గుండెపోటుతో తనయుడు మృతి
ఒక్కరోజు వ్యవధిలోనే రెండు విషాదాలు
శాలిగౌరారం: కన్న తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతిచెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. మనిమద్దె గ్రామానికి చెందిన అంతటి శంకరయ్య(72)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీను అనారోగ్యం బారిన పడి ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. చిన్న కుమారుడు రాంబాబు(34) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శంకరయ్య, అతడి భార్య మనిమద్దె గ్రామంలోనే ఉంటున్నారు.
శంకరయ్య అనారోగ్యంతో మూడు నెలలుగా మంచం పట్టి ఆదివారం మృతిచెందాడు. తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న రాంబాబు హైదరాబాద్ నుంచి కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి మృతదేహాన్ని చూసినప్పటి నుండి శంకరయ్య తీవ్ర మనోవేదనతో రోదిస్తూ ఉన్నాడు. బంధువులు, ఎంత నచ్చజెప్పినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామంలో తండ్రి శంకరయ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి మరణాన్ని తట్టుకోలేక సాయంత్రం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వెంటనే రాంబాబును నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ రాంబాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అదే రోజు రాత్రి రాంబాబు మృతదేహాన్ని మనిమద్దెకు తీసుకురాగా మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక్కరోజు వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నపాటి పెంకుటిల్లు తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేని ఆ కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్న తండ్రి, ఇద్దరు కుమారులు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
Comments
Please login to add a commentAdd a comment