మంత్రుల ఇళ్ల ముట్టడి భగ్నం
– కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- భగ్గుమన్న మున్సిపల్ కార్మిక సంఘం
– నేడు మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపు
అనంతపురం న్యూసిటీ : డిమాండ్ల సాధనలో భాగంగా మున్సిపల్ కార్మికులు బుధవారం చేపట్టిన మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జీఓ 279న రద్దు చేయాలని, మున్సిపల్ సేవలను ప్రైవేటీకరణ చేయరాదంటూ గత రెండ్రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఆందోళనలో భాగంగా బుధవారం మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు ఇళ్లను ముట్టడించేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. వందలాది మంది కార్మికులు ర్యాలీగా నగరపాలక సంస్థ నుంచి ర్యాలీగా బయలుదేరారు. తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా రోప్‌పార్టీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం 150 మంది కార్మికులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, నగర కార్యదర్శి గోపాల్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. కార్మికుల న్యాయపరమైన డిమాండ్‌ల సాధనకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం నిత్యం శ్రమించే కార్మికుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి సరైంది కాదన్నారు. 279 జీఓను రద్దు చేయాలని కోరుతూ గురువారం నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజేష్‌గౌడ్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, మున్సిపల్ కార్మికులు అరుణమ్మ, భవానీ, సరళమ్మ, కృష్ణమ్మ, నాగేంద్ర, చలపతి, తిరుమలేసు తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్మికుల ఆందోళనతో జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. దుర్వాసన వ్యాపిస్తుండడంతో ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారు.