రౌతులపూడి మండలం ఎ.మల్లవరంలో సొమ్ములు డ్రా చేసుకుని అసంపూర్తిగా వదిలేసిన వ్యక్తిగత మరుగుదొడ్డి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ నాయకులే దళారులుగా వ్యవహరించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిధులను మింగేశారు. గడువు ముగుస్తుందన్న తరుణంలో ఎటువంటి మరుగుదొడ్ల నిర్మాణాలూ చేపట్టకుండానే బిల్లులు డ్రా చేసుకుని జేబులు నింపుకొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం స్వచ్ఛభారత్ పక్కాగా అమలైందని ఎవరైనా అనుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అక్రమాలు చూస్తే ఆ నిధులు పక్కదారి పట్టాయన్న విషయం స్పష్టమవుతోంది. రికార్డుల పరంగా నూరు శాతం మరుగుదొడ్లు నిర్మాణాలు జరిగాయని అధికారులు చెబుతున్నా.. అనేకచోట్ల వాస్తవంగా నిర్మాణాలు చేపట్టకుండానే నిధులు మింగేశారు. ఈవిధంగా జిల్లాలో రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగింది. అందుకు తగినట్టుగానే దాదాపు ప్రతి మండలంలోనూ మరుగుదొడ్ల అక్రమాలపై ఫిర్యాదులొచ్చాయి.
అవినీతి ఉదంతాలివిగో..
మరుగుదొడ్ల నిర్మాణాల పేరిట రౌతులపూడి మండలంలో రూ.1.50 కోట్ల మేర మింగేశారు. నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత, ఓ మండల అధికారి కుమ్మక్కై ఈ నిధులు దోచుకున్నారు. పరిమాణాన్ని అనుసరించి ఒక్కో మరుగుదొడ్డికి రూ.12 వేలు, రూ.15 వేలు, రూ.18 వేల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని లబ్ధిదా రులు భావించారు. ఇలాగైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి కావని పేర్కొంటూ ఆ నిధులు మింగేసేందుకు అధికార పార్టీ నాయకులు పథక రచన చేశారు. కాంట్రాక్టర్‌తో నిర్మిస్తామని, లేకుంటే మరుగుదొడ్డి మంజూరు కాదని పరోక్షంగా బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అంగీకరించారు. ఇలా పనులు మొదలు పెట్టి, సగం నిర్మాణం కూడా పూర్తి చేయకుండానే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు చాలలేదని చెబుతూ ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ వసూలు చేశారు. చివరికి నిర్మాణాలను సగంలోనే వదిలేశారు. ఇలా రాజవరం, గంగవరం, ఎ.మల్లవరం, పారుపాక, ఎస్.పైడిపాల గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిధులు కైంకర్యం చేశారు.
తొండంగి మండలంలో కూడా మరుగుదొడ్ల నిర్మాణాల్లో రూ.2 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. నిర్మాణాలు చేపట్టకుండానే, లబ్ధిదారులకు తెలియకుండానే నిధులు డ్రా చేసేశారు. ఒక్క పైడికొండ పంచాయతీలో రూ.70 లక్షల వరకూ అవినీతి జరిగింది. నిర్మాణాలు పూర్తయినట్టు కాంట్రాక్టర్ ఆన్‌లైన్‌లో చూపించి నిధులు మింగేశారు. పైడికొండ పంచాయతీ పరిధి ఆనూరులో తొలుత అక్రమాలు వెలుగు చూడగా, పైడికొండ గ్రామస్తులు కూడా అనుమానంతో జాబితాలు పరిశీలించుకున్నారు. వారికి తెలియకుండానే కాంట్రా క్టర్లు, అధికారులు కుమ్మక్కై దోచుకున్నట్టు తేలింది. విచారణ జరపగా అవినీతి జరగడం వాస్తవమేనని అధికారులు కూడా వెల్లడించారు. చనిపోయిన వారి పేరిట కూడా మరుగుదొడ్లు నిర్మించినట్టు తేలింది. ఈ అక్రమాలపై ఆనూరు, పైడికొండ గ్రామాల వారు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జరిగిన ఉన్నత స్థాయి విచారణలో అవినీతి తేటతెల్లమయ్యింది.
కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ చిల్లంగి, కిర్లంపూడి, జగపతినగరం గ్రామాల్లో స్వచ్ఛభారత్ కింద సుమారు 1,957 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యడ్ల మురళీకృష్ణ పేరిట ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా 15 మరుగుదొడ్లకు రూ.1.35 లక్షలు ఒకసారి, రూ.90 వేలు మరోసారి జమయ్యాయి. ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని బూరుగుపూడి ఫీల్డ్ అసిస్టెంట్ పాటంశెట్టి వీరబాబు పేరిట 10 వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.90 వేలు ఒకసారి, రూ.60 వేలు ఒకసారి మొత్తం రూ.1.50 లక్షలు జమ అయ్యాయి. గ్రామంతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఎక్కడో ఐఐటీ ఫ్యాకల్టీగా పని చేస్తున్న గుడిమెల్ల శ్రీలక్ష్మి అనే మహిళ పేరిట 11 మరుగుదొడ్లకు వివిధ తేదీల్లో రూ.1.65 లక్షలు జమయ్యాయి. కిర్లంపూడికి చెందిన ఎ.దుర్గా పోలారావు పేరిట 30 మరుగుదొడ్లకు సంబంధించి 2017 మార్చి 20న రూ.12 వేలు, మార్చి 27న రూ.42 వేలు, జూలై 17న రూ.1.80 లక్షలు, తిరిగి మార్చి 27న రూ.36 వేలు, జూలై 10న రూ.24 వేలు, జూలై 3న రూ.1.20 లక్షలు, జూలై 10న రూ.36 వేలు జమయ్యాయి. అలాగే మాజీ సర్పంచ్ పి.నాగశివరామారావు పేరుమీద కొన్ని వ్యక్తిగత మరుగుదొడ్లకు ఎన్‌జీవోల పేర్ల మీద బిల్లులు మంజూరయ్యాయి. ఇవేకాకుండా వందలాది వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు పంచాయతీ ఖాతాకు జమయినప్పటికీ లబ్ధిదారులకు చేరలేదు.
అయినవిల్లి మండలంలో రూ.80 లక్షల పైనే అవకతవకలు జరిగాయి. వీటిని వెలికి తీయాలని పలువురు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని 21 గ్రామాలకుగాను ఉపాధి హామీ పథకంలో 1,090, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 2,090 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి సొమ్ములు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలి. అలాకాకుండా పంచాయతీ ఖాతాల్లోను, కాంట్రాక్టర్ ఖాతాల్లోను, ఏజెన్సీ ఖాతాల్లోను జమ చేశారు. ఇదే అదునుగా లబ్ధిదారుల ఖాతాల్లో కాకుండా అధికార పార్టీ నాయకులు తమకు ఇష్టం వచ్చిన ఖాతాల్లో మరుగుదొడ్ల సొమ్ములు జమ చేశారు. మరుగుదొడ్లను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి తేవడంతో దానిని తట్టుకోలేక ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వారు చెప్పిన ఖాతాల్లో స్థానిక అధికారులు జమ చేశారు.
పిఠాపురం మండలం కోనపాపపేటకు చెందిన బెణుగు బంగారమ్మ పేరున 2013లో ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు కాగా, దానిని ఆమె సొంత ఖర్చుతో నిర్మించుకుంది. 2014లో ఆమె మరణించింది. కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మాత్రం రాలేదు. కానీ ఆమె పేరున రెండు మరుగుదొడ్లు కట్టినట్లు, నిధులు డ్రా చేసినట్టు రికార్డుల్లో చూపించాయి. ఐడీ నంబరు 04047220500400094తో 13.06.2013న ఒకటి పూర్తయినట్లు, రెండోది 040472205004000901 ఐడీ నంబరుతో 14.11.2013న ఆమోదం పొందినట్టు, ఒక్కోదానికి రూ.12,900 మంజూరైనట్లు, వాటిని డ్రా చేసినట్లు ఆన్‌లైన్‌లో ఉండడంతో బంగారమ్మ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆ సొమ్ము తాము తీసుకోలేదని, ఎవరు తీసుకున్నారని ప్రశ్నిస్తే ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదని ఆమె కుమారుడు వాపోయాడు. కోనపాపపేటకు చెందిన వికలాంగుడు తిత్తి సింహాద్రి, వాసుపల్లి పంపమ్మ తదితరుల ఇళ్లవద్ద మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్లు ఆన్‌లైన్‌లో చూపించి, వారి తరఫున వేరే వ్యక్తులు బిల్లులు డ్రా చేశారని ఫిర్యాదులొచ్చాయి.
కాకినాడ దుమ్ములపేట మత్స్యకార ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్టుగా రికార్డుల్లో చూపించి నిధులు కైంకర్యం చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడాల్సిన సొమ్మును ఇతర ఖాతాలకు మళ్లించి దిగమింగేశారు. ఓ ఏఈ, స్థానిక అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారు. విషయం బయటికి పొక్కడంతో పాటు అప్పటి కలెక్టర్‌కు దీనిపై ఫిర్యాదు కూడా వెళ్లింది. దీంతో నాటి కమిషనర్ తీవ్రంగా హెచ్చరించడంతో సదరు అధికారి, నేతలు వెనక్కు తగ్గి, ఎవరికివ్వాల్సిన సొమ్ము వారికి ఇచ్చేసి అల్లరి కాకుండా చూసుకున్నారు.
అక్రమాలను అడ్డుకోని టెక్నాలజీ
వ్యక్తిగత మరుగుదొడ్లలో అక్రమాల నివారణకు జీపీఎస్ సిస్టమ్ అని, జియోట్యాగింగ్ అని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. లబ్ధిదారుల ఖాతాలకే డబ్బులు జమ అని చెప్పారు. అవకతవకలకు ఆస్కారమే ఉండదని చెప్పారు. కానీ ఎంత టెక్నాలజీ వాడినా అక్రమార్కులకు అడ్డుకట్ట వేయలేకపోయారు. చివరికి గ్రామాల్లో మృతుల పేరిట కూడా మరుగుదొడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపించి రూ.లక్షల్లో నిధులు పక్కదారి పట్టించారు. భర్తలు బతికుండగా భార్యలకు వితంతు పింఛన్లు మంజూరు చేయించుకున్న అధికార పార్టీ నేతలు.. శవాలకు మరుగుదొడ్లు కట్టినట్టు రికార్డులు సృష్టించి నిధులను పక్కదోవ పట్టించారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో ఆన్‌లైన్‌లో చూడగలిగే జీపీఆర్‌ఎస్ సిస్టమ్ సహితం వారి అక్రమాలను నిఘా కన్నుతో చూడలేకపోయిందంటే వారు ఏవిధంగా చక్కబెట్టేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment