సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చిన కొడుకు.. ఆ తల్లిదండ్రులతో కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ ఇంటి గోడ కూలి మట్టిపెళ్లల కింద నలిగి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. సూర్యపేట జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది.
నాగారం మండల కేంద్రంలో శీలం రాములు తన భార్య రాములమ్మ, కొడుకు శ్రీనివాస్(35)తో ఉంటున్నాడు. అయితే కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు శ్రీను హైదరాబాద్‌కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భారీగా గాలి దుమారం వీచింది. అప్పటికే ఆ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నానిపోయి ఉండడంతో.. అవి కుప్పకూలి ఆ ముగ్గురి మీద పడినట్లున్నాయి.
గురువారం ఉదయం విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ బిల్లు ఇచ్చేందుకు వెళ్లే వరకు ఆ ఇల్లు కూలిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడం గమనార్హం. దీంతో.. ఆ ఉద్యోగి స్థానికులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే మట్టిపెళ్లల కింద చిక్కుకుని రాములు, రాములమ్మ, శ్రీను ప్రాణం విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ట్రాక్టర్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిద్రలోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment