- సింగరేణిలో అవతరించనున్న 12వ డివిజన్
- ఆమోదముద్ర వేసిన ఉన్నతాధికారులు
- నూతన గనుల ఏర్పాటుపై దృష్టి
కోల్‌బెల్ట్ : అపారమైన బొగ్గు నిక్షేపాలున్న భూపాలపల్లి ప్రాంతంలో నూతన గనులను చేపట్టేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఇందులో భాగంగా భూపాలపల్లి డివిజన్‌లోని ఘణపురం, వెంకటాపురం, పస్రా మండలాల పరిధిలో నూతన గనులకు శ్రీకారం చుట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులను పొందేందుకు కసరత్తు వేగిరం చేసింది.
ఈ క్రమంలో సింగరేణిలో 12వ డివిజన్‌గా భూపాలపల్లి-2 అవతరించనుంది. తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భవిష్యత్‌లో విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బొగ్గు నిల్వలు కలిగిన ప్రాంతాలను గుర్తించడంతో పాటు వెలికితీసే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలోని 32 భూగర్భ గనులు, 15 ఉపరితల గనుల ద్వారా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్ణయించింది.
ములుగు కోల్‌బెల్ట్ పరిధిలో...
ములుగు కోల్‌బెల్ట్ పరిధిలో కరీంనగర్ జిల్లా తాడిచర్ల నుంచి ఖమ్మం జిల్లా గుండాల వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని 100 కిలోమీటర్ల దూరంలోని భూగర్బంలో 1056 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ 765 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికితీసే అవకాశాలున్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం గుర్తించింది. సుమారు 10 బ్లాకుల్లో ఇట్టి నిల్వలు ఉన్నాయని ప్రభుత్వానికి జియాలాజికల్ రిపోర్టును సమర్పించింది.
ఇందులో తాడిచర్ల 1, 2 బ్లాక్‌లో 337 మిలియన్ టన్నులు, ఖాసింపల్లి 2, కేటికే-1 ఎక్స్‌టెన్షన్లలో 25, మంజూర్‌నగర్‌లో 50, పెద్దాపూర్‌లో 180, మల్లయ్యపల్లిలో 300, వెంకటాపూర్‌లో 100, లక్ష్మిదేవిపేటలో 60, పాలంపేటలో 35, పస్రాలో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. భూపాలపల్లి పరిధిలో 1988లో గనుల తవ్వకానికి శ్రీకారం చుట్టగా.. 1990లో కేటికే 1, 1ఏలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం కేటికే 1, 2, 5, 6, ఓసీపీ, లాంగ్‌వాల్ ప్రాజెక్టుల నుంచి ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.
ఏరియాలో నూతన గనులు..
భూపాలపల్లి డివిజన్ పరిధిలో ఘణపురం మండలం పెద్దాపురం సమీపంలో పెద్దాపూర్ బ్లాక్‌లో, వెంకటాపురం మండలం పరిధిలో వెంకటాపూర్ బ్లాక్‌లో ఒక్కొక్కటి చొప్పున, మల్లయ్యపల్లి, లక్ష్మిదేవిపేట, పస్రా బ్లాక్‌లో నూతన గనులను చేపట్టేందుకు సింగరేణి యూజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సింగరేణి సంస్థ ఒక్కో ఏరియాలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న గనుల్లో ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నందున, నూతన గనుల ఏర్పాటుతో మరో డివిజన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇందుకోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. భూపాలపల్లి మండలం మంజూర్‌నగర్ సమీపంలోని సింగరేణి ఆస్పత్రి వెనుక ఉన్న స్థలం నూతనంగా ఏర్పాటు కానున్న డివిజన్ కేంద్ర కార్యాలయానికి అనువైనదిగా గుర్తించారు. ఈమేరకు సింగరేణి సర్వేవిభాగం సర్వే పనులను సైతం నిర్వహించింది. ప్రత్యేక డివిజన్ ఏర్పాటు విషయంలో సింగరేణి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఆమోదముద్ర వేశారు. సింగరేణి కంపనీ పరిధిలో ప్రస్తుతం 11 డివిజన్లుండగా, భూపాలపల్లి-2 డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య 12కు చేరనుంది.
భూపాలపల్లి -2
Published Sun, Jul 12 2015 3:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement