తీరం ఘోరం
-
1.5 కి.మీ. మేర కోతకు గురైన రుషికొండ బీచ్
-
కొట్టుకుపోయిన పర్యాటక, జీవీఎంసీ రోడ్లు
-
రూ.15 లక్షలు సముద్రం పాలు
-
మారిటైం యూనివర్సిటీ నిపుణులతో అధ్యయనం
-
రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు
-
కోతకు గురైన బీచ్‌ను పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, విశాఖపట్నం : పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్ ఘోరంగా తయారైంది. రోజురోజుకూ మరింత కోతకు గురవుతూ పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఒకటిన్నర కిలోమీటర్ల మేర కోతకు గురైనట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఏడాది క్రితం జీవీఎంసీ రూ.10 లక్షలతోనూ, మూడేళ్ల క్రితం పర్యాటక శాఖ రూ.5లక్షలతోనూ నిర్మించిన రహదారులు పూర్తిగా కోతకు గురయ్యాయి. తీరం నుంచి 200 అడుగుల మేర కోతకు గురైనట్టుగా గుర్తించారు. తీరంలో నిర్మించుకున్న దుకాణాల వరకు సముద్రం చొచ్చుకొచ్చింది. ఇక్కడ నిర్మించిన పర్యాటక కట్టడాలు సైతం ప్రమాదస్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతాలను గురువారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జీవీఎంసీ సీఈ చంద్రయ్య పరిశీలించారు.
బీచ్‌కోతపై అధ్యయనం
ఈ ప్రాంతంలో బీచ్ ఎందుకు కోతకు గురవుతోంది? ఇంకా ఎంత మేర కోతకు గురయ్యే అవకాశం ఉంది? వంటి అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. బీచ్ పరిరక్షణ కోసం రక్షణ గోడ నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మేరకు మారిటైం యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ శివకొందులుతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సీఈ నేతృత్వంలో ఓ బందం నేడు విజయవాడ వెళ్లనుంది. శివకొందులుతో భేటీ అయి ఇక్కడి పరిస్థితిని వివరించనున్నారు. ఆయన కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత చేసే సిఫార్సుల మేరకు రక్షణ గొడను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించారు. బీచ్ కోత వల్ల ప్రమాదకర స్థితిలో ఉన్న కట్టడాలతో పాటు దుకాణాలను కూడా తొలగించి వారికి వేరే చోట వసతి కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంపీ థియేటర్ నిర్మించనున్నందున, దీనికి అవసరమైన అప్రోచ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. బీచ్‌కోతపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని దీనిపై నివేదిక వచ్చాక ఇతర బీచ్‌లతో పాటు ఇక్కడ కూడా శాశ్వత పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈలోగా తాత్కాలిక చర్యలు చేపట్టి తీరాన్ని పరిరక్షించాలన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్కుల అభివద్ధి తదిర పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా బీచ్‌కు పూర్వవైభవం తీసుకు రావాలని కోరారు.