రాములు, రామక్క, శ్రీను
సాక్షి, సూర్యాపేట: నిద్రలోనే ముగ్గురి బతుకులు తెల్లారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిసిన ఇంటి గోడ కూలడంతో వృద్ధ దంపతులతో పాటు కుమారుడు దుర్మరణం చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. శీల రాములు(90), రామక్క (83) దంపతులు తమ చిన్న కుమారుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీను(38)తో కలిసి చిన్న రేకుల ఇంట్లో జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను భార్య.. పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది.
కాగా బుధవారం రాత్రి రోజూ మాదిరిగానే శిథిలావస్థకు చేరిన ఆ రేకుల ఇంట్లోనే ఓ గదిలో ముగ్గురు కలిసి ఒకే చోట నిద్రించారు. వర్షాలకు ఇంటి గోడలు బాగా తడవడంతో రాత్రి సమయంలో మధ్య గోడ కూలి వారి మీద పడటంతో ముగ్గురూ నిద్రలోనే విగతజీవులుగా మారారు. గురువారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసేందుకు ఆ ఇంటికి రాగా ఎప్పుడూ బయట కూర్చునే వృద్ధదంపతులు కనిపించకపోవడం, ఇంటి గడియ లోనికి వేసి ఉన్నా ఎవరూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికులతో కలిసి గోడల మట్టిని తొలగించగా మృతదేహాలు కన్పించాయి. పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం
విషయం తెలిసిన వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 75వేలు మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా అందజేశారు. వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
చదవండి: భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస
Comments
Please login to add a commentAdd a comment