cardiovascular problems
-
మినోకా!..రక్తనాళాలు బ్లాక్ కాకుండానే హార్ట్ అటాక్!
గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయనీ, అందుకే హార్ట్ అటాక్ వచ్చిందనే మాట తరచూ వినేదే. కానీ కొన్ని హార్ట్ అటాక్స్... ప్రధాన ధమనులు మూసుకుపోనప్పటికీ, అంటే అవి నార్మల్‌గా ఉన్నప్పటికీ వస్తుంటాయి. అలాంటి హార్ట్ అటాక్స్నే మినోకా (మయో కార్డియల్ ఇన్ఫార్క్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరొనరీ ఆర్టరీస్) అంటారు. ఈమధ్య వస్తున్న గుండెపోట్లలో మినోకా తరహావి పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ‘మినోకా’ హార్ట్ అటాక్స్ గురించి అవగాహన కల్పించేదే ఈ కథనం. వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళాల (ధమనుల)లో కొవ్వులు (ప్లాక్స్) పేరుకుపోవడం సహజం. ఈ ప్లాక్స్ క్రమంగా పెరుగుతూ బ్లాక్స్‌లా గుండెపోటుకు దారితీస్తాయి. అయితే సుమారు 6 నుంచి 10 శాతం మంది గుండెపోటు వచ్చిన వారి యాంజియోగ్రామ్‌లో బ్లాక్స్ ఏవీ కనిపించకపోవడం కార్డియాలజిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి వాళ్లకు గుండెపోటు ఎందుకు వస్తోందనే విషయాన్ని మరింత లోతుగా పరిశీలించినప్పుడు అబ్బురం కలిగించే విషయాలు తెలిశాయి. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ప్లాక్స్ లేనప్పటికీ కొన్నిసార్లు గుండె కండరం దెబ్బతినవచ్చు. ఇలా గుండెకండరం దెబ్బ తినడం వల్ల, రక్తనాళాల బ్లాక్స్‌తో సంబంధం లేకుండా వచ్చే గుండెపోటునే ‘మినోకా’ అంటారు. మినోకాకు కారణాలు... మినోకాకు అనేక అంశాలు దోహదపడుతుంటాయి. వాటిల్లో ప్రధానమైనవి... 1. గుండె రక్తనాళాలు తాత్కాలికంగా కుంచించుకుపోవడం: ఈ కండిషన్‌ను ‘కరోనరి స్పాసమ్’ అని పిలుస్తారు. సిరల గోడల్లో కండరం ఉండదు. కానీ ధమనుల గోడలు కండరంతో నిర్మితమై ఉంటాయి. ధమని కండరం సంకోచించి అలాగే ఉండిపోతే గుండె కండరం దెబ్బ తింటుంది. మహిళల్లో కరోనరీ స్పాసమ్ ఎక్కువ. అందుకే ఈ గుండెపోటుకు అవకాశాలూ ఎక్కువే. 2. ప్లాకులలో పగుళ్ల (ఎరోషన్స్)తో: వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల్లో ప్లాకులేర్పడుతూ ఉంటాయి. ఈ ప్లాకులపై ఎరోషన్స్) వల్ల కూడా కొన్నిసార్లు గుండెపోటు రావచ్చు. 3. మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్: గుండె తాలూకు మూడు ప్రధాన రక్తనాళాలు... పోను పోను మరింత చిన్న రక్తనాళాలుగా మారి గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటిల్లో అడ్డంకులతో వచ్చిన గుండెపోటునూ ‘మినోకా’గానే పరిగణిస్తారు. ఇలా సూక్ష్మ రక్తనాళాల్లో వచ్చే జబ్బునే మైక్రో వాస్కులర్ డిస్ ఫంక్షన్ అంటారు. 4. కరోనరీ ఎంబాలిజం: దేహంలో వేరేచోట ఏర్పడిన రక్తం గడ్డలు గుండె రక్తనాళాల్లో అడ్డంకిగా మారి గుండెపోటుని కలిగించవచ్చు. దీన్ని కరోనరీ ఎంబాలిజం అంటారు. 5. రక్తనాళాల్లో ఎలాంటి తేడాలూ లేకుండా గుండె కండరం దెబ్బ తినటం: కొన్నిసారు గుండె రక్తనాళాల్లో ఏమాత్రం తేడాలు లేకపోయినా మినోకా రావచ్చు. అవసరమైన వైద్య పరీక్షలు... గుండెపోటు లక్షణాలు కనిపించగానే తొలుత ఈసీజీ, ఎకో, ఆ తర్వాత ట్రోపొనిన్ అనే పరీక్షలు చేస్తారు. లక్షణాలతో పాటు ఈ పరీక్షల ఫలితాలను బట్టి గుండెపోటును నిర్ధారణ చేస్తారు. నిజానికి గుండెపోటు నిర్ధారణకు యాంజియోగ్రామ్ అవసరం ఉండదు. కానీ ఏ తరహా చికిత్స అవలంబించాలనే అంశానికి యాంజియోగ్రామ్ సహాయపడుతుంది. మినోకా ఉన్న వారిలో గుండెపోటు వచ్చినట్లు అన్ని ఆధారాలూ ఉంటాయి కానీ, యాంజియోగ్రామ్ చేసినప్పుడు అందులో బ్లాక్స్ కనిపించవు. కాబట్టి వీళ్లలో స్టెంట్ వేసే అవకాశం ఉండదు. మినోకా నివారణ ఎలా? మినోకా నివారణకు ప్రత్యేకమైన చర్యలేమీ లేనప్పటికీ మామూలు గుండెజబ్బు నివారణ తీసుకునే జాగ్రత్తలే మినోకానూ నివారిస్తాయి. సమతులాహారం, వ్యాయామం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవడం, మంచి నిద్ర, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉంటే... మిగతా గుండె జబ్బులు లాగానే మినోకానూ నివారించేందుకూ, కొంతమేర ముందుగా పసికట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎవరిలో ఎక్కువ? పురుషులతో పోలిస్తే మినోకా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కాస్త వయసు తక్కువ వాళ్లలోనూ మినోకా వచ్చే అవకాశం ఎక్కువ. పొగతాగే అలవాటు ఉన్నవారిలోనూ మినోకా వచ్చే అవకాశాలెక్కువ. లక్షణాలు : సాధారణ గుండెపోటు లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయి. అంటే శ్వాస అందకపోవడం, ఆయాసపడటం, ఛాతీపై నొప్పి, ఎడమ భుజం, వీపులో ఎడమవైపు నొప్పి, ఎడమ దవడలోనూ నొప్పి కనిపించడం, చెమటలు పట్టడం వంటివి. సాధారణ గుండెపోటుకి, మినోకా గుండెపోటుకీ తేడా ఏమిటి? మినోకా వచ్చిన వారిలో యాంజియోగ్రామ్ చేశాక... డాక్టర్లకు బాధితుల్లో బ్లాక్స్ ఏవీ పెద్దగా కనిపించవు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పినప్పుడు వారు సంతోషిస్తారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే... మినోకా కూడా గుండెపోటే. గుండెపోటులో ఏ దుష్పరిణామాలు ఉంటాయో మినోకాలోనూ అవే ఉంటాయి. అంటే... గుండె పంపింగ్ తగ్గడం, ఆకస్మికంగా మరణం సంభవించడం వంటివి. మినోకాని గుర్తించాక...? మినోకాని గుర్తించాక దానికి కారణాలని అన్వేషించడం తప్పనిసరి. ఇందుకు ఇంట్రా–కరోనరీ ఇమేజింగ్ ప్రధాన భూమిక నిర్వర్తిస్తుంది. ఇంట్రాకరోనరీ ఇమేజింగ్ అంటే గుండె రక్తనాళాల్లోనికి చిన్న కెమెరా వంటి సాధనాన్ని పంపి గుండె రక్తనాళం గోడని నిశితంగా పరిశీలించటం. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ , ఆప్టికల్ కోహరె¯Œ ్స టోమోగ్రఫి అనే రెండు రకాల పరీక్షల్లో దేని ద్వారానైనా మినోకాకు కారణాన్ని కొంతమేరకు తెలుసుకోవచ్చు. మినోకా వచ్చాక చేయాల్సిన పరీక్షల్లో కార్డియాక్ ఎమ్మారై కూడా ముఖ్యమైనది. చికిత్స... మినోకాకు నిర్దిష్టంగా ఒక ప్రత్యేకమైన కారణం లేనందున చికిత్స కూడా నిర్దిష్టంగా ఉండదు. మినోకాకి రకరకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కరోనరి స్పాసమ్ వల్ల వచ్చే మినోకాలో క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్, నైట్రేట్స్ అనే మందులు వాడటం ముఖ్యం. అన్ని రకాల మినోకాలలోనూ రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం తప్పనిసరి అయినప్పటికీ కరోనరీ ఎంబాలిజం వల్ల వచ్చే మినోకాలో బాగా ఎక్కువ శక్తివంతమైన బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుంది. మినోకాలోనూ... సాధారణ గుండెపోటు వచ్చిన వాళ్లలోలాగే గుండె పంపింగ్ బలహీనపడే అవకాశం ఉంటుంది. అప్పుడు గుండెలో బలం నింపడానికి ఔషధాల్ని వాడాలి. వీటిలో బీటా బ్లాకర్లు, ఏస్ ఇన్హిబిటార్స్, స్టాటిన్సు వంటివీ ఉంటాయి. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ సీనియర్ కార్డియాలజిస్ట్ -
గుండెకు ‘ప్రాణం'
గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి, హృద్రోగ సమస్యలు పరిష్కరించడానికి ప్రాణాయామము, యోగాసనాలు, ధ్యానసాధన అత్యుత్తమ మార్గం. అయితే గుండె శక్తివంతంగా మారాలని చేస్తున్నామా? గుండె సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చేస్తున్నామా? అనేది గమనించాలి. తదనుగుణంగా సాధన ఎంచుకోవాలి. సాధన చేసే పద్ధతి మీడియం నుంచి స్పీడ్‌గా ఉంటే...దానిని శక్తి క్రమ అంటారు. అదే నిదానంగా శ్వాసకు అనుగుణంగా చేసే సాధన చికిత్సా క్రమ పద్ధతి అంటారు. నిలబడి చేసే ఆసనాలన్నీ కూడా వెన్నెముకను సాగదీయడానికి, రిలాక్స్ చేయడానికే. నడుం పైభాగాన ఉండే సోవాస్ మజిల్స్ రిలాక్స్ కావడం వల్ల గుండెకు ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా నిలబడి చేసే యోగాసనాల్లో వృక్షాసనం, ఉత్కటాసనం, త్రికోణాసనం,, వీరభధ్రాసనం... వంటివి గుండె పనితీరును మెరుగు పరిచేందుకు ఉపకరిస్తాయి. మరిన్ని ఉపయుక్తమైన ఆసనాల్లో... అధోముఖ శ్వానాసనం, చతురంగ దండాసనం, భుజంగాసనం, పర్వతాసనం, పాదహస్తాసనం... వంటి వాటి వల్ల దిగువ అబ్డామిన్ ఆబ్లిక్ మజిల్ చురుకుగా మారి, తద్వారా గుండె కండరాలు శక్తివంతం అవుతాయి. బాలాసనం, నిరాలంబాసనం, సేతు బంధాసనం వల్ల లోయర్ అబ్డామిన్, ఆబ్లిక్ మజిల్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది. తేలికపాటి ప్రాణయామాలు ఎక్కువ సేపు ధ్యానం చేయడం గుండెకు ఆరోగ్యం. సూక్ష్మ ప్రాణయామాలైన సూర్యవేది, చంద్రవేది అనులోమ విలోమ ప్రాణయామాలు, అంగన్యాస, అధంగన్యాస, అరణ్యాస వంటి విభాగ ప్రాణయామాలు (సెక్షనల్ బ్రీతింగ్ టెక్నిక్స్) చేయడం ద్వారా గుండె సమస్యలున్నవారికి రిలీఫ్ కలుగుంది. హార్ట్‌రేట్ క్రమబద్ధీకరిస్తాయి. (సేకరణ : సత్యబాబు) -
మూలకణాలతో గుండెకు చికిత్స
15 నిమిషాల్లో డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేసే పరిజ్ఞానం సీఎస్ఐ వార్షిక సదస్సులో సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మూలకణాల (స్టెమ్‌సెల్స్) ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను నయం చేసే సరికొత్త పరిజ్ఞానం త్వరలోనే అందుబాటులోకి రానుందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ మోహన్‌రావు స్పష్టం చేశారు. గుండెలో మూల కణాలు ఉండవనేది అపోహ మాత్రమేనని, ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు ఇదే అంశాన్ని నిర్ధారించాయన్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్‌హయత్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏపీ చాప్టర్) 19వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హృద్రోగ బాధితుల్లో చాలామందికి ప్రస్తుతం ఓపెన్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు చేస్తున్నారని, ఖరీదైన స్టంట్స్‌ను అమర్చి మూసుకుపోయిన రక్తనాళాలను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి శస్త్రచికిత్సల అవసరం ఉండబోదన్నారు. స్టెమ్‌సెల్స్ పరిజ్ఞానం ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు. గుండెనొప్పికి కారణాలను కనుగొనేందుకు చేసే డీఎన్ఏ పరీక్షలు 15 నిమిషాల్లోనే పూర్తిచేసే సరికొత్త పరిజ్ఞానాన్ని మరో మూడేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే ఫార్మికోజెనిటిక్స్ ఆధారంగా రోగి అవ సరానికి తగినట్లుగా మందులు తయారు చేసే పరిజ్ఞానం కూడా రాబోతుందన్నారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు. -
గ్రేటర్ గజగజ
=పొల్యూషన్‌తో ఆస్తమా రోగులు విలవిల =చలితో పెరుగుతున్న హృద్రోగ సమస్యలు =పొడిబారుతున్న చర్మం, పగులుతున్న పెదాలు =ఉన్ని దుస్తులు, బాడీ లోషన్లుకు యమ డిమాండ్ సాక్షి, సిటీబ్యూరో : చలితో గ్రేటర్ గజగజ వణుకుతోంది. చీకటిపడిందంటే చాలు సిటీజనులు దుప్పట్లో దూరిపోతున్నారు. పొద్దుపొడిచినా ముసుగు తీయడం లేదు. ఉదయం దట్టమైన మంచు కురుస్తోంది. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి చలిగాలులు వీస్తున్నాయి. వెరసి ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలా ఒకే రోజు మూడు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శరీరానికి ఈ మార్పులను స్వీకరించే శక్తి లేదు. దీపావళి టపాసులు మిగిల్చిన కాలుష్యంతో ఊపిరాడక అస్తమా రోగులు ఇబ్బంది పడుతుంటే.. తాజా చలి గాలులతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు గజగజ వణికిపోతున్నారు. చలివల్ల కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. జుట్టు రాలుతోంది. హృద్రోగుల్లో సమస్యలు రెట్టింపవుతున్నాయి. ఈ చలి బారి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. నగరంలో శుక్రవారం ఉష్ణోగ్రత గరిష్టంగా 28.4 డిగ్రీలు, కనిష్టంగా 19.3 డిగ్రీలు నమోదైంది. గతనాలుగు రోజులుగా ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తోంది. చలి తీవ్రత కారణంగా రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రత మరింత పడేపోయే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఊపందుకున్న బాడీ లోషన్లు.. ఉన్ని దుస్తులు విక్రయాలు పగుళ్ల బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు లిప్ గార్డులు, బాడీలోషన్లు, పాండ్స్ ఇతర క్రీములను ఆశ్రయిస్తుండటంతో ఇటీవల ఆయా ఉత్పత్తులఅమ్మకాలు ఊపందుకున్నాయి. అక్టోబర్ చివరి వరకు రోజుకు ఒకటి రెండు పాండ్స్ క్రీములు అమ్ముడు పోతే శుక్రవారం ఒక్కరోజే 50 డబ్బాలు విక్రయించినట్లు శ్రీనిధి ఫార్మసీ నిర్వహకురాలు జ్యోతిక వివరించారు. రకరకాల బ్రాండ్ల కోసం ప్రజలు ఆయా ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన దుకాణాలను ఆశ్రయిస్తుండగా, మరి కొందరు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే ఉన్ని దుస్తులు, జర్కిన్లు, మంకీ క్యాపులు, మఫ్లర్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు వీటి ధరలను అమాంతం పెంచేశారు. మార్కెట్లో రూ.150 నుంచి రూ.1500 విలువ చేసే జర్కిన్లు లభిస్తున్నాయి. వృద్ధులూ.. జాగ్రత్త సుమా.. =వృద్దులు చలినే కాదు ఎండను కూడా తట్టుకోలేరు. =ఇంట్లో చిన్న మంట పెట్టి, గదిలో వెచ్చదనాన్ని ఏర్పాటు చేయాలి =చన్నీటితో కాకుండా వేడి నీళ్లతో స్నానం చేయించాలి. =చలికోటుతో పాటు కాళ్లకు, చేతులకు సాక్స్ దరించాలి. =చలికాలంలో రకరకాల వైరస్లు వాతావరణంలో సంచరిస్తుంటాయి. =వృద్ధులు ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. =చలికి గుండెపోటుతో పాటు జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. =ఉదయం 8 గంటల తర్వాతే వీరు బయటికి రావాలి. - డాక్టర్ నాగేందర్, ప్రొఫెసర్, ఉస్మానియా ఆస్పత్రి పాలబుగ్గలు కందిపోకుండా... =సాధ్యమైనంత వరకు పసి పిల్లలను బయట తిప్పరాదు. =పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. =నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంది. =పిల్లలకు సులభంగా జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వాలి. =బుగ్గలు కందిపోకుండా రాత్రి పడుకునే ముందు పాండ్స్ రాయాలి. =కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తువులను ఎంపిక చేసుకోవాలి.