అతగాడి కుటుంబానికి అధికారం వస్తే ఆరాచకమే. బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషించే ఆ యువకుడికి తిరుగుండదు. రాజమహేంద్రవరంలో చెలరేగిపోతారు. మహిళలకు భద్రత లేకుండా పోతోంది. మాన ప్రాణాలు నిలబడాలన్నా... బయటికెళ్లితే క్షేమంగా రావాలన్నా ఆ వ్యక్తులు అధికారంలోకి రాకూడదు. వారొస్తే బ్లేడ్ బ్యాచ్‌లకు ఎదురు లేకుండాపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం సిటీలో బ్లేడ్ బ్యాచ్‌లు 300 వరకు ఉన్నట్టు సమాచారం. నాయకుల అండదండలతో ఈ బ్యాచ్‌లు రెచ్చి పోతున్నాయి. రాజేంద్రనగర్, ఆదెమ్మ దిబ్బ, క్వారీ మార్కెట్ ప్రాంతం, కంబాల చెరువు, గోపాల నగర్ పుంత, ఆవరోడ్డు వాంబే గృహాలు, తదితర ప్రాంతాలలో ఈ ముఠాలు తిరుగుతున్నాయి. ఆ మధ్య బ్లేడ్ బ్యాచ్ పంపకాల్లో తేడా రావడం, ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరులో వీరి మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రెండు హత్యలు కూడా జరిగాయి.
బ్లేడ్ బ్యాచ్‌లో మైనర్ యువకులే
బ్లేడ్ బ్యాచ్ ముఠాలో ఎక్కువ శాతం మంది 13 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువకులే ఎక్కువగా ఉన్నారు. వీరు ఎక్కువగా చదువుకోకపోవడం, చోటా, మోటా నాయకుడి వద్దకు చేరి నేరాలకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులను బయటపెట్టేందుకు వీరిని ఉపయోగించుకుంటున్నారు. బ్లేడ్ బ్యాచ్ యువకులను అరెస్ట్ చేస్తే ముందుగా పోలీసులకు రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆ కుర్రాడు.. అమాయకుడు. వదిలేయాలని ఫోన్లు చేస్తుంటారు. నాయకుల ఫోన్లకు, సిఫార్సులకు పోలీసులు లొంగక తప్పడం లేదు. ఒకవేళ అరెస్ట్ చేద్దామని వెళ్లినా మమ్మల్ని అరెస్ట్ చేస్తే బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది.
చిన్నపాటి ఘర్షణలకే హత్యలు
చిన్నపాటి ఘర్షణలకే హత్యలకు వీరు తెగబడుతున్నట్టు తెలిసింది. గంజాయి మత్తులు, మద్యం మత్తులో ఉంటున్న యువకులు హత్యలు చేయడం హీరోయిజంగా భావిస్తున్నారు. చిన్నపాటి తగాదాకే వీరంగం సృష్టించి చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ ముఠాలు ఇంటి వద్ద ఉన్న వారిని సైతం మాట్లాడదామని తీసుకువెళ్లి హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. దీనితో బ్లేడ్ బ్యాచ్‌లో ఉన్న యువకుల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆందోళన చెందుతున్నారు.
ఆ యువ నాయకుడి అండదండలతోనే
నగరంలో పట్టు ఉన్న నాయకుడిగా చెలామణి అవుతున్న నాయకుడి సుపుత్రుడే ఈ బ్లేడ్ బ్యాచ్‌లకు అండగా నిలుస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. వారికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో తనకు అండగా ఉంటారని, గ్రూపుగా వెనకుంటారని బ్లేడ్ బ్యాచ్ యువకులను ప్రోత్సహిస్తున్నారు. ఆ యువ నాయకుడికి కూడా అదొక సరదాగా మారింది. తానేంటో చెప్పుకోవాలనో.. మరేంటో తెలియదు గాని బ్లేడ్ బ్యాచ్ యువకులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడా ఆ యువ నాయకుడి కుటుంబీకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పొరపాటున గెలిస్తే రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్‌లకు అడ్డు అదుపూ ఉండదేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ బ్లేడ్ బ్యాచ్‌ల్లో ఉన్న కొందరు ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment