బెల్లంపల్లి(ఆదిలాబాద్) : సింగరేణి చరిత్రలో రెండో బొగ్గుట్టగా ప్రసిద్ధిగాంచిన బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గనుల ప్రస్థానానికి తెరపడింది. బొగ్గు ఉత్పత్తి యాగంలో తొమ్మిది దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్న ఏరియాలో పూర్తిగా భూగర్భ గనులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అపారమైన బొగ్గు నిక్షేపాలు కలిగిన ఏరియాలో భూగర్భ గనుల ఉనికి లేకుండా పోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
తాండూర్ కోల్‌మైన్స్ పేరుతో..
జిల్లాలో ప్రథమంగా బెల్లంపల్లి ప్రాంతంలోనే బొగ్గు గనుల తవ్వకాలు ఆరంభమయ్యాయి. తాండూర్ కోల్‌మైన్స్ పేరుతో బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టారు. బెల్లంపల్లిలో 1927లో బొగ్గు గనుల తవ్వకాలకు అంకురార్పణ జరిగింది. ‘మార్గన్స్‌ఫిట్’పేరుతో తొలి భూగర్భ గనిని ప్రారంభించి బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 44 డీప్, 24 డీప్, సౌత్‌క్రాస్ కట్, నం.2 ఇంక్లైన్, శాంతిఖని గనులను బెల్లంపల్లి కేంద్రంగా ప్రారంభించారు. ఆ తదుపరి తాండూర్ మండలంలో బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6 గనులను తర్వాత గోలేటి-1,1ఎ భూగర్భ గనుల విస్తరణ చేపట్టారు. సింగరేణి కాలరీలోనే అత్యధిక భూగర్భ గనులు కలిగి ఉన్న ఏరియాగా బెల్లంపల్లి అప్పట్లోప్రసిద్ధిగాంచింది. ఆయా గనుల ఏర్పాటుతో 1975 నుంచి 1995 వరకు రెండు దశాబ్దాలపాటు బెల్లంపల్లి ఏరియా సింగరేణికి మకుటాయమానంగా విలసిల్లింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గుతో వచ్చిన లాభాల నుంచి ఇతర ప్రాంతాలలో గనుల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. కొత్త ప్రాంతాలలో బొగ్గు గనుల విస్తరణకు బెల్లంపల్లి ఏరియా మార్గదర్శకంగా నిలిచింది. అంతటి విశిష్టత, మరెంతో ఖ్యాతి గడించిన బెల్లంపల్లి ఏరియా యాజమాన్యం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రస్తుతం పతనావస్థకు చేరుకుంది.
బొగ్గు నిక్షేపాలు ఉన్నా..
ఏరియాలో మూతపడిన ప్రతి భూగర్భ గనిలోనూ బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ మూసివేతకే అధికారులు ఆసక్తి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. గని ప్రమాదాన్ని సాకుగా చూపి సౌత్‌క్రాస్ కట్ గనిని, నీటి ప్రవాహం, సైడ్ పాల్స్‌తో బోయపల్లి గనిని, విచ్ఛలవిడిగా సమ్మెలు చేస్తున్నారనే కారణంతో ఎంవీకే-3ని, భూగర్భ గనుల భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా మారాయనే నెపంతో మార్గన్స్‌ఫిట్, ఎంవీకే-1, 2, 5, 6, గోలేటి-1, 1ఎ గనులను ఏకపక్షంగా మూసివేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అనాలోచిత విధానాలతో..
ఏరియాలో ఉన్న భూగర్భ గనులు నాలుగు దశాబ్దాల నుంచి మూసివేతకు గురవుతూ వస్తున్నాయి. సింగరేణి అధికారులు కొందరు తీసుకున్న అనాలోచిత వి ధానాలు, భూగర్భ గనుల భౌగోళిక ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఒక్కొక్కటిగా మూసివేస్తూ వస్తున్నారు. తొలుత సౌత్‌క్రాస్ కట్ గని, ఆ తర్వాత బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6 గనులు మూతపడ్డాయి. అంతకుముందు నం.2 ఇంక్లైన్, 24 డీప్, 44 డీప్ ఏరియా గనులను మూసివేశారు. పదకొండేళ్ల క్రితం గోలేటీ-1 గనిని, తాజాగా ఏరియాలో ఉన్న ఏకైక భూగర్భ గని గోలేటి-1ఎ 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మా ర్చి 31వ తేదీన మూసివేశారు. ఆ గనినీ మూసివేయడంతో బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గనుల ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం కైరిగూడ, డోర్లి-1,2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులతో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులపై ఉన్న మక్కువతో ఏరియాలోని భూగర్భ గనుల జీవిత కాలాన్ని అర్ధంతరంగా, అనాలోచితంగా చిదిమివేశారు.
భూగర్భ గనులకు తెర
Published Tue, Apr 5 2016 1:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement