శ్రీరాంపూర్ : సింగరేణిలో ఉత్పత్తి కౌంట్ డౌన్ మొదలైంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ లోగా కంపెనీ నిర్దేశించిన లక్ష్యా న్ని సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కార్మికులు అధికసంఖ్యలో పని చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా గనులపై ఉత్పత్తి భారం ఎక్కువగా ఉంది. కా నీ.. పరిస్థితి చూస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా కనిపించడం లేదు.
అయినా.. యాజమాన్యం ఉత్ప త్తి కోసం అధికారుల నుంచి మొదలుకుని కార్మికుల వరకు ఉరుకులు పరుగులు పెటిస్తోంది. మొదటి మూడు త్రైమాసికాల్లో శ్రద్ధచూపని యాజమాన్యం ఇప్పుడు ఒక్కసారిగా లక్ష్య సాధనకు కార్మికులపై ఒత్తిడి తెస్తోంది.
జిల్లాలో మూడు డివిజన్లు..
బెల్లంపల్లి రీజియన్ పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. రీజియన్ వ్యాప్తంగా ఉత్పత్తిని పరిశీలిస్తే ఈ మూడు డివిజన్లు 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం అనుమానే అనిపిస్తోంది. ఈ మూడు ఏరియాల్లో ఒక్క శ్రీరాంపూర్ మాత్రమే 102 శాతంతో లక్ష్యాన్ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా.. మిగిలిన మందమర్రి, బెల్లంపల్లి చాలా వెనుకంజలో ఉన్నాయి. రీజియన్ మొత్తం మార్చి 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 123.39 లక్షల టన్నులు ఉంటే.. అందులో కేవలం 100.47 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 80 శాతం ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది.
బెల్లంపల్లి ఏరియాలో..
బెల్లంపల్లి వార్షిక లక్ష్యం 54 లక్షల టన్నులుగా ఉంది. కానీ.. ఇప్పటికీ అందులో సాధించింది 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. ఇంకా 16.15 లక్షల టన్నుల లోటు ఉంది. ఇదిలా ఉంటే రోజు వారి ఉత్పత్తి లక్ష్యం ఈ డివిజన్‌లో 21 వేలు ఉంది. కానీ.. ఇందులో 14 వేల టన్నులు మాత్రమే వస్తోంది. రోజుకు 6 వేల టన్నుల లోటుతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యం పరిశీలిస్తే(3 తేదీ నాటికి) 55.63 లక్షల టన్నులుంటే.. అందులో కేవలం 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 68 శాతం ఉత్పత్తి నమోదైంది. ఉన్న ఓసీపీల్లో అనుకున్నంత బొగ్గు రావడం లేదు. ఓబీ సమస్య ప్రధాన కారణంగా ఉంది.
మందమర్రి డివిజన్‌లో..
మందమర్రి డివిజన్‌కు మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యం 21.8 లక్షల టన్నులు ఉంది. కానీ.. ఈ లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలే లేవు. డివిజన్ రోజువారి ఉత్పత్తి లక్ష్యం 9 వేల టన్నులు ఉంది. ఇందులో 7500 టన్నులు మాత్రమే వస్తోంది. ఎక్కుగా భూగర్భ గనులు ఉండడం, దీనికితోడు ఉత్పత్తికి దిక్కనుకున్న ఆర్కేపీ ఓసీపీలో కూడా ఆశించినంత బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నారు. ఈ నెల 3వ తేదీ నాటికి ఉన్న లక్ష్యాన్ని పరిశీలిస్తే 20.03 లక్షల టన్నులకు గాను 14.09 టన్నులు మాత్రమే సాధించి 70 శాతం లక్ష్యాన్ని సాధించింది. దీంతో మిగిలిన లక్ష్యంతోపాటు ఉన్న లోటును భర్తీ చేయడం కష్టతరమే అని అధికారులు పేర్కొంటున్నారు.
శ్రీరాంపూర్ డివిజన్‌లో..
శ్రీరాంపూర్ డివిజన్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ డివిజన్ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 52.60 లక్షల టన్నులు. ఇది మార్చి 31 వరకు సాధిం చాలి. రీజియన్‌లో ఉత్పత్తి లక్ష్యం సాధించే డివిజన్ ఇది ఒక్కటేనని అర్థమవుతోంది. ఈ డివిజన్ గనుల్లో రోజువారి ఉత్పత్తి లక్ష్యం 23వేల టన్నులుంటే.. అం తే ఉత్పత్తిని సాధిస్తూ వస్తోంది. మిగిలిన 27 రోజు ల్లో కూడా ఇదే ఉత్పత్తితో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యం సాధించడం ఖాయమని అధికారులు పేర్కొం టున్నారు. ఈ నెల 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 47.71 లక్షల టన్నులకు గాను 48.52 టన్నులు సాధించి 102 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకుంది.
ఉత్పత్తి నష్టానికి అనేక కారణాలు..
ఇదిలా ఉంటే ఉత్పత్తి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓసీపీల్లో వర్షాకాలంలో కురిసిన వర్షాలతో ఉత్పత్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఇటీవల జరిగిన దేశ వ్యాప్త సమ్మె కూడా కొంత కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపింది. సమ్మెతో ఓసీపీల్లో ఓబీ పనులకు ఆటకం కలిగి దాని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది.
దీనికితోడు భూగర్భ గనుల్లో వర్కింగ్ ప్లేస్‌లు లేకపోవడంతో దీనికి తోడు మొదటి మూడు త్రైమాసికాల్లో కూడా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రభావం చూపాయి. గాడితప్పిన పాలనతో ఉత్పత్తిపై పైస్థాయి అజమాయిషి కొరవడింది. కొత్తగా సీఅండ్‌ఎండీగా శ్రీధర్ వచ్చిన తరువాత నే కంపెనీ మెల్లిమెల్లిగా గాడిల పడిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఉత్పత్తి లక్ష్యంలో రీజియన్ ఈ సారి వెనుకబడుతుందనే సంకేతాలే కనిపిస్తున్నాయి.
మిగిలింది 27 రోజులే..
Published Thu, Mar 5 2015 2:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement