మినోకా!..రక్తనాళాలు బ్లాక్‌ కాకుండానే హార్ట్‌ అటాక్‌! | Sakshi
Sakshi News home page

మినోకా!..రక్తనాళాలు బ్లాక్‌ కాకుండానే హార్ట్‌ అటాక్‌!

Published Sun, Jun 25 2023 1:02 AM

MINOCA heart attack: Without blocking blood vessels - Sakshi

గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయనీ, అందుకే హార్ట్‌ అటాక్‌ వచ్చిందనే మాట తరచూ వినేదే. కానీ కొన్ని హార్ట్‌ అటాక్స్‌... ప్రధాన ధమనులు మూసుకుపోనప్పటికీ, అంటే అవి నార్మల్‌గా ఉన్నప్పటికీ వస్తుంటాయి. అలాంటి హార్ట్‌ అటాక్స్‌నే మినోకా (మయో కార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ విత్‌ నాన్‌ అబ్‌స్ట్రక్టివ్‌ కరొనరీ ఆర్టరీస్‌) అంటారు. ఈమధ్య వస్తున్న గుండెపోట్లలో మినోకా తరహావి పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ‘మినోకా’ హార్ట్‌ అటాక్స్‌ గురించి అవగాహన కల్పించేదే ఈ కథనం.

వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళాల (ధమనుల)లో కొవ్వులు (ప్లాక్స్‌) పేరుకుపోవడం సహజం. ఈ ప్లాక్స్‌ క్రమంగా పెరుగుతూ బ్లాక్స్‌లా గుండెపోటుకు దారితీస్తాయి. అయితే సుమారు 6 నుంచి 10 శాతం మంది గుండెపోటు వచ్చిన వారి యాంజియోగ్రామ్‌లో బ్లాక్స్‌ ఏవీ కనిపించకపోవడం కార్డియాలజిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి  వాళ్లకు గుండెపోటు ఎందుకు వస్తోందనే విషయాన్ని మరింత లోతుగా పరిశీలించినప్పుడు అబ్బురం కలిగించే విషయాలు తెలిశాయి. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ ప్లాక్స్‌ లేనప్పటికీ కొన్నిసార్లు గుండె కండరం దెబ్బతినవచ్చు. ఇలా గుండెకండరం దెబ్బ తినడం వల్ల, రక్తనాళాల  బ్లాక్స్‌తో సంబంధం లేకుండా వచ్చే గుండెపోటునే ‘మినోకా’ అంటారు.

మినోకాకు కారణాలు...  
మినోకాకు అనేక అంశాలు దోహదపడుతుంటాయి. వాటిల్లో ప్రధానమైనవి...
1. గుండె రక్తనాళాలు తాత్కాలికంగా కుంచించుకుపోవడం: ఈ కండిషన్‌ను ‘కరోనరి స్పాసమ్‌’ అని పిలుస్తారు. సిరల గోడల్లో కండరం ఉండదు. కానీ ధమనుల గోడలు కండరంతో నిర్మితమై ఉంటాయి. ధమని కండరం సంకోచించి అలాగే ఉండిపోతే గుండె కండరం దెబ్బ తింటుంది. మహిళల్లో కరోనరీ స్పాసమ్‌ ఎక్కువ. అందుకే ఈ గుండెపోటుకు అవకాశాలూ ఎక్కువే.  
2. ప్లాకులలో పగుళ్ల (ఎరోషన్స్)తో: వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల్లో ప్లాకులేర్పడుతూ ఉంటాయి. ఈ ప్లాకులపై ఎరోషన్స్) వల్ల కూడా  కొన్నిసార్లు గుండెపోటు రావచ్చు.  
3. మైక్రోవాస్కులర్‌ డిస్‌ఫంక్షన్‌: గుండె తాలూకు మూడు ప్రధాన రక్తనాళాలు... పోను పోను మరింత చిన్న రక్తనాళాలుగా మారి గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటిల్లో అడ్డంకులతో వచ్చిన గుండెపోటునూ ‘మినోకా’గానే పరిగణిస్తారు. ఇలా సూక్ష్మ రక్తనాళాల్లో వచ్చే జబ్బునే మైక్రో వాస్కులర్‌ డిస్‌ ఫంక్షన్‌ అంటారు.
4. కరోనరీ ఎంబాలిజం: దేహంలో వేరేచోట ఏర్పడిన రక్తం గడ్డలు గుండె రక్తనాళాల్లో అడ్డంకిగా మారి గుండెపోటుని కలిగించవచ్చు. దీన్ని కరోనరీ ఎంబాలిజం అంటారు.
5. రక్తనాళాల్లో ఎలాంటి తేడాలూ లేకుండా గుండె కండరం దెబ్బ తినటం: కొన్నిసారు గుండె రక్తనాళాల్లో ఏమాత్రం తేడాలు లేకపోయినా మినోకా రావచ్చు.

అవసరమైన వైద్య పరీక్షలు...
గుండెపోటు లక్షణాలు కనిపించగానే తొలుత ఈసీజీ, ఎకో, ఆ తర్వాత ట్రోపొనిన్‌ అనే పరీక్షలు చేస్తారు. లక్షణాలతో పాటు ఈ పరీక్షల ఫలితాలను బట్టి గుండెపోటును నిర్ధారణ చేస్తారు. నిజానికి గుండెపోటు నిర్ధారణకు యాంజియోగ్రామ్‌ అవసరం ఉండదు. కానీ ఏ తరహా చికిత్స అవలంబించాలనే అంశానికి యాంజియోగ్రామ్‌ సహాయపడుతుంది. మినోకా ఉన్న వారిలో గుండెపోటు వచ్చినట్లు అన్ని ఆధారాలూ ఉంటాయి కానీ, యాంజియోగ్రామ్‌ చేసినప్పుడు అందులో బ్లాక్స్‌ కనిపించవు. కాబట్టి వీళ్లలో స్టెంట్‌ వేసే అవకాశం ఉండదు.

మినోకా నివారణ ఎలా?
మినోకా నివారణకు ప్రత్యేకమైన చర్యలేమీ లేనప్పటికీ మామూలు గుండెజబ్బు నివారణ తీసుకునే జాగ్రత్తలే మినోకానూ నివారిస్తాయి. సమతులాహారం, వ్యాయామం, పొగాకు,  మద్యానికి దూరంగా ఉండటం, స్ట్రెస్‌ తగ్గించుకోవడం, మంచి నిద్ర, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉంటే... మిగతా గుండె జబ్బులు లాగానే మినోకానూ నివారించేందుకూ, కొంతమేర ముందుగా  పసికట్టేందుకు అవకాశం ఉంటుంది.
 
ఎవరిలో ఎక్కువ?
పురుషులతో పోలిస్తే మినోకా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కాస్త వయసు  తక్కువ వాళ్లలోనూ మినోకా వచ్చే అవకాశం ఎక్కువ. పొగతాగే అలవాటు ఉన్నవారిలోనూ మినోకా వచ్చే అవకాశాలెక్కువ.
లక్షణాలు : సాధారణ గుండెపోటు లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయి. అంటే శ్వాస అందకపోవడం, ఆయాసపడటం, ఛాతీపై నొప్పి, ఎడమ భుజం, వీపులో ఎడమవైపు నొప్పి, ఎడమ దవడలోనూ నొప్పి కనిపించడం, చెమటలు పట్టడం వంటివి.

సాధారణ గుండెపోటుకి, మినోకా గుండెపోటుకీ తేడా ఏమిటి?
మినోకా వచ్చిన వారిలో యాంజియోగ్రామ్‌ చేశాక... డాక్టర్లకు బాధితుల్లో బ్లాక్స్‌ ఏవీ పెద్దగా కనిపించవు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పినప్పుడు వారు సంతోషిస్తారు. కానీ  ముఖ్యమైన విషయం ఏమిటంటే... మినోకా కూడా గుండెపోటే. గుండెపోటులో ఏ దుష్పరిణామాలు ఉంటాయో మినోకాలోనూ అవే ఉంటాయి. అంటే... గుండె పంపింగ్‌ తగ్గడం, ఆకస్మికంగా మరణం సంభవించడం వంటివి.

మినోకాని గుర్తించాక...?
మినోకాని గుర్తించాక దానికి కారణాలని అన్వేషించడం తప్పనిసరి. ఇందుకు  ఇంట్రా–కరోనరీ ఇమేజింగ్‌ ప్రధాన భూమిక నిర్వర్తిస్తుంది. ఇంట్రాకరోనరీ ఇమేజింగ్‌  అంటే గుండె రక్తనాళాల్లోనికి చిన్న కెమెరా వంటి సాధనాన్ని పంపి గుండె రక్తనాళం గోడని నిశితంగా పరిశీలించటం. ఇంట్రావాస్కులర్‌ అల్ట్రాసౌండ్‌ , ఆప్టికల్‌ కోహరె¯Œ ్స టోమోగ్రఫి అనే రెండు రకాల పరీక్షల్లో దేని ద్వారానైనా మినోకాకు కారణాన్ని కొంతమేరకు తెలుసుకోవచ్చు. మినోకా వచ్చాక చేయాల్సిన పరీక్షల్లో కార్డియాక్‌ ఎమ్మారై కూడా ముఖ్యమైనది.

చికిత్స...
మినోకాకు నిర్దిష్టంగా ఒక ప్రత్యేకమైన కారణం లేనందున చికిత్స కూడా నిర్దిష్టంగా ఉండదు. మినోకాకి రకరకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కరోనరి స్పాసమ్‌ వల్ల వచ్చే మినోకాలో క్యాల్షియం ఛానల్‌ బ్లాకర్స్, నైట్రేట్స్‌ అనే మందులు వాడటం ముఖ్యం. అన్ని రకాల మినోకాలలోనూ రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం తప్పనిసరి అయినప్పటికీ కరోనరీ ఎంబాలిజం వల్ల వచ్చే మినోకాలో బాగా ఎక్కువ శక్తివంతమైన బ్లడ్‌ థిన్నర్స్‌ వాడాల్సి ఉంటుంది. మినోకాలోనూ... సాధారణ గుండెపోటు వచ్చిన వాళ్లలోలాగే గుండె పంపింగ్‌ బలహీనపడే అవకాశం ఉంటుంది. అప్పుడు గుండెలో బలం నింపడానికి ఔషధాల్ని వాడాలి. వీటిలో బీటా బ్లాకర్లు, ఏస్‌ ఇన్‌హిబిటార్స్, స్టాటిన్సు వంటివీ  ఉంటాయి.

డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

Advertisement
 
Advertisement