Contract workers strike
-
జీవో 14 ప్రకారం వేతనాలు చెల్లించాలి
పెద్దపల్లిటౌన్ : సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మున్సిపల్ జేఏసీ పెద్దపల్లి నాయకులు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, జీహెచ్ఎంసీలో చెల్లిస్తున్న మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఒకే విధంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో సమ్మె చేసినపుడు కార్మికులతో జరిపిన చర్చల్లో జీవో 14 ప్రకారం వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. పలుమార్లు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు చాలీ చాలని వేతనాలతో కుటుంబాల పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలు పెంచి, వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపుపై మున్సిపాలిటీ తీర్మానం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేతనాలు చెల్లిస్తామన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, ఆరెపల్లి చంద్రయ్య, సావనపల్లి వెంకటస్వామి, మల్లారపు కొమురయ్య, ఆరెపల్లి సాగర్, శంకర్, వంశీ, గద్దల శ్రీనివాస్, బొంకూరి చంద్రయ్య, మామిడిపల్లి శ్రీనివాస్, సలిగంటి పద్మ, కాదాసి లక్ష్మి, చింతల మరియా తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల ఇళ్ల ముట్టడి భగ్నం
– కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు - భగ్గుమన్న మున్సిపల్ కార్మిక సంఘం – నేడు మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపు అనంతపురం న్యూసిటీ : డిమాండ్ల సాధనలో భాగంగా మున్సిపల్ కార్మికులు బుధవారం చేపట్టిన మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జీఓ 279న రద్దు చేయాలని, మున్సిపల్ సేవలను ప్రైవేటీకరణ చేయరాదంటూ గత రెండ్రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఆందోళనలో భాగంగా బుధవారం మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు ఇళ్లను ముట్టడించేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. వందలాది మంది కార్మికులు ర్యాలీగా నగరపాలక సంస్థ నుంచి ర్యాలీగా బయలుదేరారు. తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా రోప్‌పార్టీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం 150 మంది కార్మికులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, నగర కార్యదర్శి గోపాల్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం నిత్యం శ్రమించే కార్మికుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి సరైంది కాదన్నారు. 279 జీఓను రద్దు చేయాలని కోరుతూ గురువారం నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజేష్‌గౌడ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, మున్సిపల్ కార్మికులు అరుణమ్మ, భవానీ, సరళమ్మ, కృష్ణమ్మ, నాగేంద్ర, చలపతి, తిరుమలేసు తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్మికుల ఆందోళనతో జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. దుర్వాసన వ్యాపిస్తుండడంతో ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారు. -
మిగిలింది 27 రోజులే..
శ్రీరాంపూర్ : సింగరేణిలో ఉత్పత్తి కౌంట్ డౌన్ మొదలైంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ లోగా కంపెనీ నిర్దేశించిన లక్ష్యా న్ని సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కార్మికులు అధికసంఖ్యలో పని చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా గనులపై ఉత్పత్తి భారం ఎక్కువగా ఉంది. కా నీ.. పరిస్థితి చూస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా కనిపించడం లేదు. అయినా.. యాజమాన్యం ఉత్ప త్తి కోసం అధికారుల నుంచి మొదలుకుని కార్మికుల వరకు ఉరుకులు పరుగులు పెటిస్తోంది. మొదటి మూడు త్రైమాసికాల్లో శ్రద్ధచూపని యాజమాన్యం ఇప్పుడు ఒక్కసారిగా లక్ష్య సాధనకు కార్మికులపై ఒత్తిడి తెస్తోంది. జిల్లాలో మూడు డివిజన్లు.. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. రీజియన్ వ్యాప్తంగా ఉత్పత్తిని పరిశీలిస్తే ఈ మూడు డివిజన్లు 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం అనుమానే అనిపిస్తోంది. ఈ మూడు ఏరియాల్లో ఒక్క శ్రీరాంపూర్ మాత్రమే 102 శాతంతో లక్ష్యాన్ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా.. మిగిలిన మందమర్రి, బెల్లంపల్లి చాలా వెనుకంజలో ఉన్నాయి. రీజియన్ మొత్తం మార్చి 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 123.39 లక్షల టన్నులు ఉంటే.. అందులో కేవలం 100.47 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 80 శాతం ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది. బెల్లంపల్లి ఏరియాలో.. బెల్లంపల్లి వార్షిక లక్ష్యం 54 లక్షల టన్నులుగా ఉంది. కానీ.. ఇప్పటికీ అందులో సాధించింది 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. ఇంకా 16.15 లక్షల టన్నుల లోటు ఉంది. ఇదిలా ఉంటే రోజు వారి ఉత్పత్తి లక్ష్యం ఈ డివిజన్లో 21 వేలు ఉంది. కానీ.. ఇందులో 14 వేల టన్నులు మాత్రమే వస్తోంది. రోజుకు 6 వేల టన్నుల లోటుతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యం పరిశీలిస్తే(3 తేదీ నాటికి) 55.63 లక్షల టన్నులుంటే.. అందులో కేవలం 37.85 లక్షల టన్నులు మాత్రమే సాధించారు. దీంతో కేవలం 68 శాతం ఉత్పత్తి నమోదైంది. ఉన్న ఓసీపీల్లో అనుకున్నంత బొగ్గు రావడం లేదు. ఓబీ సమస్య ప్రధాన కారణంగా ఉంది. మందమర్రి డివిజన్లో.. మందమర్రి డివిజన్‌కు మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యం 21.8 లక్షల టన్నులు ఉంది. కానీ.. ఈ లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలే లేవు. డివిజన్ రోజువారి ఉత్పత్తి లక్ష్యం 9 వేల టన్నులు ఉంది. ఇందులో 7500 టన్నులు మాత్రమే వస్తోంది. ఎక్కుగా భూగర్భ గనులు ఉండడం, దీనికితోడు ఉత్పత్తికి దిక్కనుకున్న ఆర్కేపీ ఓసీపీలో కూడా ఆశించినంత బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నారు. ఈ నెల 3వ తేదీ నాటికి ఉన్న లక్ష్యాన్ని పరిశీలిస్తే 20.03 లక్షల టన్నులకు గాను 14.09 టన్నులు మాత్రమే సాధించి 70 శాతం లక్ష్యాన్ని సాధించింది. దీంతో మిగిలిన లక్ష్యంతోపాటు ఉన్న లోటును భర్తీ చేయడం కష్టతరమే అని అధికారులు పేర్కొంటున్నారు. శ్రీరాంపూర్ డివిజన్లో.. శ్రీరాంపూర్ డివిజన్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ డివిజన్ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 52.60 లక్షల టన్నులు. ఇది మార్చి 31 వరకు సాధిం చాలి. రీజియన్‌లో ఉత్పత్తి లక్ష్యం సాధించే డివిజన్ ఇది ఒక్కటేనని అర్థమవుతోంది. ఈ డివిజన్ గనుల్లో రోజువారి ఉత్పత్తి లక్ష్యం 23వేల టన్నులుంటే.. అం తే ఉత్పత్తిని సాధిస్తూ వస్తోంది. మిగిలిన 27 రోజు ల్లో కూడా ఇదే ఉత్పత్తితో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యం సాధించడం ఖాయమని అధికారులు పేర్కొం టున్నారు. ఈ నెల 3 నాటికి నిర్దేశించిన లక్ష్యం 47.71 లక్షల టన్నులకు గాను 48.52 టన్నులు సాధించి 102 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకుంది. ఉత్పత్తి నష్టానికి అనేక కారణాలు.. ఇదిలా ఉంటే ఉత్పత్తి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓసీపీల్లో వర్షాకాలంలో కురిసిన వర్షాలతో ఉత్పత్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఇటీవల జరిగిన దేశ వ్యాప్త సమ్మె కూడా కొంత కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపింది. సమ్మెతో ఓసీపీల్లో ఓబీ పనులకు ఆటకం కలిగి దాని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. దీనికితోడు భూగర్భ గనుల్లో వర్కింగ్ ప్లేస్‌లు లేకపోవడంతో దీనికి తోడు మొదటి మూడు త్రైమాసికాల్లో కూడా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రభావం చూపాయి. గాడితప్పిన పాలనతో ఉత్పత్తిపై పైస్థాయి అజమాయిషి కొరవడింది. కొత్తగా సీఅండ్ఎండీగా శ్రీధర్ వచ్చిన తరువాత నే కంపెనీ మెల్లిమెల్లిగా గాడిల పడిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఉత్పత్తి లక్ష్యంలో రీజియన్ ఈ సారి వెనుకబడుతుందనే సంకేతాలే కనిపిస్తున్నాయి.