రౌతులపూడి మండలం ఎస్.పైడిపాలలో డబ్బుల పంపిణీకి సిద్ధపడిన తెలుగు తమ్ముళ్లను తనిఖీ చేస్తున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికలకు గడువు సమీపిస్తుండడం.. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో గుబులెత్తుతున్న టీడీపీ అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. జిల్లావ్యాప్తంగా నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో పరిస్థితి గ్రహించిన టీడీపీ నేతలు ఇంటింటి ప్రచారం కన్నా ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ అనుచరుల ద్వారా గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇంటిలోని మొత్తం ఓట్లకు ఇంత అంటూ గంపగుత్త బేరాలకు దిగుతున్నారు. కాదంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రూపుల వారీగా డ్వాక్రా మహిళలతో సమావేశాలు పెట్టి మరీ నగదు పంపిణీ చేస్తున్నారు.
ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ పంచుతున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన సొమ్ముతో పాటు మద్యం పంపిణీ కూడా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికార యంత్రాంగం అండతో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాల రాజకీయం పెచ్చుమీరిపోతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఓట్ల కొనుగోలుకు ఎస్సీ కాలనీలు, మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం ఓట్లు తమకే వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.
సంక్షేమ పథకాలు రద్దవుతాయని బెదిరింపులు
బరి తెగించేసిన టీడీపీ నేతలు తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దయిపోతాయంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు రద్దు చేసేస్తామని, ఇళ్లు మంజూరు చేయబోమని, రుణాలు ఇతరత్రా రాకుండా చేస్తామని నేరుగా హెచ్చరిస్తున్నారు. ఒకసారి లబ్ధి పొందిన వారికి సంక్షేమ పథకాలు రద్దు చేయడం కుదరని తెలిసి కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే, చాలామంది ప్రజలు వారి తాటాకు చప్పుళ్లకు భయపడటం లేదు. ఏం చేస్తారో చూస్తామని.. నచ్చిన వాళ్లకే ఓట్లు వేస్తామని కరాఖండీగా చెప్పేస్తున్నారు. కొన్నిచోట్లయితే టీడీపీ నేతలపై ఓటర్లు తిరగబడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకూ హెచ్చరికలు
ప్రభుత్వోద్యోగులను కూడా టీడీపీ నేతలు రకరకాలుగా బెదిరిస్తున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లపై తమకు అనుకూలంగా పని చేయాలని తీవ్రంగా వేధిస్తున్నారు. అధికారం టీడీపీ చేతిలో ఉండడంతో వారందరూ భయపడుతున్నట్టు కనిపిస్తున్నా.. ఓటు ద్వారా బుద్ధి చెబుతామని అంతర్గతంగా చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరిని టీడీపీ నేతలు తమ గుప్పెట్లో పెట్టుకుని వారి ద్వారా ఓట్ల కొనుగోలు వ్యవహారాలు నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment