సాక్షి ప్రతినిధి, కాకినాడ: పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ ‘పచ్చ’బాబులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధినేత చూపిన బాటలోనే నడుస్తూ ‘ఓటుకు నోటు’ ఎర వేస్తున్నారు. నంద్యాల తరహాలో కొంతమంది తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు రీసోర్స్ పర్సన్ల ద్వారా భారీగా నగదు పంపిణీ చేస్తున్నారు. తమ చెప్పుచేతల్లో ఉండే డ్వాక్రా సంఘాల నాయకులు, రేషన్ డీలర్లతో ఈ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు.
- ఏలేశ్వరం పట్టణంలో డబ్బులు పంచుతూ రూ.1,47,500 నగదుతో టీడీపీ కార్యకర్త నాగబాబు ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పట్టుబడ్డారు.
- అనపర్తి మండలం మహేంద్రవాడలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న చిన్నారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.48 వేలు స్వాధీనం చేసుకున్నారు.
- సామర్లకోట మండలం నవర గ్రామంలో టీడీపీ నాయకులు స్టీల్ గిన్నెలు పంపిణీ చేశారు.
- రంపచోడవరం నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు చెందిన 40 మంది డబ్బుల పంపిణీలో నిమగ్నమయ్యారు.
- రాజమహేంద్రవరం 31వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ ఒకరు నగదు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. వెంటనే టీడీపీ నాయకులు వచ్చి పోలీసులను పక్కదారి పట్టించి అక్కడి నుంచి పంపించేశారు.
ఇలా చెప్పుకుంటూపోతే దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకులు నోట్లు వెదజల్లుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓట్లను లక్ష్యంగా చేసుకొని కొనుగోళ్లు చేస్తున్నారు. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ పంపిణీ చేస్తున్నారు. ఎలాగోలా ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచేందుకు తెగ తాపత్రాయపడుతున్నారు. గడచిన ఐదేళ్లుగా అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. మరోసారి గెలిస్తే ఇంకా దోచుకోవచ్చన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు.
మందు, నగదు పంపిణీ చేసేందుకు నమ్మకస్తులను నియమించుకున్నారు. వాస్తవానికైతే నామినేషన్లు వేసిన దగ్గరి నుంచీ ఖర్చు పెడుతూనే ఉన్నారు. ప్రచారం కోసం రోజుకింత అని ఇచ్చి జనాలను రప్పించుకున్నారు. ఇప్పటివరకూ మనుషులను కిరాయికి మాట్లాడుకుని ప్రచారం కానిచ్చేశారు. ఇప్పుడు అసలు సమయం వచ్చింది. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఓడిపోతామన్న భయంతో ఓటుకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దాదాపు ఒక విడత పంపిణీ చేశారు. రెండో విడత పంపిణీకి సిద్ధమవుతున్నారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా టీడీపీ నాయకులు, ముఖ్య వ్యక్తులను, కుల పెద్దలను, మహిళా నాయకులను గుర్తించి వారి ద్వారా ఓట్ల కోసం రహస్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. నిఘా కళ్లు కప్పుతున్నారు. అధికారంలో ఉండటంతో కొందరు ప్రభుత్వ సిబ్బందిని కూడా ఇందుకోసం దర్జాగా పంపిణీకి వాడుకుంటున్నారు.
తాగినోడికి తాగినంత..
నామినేషన్ల సమయంలోనే టీడీపీ నాయకులు భారీగా మద్యం నిల్వ ఉంచుకున్నారు. ఇప్పుడా కేసులను బయటికి తీస్తున్నారు. మంచినీటికన్నా దారుణంగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ రెండు రోజులూ మద్యం మత్తులో ముంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎక్కడికెళ్లినా టీడీపీ నాయకులు ఉచితంగా అందిస్తున్న మద్యం పూటుగా తాగినవారు ఊగుతూ, కేకలేస్తూ గ్రామాల్లో, కాలనీల్లో, వాడల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. వారివలన ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. మద్యం మత్తులో ఘర్షణలు చోటు చేసుకుంటాయని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment