా, హుద్‌హుద్ తుపాన్ సమయాల్లో కూడా ఇంతమేర అలల ఉధృతి చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. అలలు ఇలా ముందుకు రావడం ఎప్పుడూ చూడలేదు ఇంతలా అలలు ముందుకు రావడం నేను ఇంతవరకూ చూడలేదు. అలలు రావడమే కాకుండా రక్షణ గోడను సైతం దాటి భూమి కోత జరిగింది. ఆ కొద్ది గంటల సేపు సముద్రం వైపు చూస్తే భయమేసింది. అయినా గ్రామస్తులకు ధైర్యం చెబుతూ వచ్చాను. -కోడ లక్ష్ముయ్య, మత్స్యకార నాయకుడు, బందరువానిపేట హుద్హుద్లోనూ ఇంత తీవ్రంగాలేదు హుద్‌హుద్ తుపాన్ బీభత్సం సృష్టించినా ఇంత పెద్ద అలలు ఇలా ముందుకు రాలేదు. పైగా రక్షణ గోడ దాడటంతో పాటు ఇసుక దిబ్బల వద్ద కోతకు గురవుతున్నాయి. పటిష్టమైన రక్షణ గోడను నిర్మించాలి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి. -డి సందెయ్య, బందరువానిపేట