సూర్యాపేట క్రైం/చిలుకూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం ఆర్లెగూడెం గ్రామ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, అడ్వకేట్ ధరావత్ భాస్కర్ కుమారుడు నిఖిల్(24) హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవల ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాడు. దసరా సెలవులకు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చాడు. నిఖిల్ ఈ నెల 9వ తేదీన సాయంత్రం తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11గంటల సమయంలో ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఫోన్ చేసి చాలా సమయం అవుతున్నా ఇంటికి చేరుకోలేదు. దీంతో నిఖిల్ తల్లి అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
ఆ రోజు నుంచి తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు. కాగా మంగళవారం ఉదయం ఆర్‌కే మేజర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకుని వస్తుండగా రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెలుసుకున్న నిఖిల్ తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని చనిపోయింది తమ కుమారుడేనని నిర్ధారణ చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంతోనే తన కుమారుడిని హత్య చేశారని మృతుడి తండ్రి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా కోదాడ రూరల్ సీఐ నాగదుర్గాప్రసాద్ తెలిపారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనట్లు పేర్కొన్నారు.
ముమ్మరంగా పోలీసుల విచారణ..
నిఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిఖిల్ శరీరంపై తీవ్రంగా గాయాలుండడంతో మృతికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిఖిల్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటూ అతని తల్లితండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండుళ్లుగా సూర్యాపేటకి చెందిన ఒక వ్యాపారి కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా సమాచారం. అయితే కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు నిఖిల్ అక్క తెలిపారు. దీనిపై అమ్మాయి తండ్రిని పోలీసులు విచారించి పంపినట్లు సమాచారం. దీనితో పాటు గతంలో అదే అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి నిఖిల్‌తో అమ్మాయి సన్నిహితంగా ఉండడంతో అతనే హత్య చేసినట్లుగా అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీనితో పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని సీఐ
రాజశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment