కాఫర్ డ్యామ్ పనులను పరిశీలిస్తున్న సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కలెక్టర్ మిశ్రా
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే, గేట్ల పనితీరు, ఎగువ కాఫర్ డ్యామ్, ఫిస్ లాడర్, దిగువ కాఫర్ డ్యామ్ పనుల పురోగతిపై వివరాలడిగి తెలుసుకున్నారు. వరదల సమయంలో వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేసే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, గేట్ల పనితీరు తదితర అంశాలపై ఆయనకు వివరించారు. సీఈ సుధాకర్ బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ కె.లతాకుమారి, ఈఈలు పి.సుధాకర్‌రావు, మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్వాసితుల వినతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌కు నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. వరదల సమయంలో పాత గ్రామాలను విడిచి అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేరుకున్నామన్నారు. పాత గ్రామాల్లో తమకు సంబంధించిన పశువులు, ఇంటి సామగ్రి, వ్యవసాయ పనిముట్లు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని తెచ్చుకునేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని తూటికుంట సర్పంచ్ కుంజం లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment