coal deposits
-
సింగరేణిలో శరవేగంగా తగ్గిపోతున్న బొగ్గు నిక్షేపాలు.. ఈ ఏడాది నుంచే గనుల మూత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొంగు బంగారం కరిగిపోతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో నిక్షేపాలు శరవేగంగా తరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణీయుల కొలువుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సింగరేణి బొగ్గు బాయి అంటేనే ఉద్యోగాల పంట. ఇప్పుడు సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. వచ్చే కొన్నేళ్లలో సింగరేణి బొగ్గు గనులు సగానికిపైగా మూతబడిపోనుండగా, బొగ్గు ఉత్పత్తి సగం కానుంది. అదే జరిగితే తెలంగాణలోని ప్లాంట్లతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ అధిక ధరలు వెచ్చించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు, బోనస్‌ల చెల్లింపులు కూడా కష్టంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచే గనుల మూత ప్రారంభం కానుండగా, ప్రత్యామ్నాయంగా కొత్త గనులను ప్రారంభించి సంస్థ భవిష్యత్తును సుస్థిర చేసుకోవడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థ విస్తరణకు మూలధనం కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నేరుగా గనులను కేటాయించేందుకు ససేమిరా అంటుండగా, వేలంలో పాల్గొని కొత్త గనులు దక్కించుకునే విషయంలో సింగరేణి సంస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. గనులను నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం వేలానికి దూరంగా ఉంది. కేంద్రం ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించగా, శ్రావణపల్లి ఓసీ గనికి సైతం వేలం నిర్వహించడం గమనార్హం.వచ్చే ఏడేళ్లలో 19 గనుల మూత సింగరేణి ఏరియాలో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలగా, 2,997 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనుల్లో మాత్రమే తవ్వకాలు జరిపేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ లీజులను కలిగి ఉంది. కాగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా, ఇక 1,432 మిలియన్ టన్నుల నిక్షేపాలే మిగిలిఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం 22 భూగర్భ, 20 భూఉపరితల గనులు కలిపి మొత్తం 42 గనులను కలిగి ఉండగా..»ొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటంతో వచ్చే రెండేళ్లలో 8 గనులను మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అలాగే 2031–32 నాటికి ఏకంగా 19 గనులను మూసివేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో సింగరేణి సంస్థ 42 గనులు, 40,994 మంది కారి్మకులతో ఏటా సగటున 72.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అయితే 2042–43 నాటికి కేవలం 19 గనులే ఉండనుండగా, కారి్మకుల సంఖ్య సైతం 35,665కి తగ్గిపోనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి కూడా 39.03 మిలియన్ టన్నులకు పడిపోనుంది. విస్తరణకు మూలధనం చిక్కులు సంస్థను కాపాడుకునే క్రమంలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్, పంప్డ్ స్టోరేజీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టి ఇతర రంగాల్లో సంస్థ విస్తరణకు బాటలు వేయాలని ప్రయత్నాలు జరుగుతుండగా, మూలధన పెట్టుబడులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జైపూర్‌లోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు కేటాయింపులుండగా, ఆ గనిని సింగరేణి సంస్థ గతంలోనే చేజిక్కించుకుంది. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నేపథ్యంలో నైనీ బ్లాకుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జైపూర్‌లోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కాలం చెల్లిన రామగుండం థర్మల్–బీ స్టేషన్ స్థానంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయంలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందడానికి వీలుండగా, మిగిలిన 20 శాతం వాటాను సింగరేణి స్వయంగా భరించాల్సి ఉంటుంది. మెగావాట్‌కు రూ.10 కోట్లు చొప్పున ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూ.32 వేల కోట్ల వ్యయం కానుండగా, అందులో 20 శాతం అంటే రూ.6,400 కోట్లను సింగరేణి భరించాల్సి ఉంటుంది. ఇలావుండగా రామగుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇల్లందు జీకే గనిలో మరో 100 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం నిర్మించాలని యోచిస్తోంది. రూ.1,640 కోట్లతో లోయర్ మానేరు డ్యామ్‌పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌పై 500 మెగావాట్లు కలిపి మొత్తం 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరో 100 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. శ్రావణ్‌పల్లి, మాదారం, గోలేటీ ఓపెన్ మైన్స్‌ను ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలంటే సింగరేణి రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉండగా మూలధనం కొరత సమస్యగా మారనుంది. సర్కారు బకాయిలు రూ.31 వేల కోట్లు గనుల మూత, విస్తరణకు మూలధనం కొరతతో పాటు ప్రభుత్వం నుంచి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండటంతో సింగరేణి పరిస్థితి అయోమయంగా మారింది. విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం చెల్లింపులు జరపకపోవడం సంస్థ విస్తరణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు, విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం..అందుకు సంబంధించిన చెల్లింపులు మాత్రం జరపడం లేదు. గడిచిన ఏప్రిల్ నాటికి సంస్థకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.32,325.29 కోట్లు ఉండగా, అందులో ఒక్క తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలే రూ.31,000.5 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన రూ.22,405.76 కోట్లు తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(టీఎస్పీసీసీ) చెల్లించాల్సి ఉండగా, బొగ్గు విక్రయాలకు సంబంధించి రూ.8,594.74 కోట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి రావాల్సి ఉంది. సింగరేణికి మరో రూ.1,324.79 కోట్లను ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర బకాయిపడ్డాయి. ఏటేటా రావాల్సిన బకాయిలు పేరుకుపోయి రూ.32,325 కోట్లకు చేరినా సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని యాజమాన్యం పేర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 చివరి నాటికి రూ.57,448 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నుంచి సింగరేణి సంస్థ బకాయిలను రాబట్టుకోవడం కష్టమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఉత్తర–దక్షిణ కారిడార్‌తో పొంచి ఉన్న ముప్పు ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కోల్ కారిడార్ పేరుతో కొత్త రైల్వే లైన్ వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ వస్తే సింగరేణి బొగ్గుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణి టన్ను బొగ్గును రూ.3,500కు విక్రయిస్తుండగా, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశంలోని రాష్ట్రాలు రూ.1,100కే విక్రయిస్తున్నాయి. పైగా సింగరేణి బొగ్గుతో పోలి్చతే అక్కడి బొగ్గులో నాణ్యత ఎక్కువ. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల నుంచి బొగ్గును సులభంగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.చదవండి: ధరణి పోర్టల్‌లో ఇక నుంచి ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్ముందస్తు ప్రణాళిక లేకుంటే ఇబ్బందే.. ముందస్తు ప్రణాళిక లేకపోతే సింగరేణి పరిస్థితి భవిష్యత్తులో కష్టమే. గతంలో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం తప్ప, విస్తరణను పట్టించుకోలేదు. దీనికితోడు కేవలం వేలంలోనే గనులు దక్కించుకోవాలన్న కేంద్ర నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. తాడిచర్ల బ్లాక్‌కు అనుమతులు తీసుకోవడం, అలాగే మరో మూడు గనులు ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిని కూడా ప్రభుత్వం తీసుకుంటే మరో 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఢోకా ఉండదు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
మైనింగ్ టూరిజంతో కొత్తశోభ
త్వరలో రాంపురం గనికి అనుమతులు! రుద్రంపూర్ (కొత్తగూడెం): మైనింగ్ టూరిజం ఏర్పాటుతో కొత్తగూడెం నూతన శోభను సంతరించుకోనుంది. ఏరియా పరిధిలోని 5 ఇన్‌క్లైన్ గని ప్రాంతంలో మైనింగ్ టూరిజం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సింగరేణి పరిణామక్రమాన్ని తెలిపేందుకు ఒక మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఐదు లేక ఆరు ఎకరాల స్థలం కావల్సి ఉంటుంది. గురువారం అసెంబ్లీలో మైనింగ్ టూరిజం ఏర్పాటుపై సీఎం సానుకూలంగా స్పందించడంతో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్థలాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. ఏరియాలోని ఎంవీటీసీ ట్రైనింగ్ సెంటర్ పక్కన ఉన్న స్థలాన్ని టూరిజం కోసం ఇప్పటికే అధికారులు పరిశీలించారు. అలాగే ఏరియాలోని రాంపురం భూగర్భ గనిలో సుమారు 40 మిలియన్ టన్నులు బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. ఈగని కి సంబంధించిన దాదాపు అన్ని సర్వేలు పూర్తయ్యాయి. అటవీ, ఎన్విరాల్మెంట్ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీ చర్చల్లో 12 నూతన భూగర్భ గనుల ఏర్పాటు చేయనున్నుట్లు సీఎం ప్రకటించారు. దీంతో ఆ కొత్తగనుల్లో రాంపురం ఉంటుందని అధికారులు భిప్రాయపడుతున్నారు. ఈ గని ద్వారా సుమారు వెయ్యి మంది కార్మికులకు ఉపాధి లభించనుంది. -
నిండా నిక్షేపాలు
గోదావరి బేసిన్లో అపార బొగ్గు నిల్వలు 3వేల మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభించే అవకాశం 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్నట్టు గుర్తింపు మొదలైన సర్వే పనులు చింతలపూడి :మన రాష్ట్రంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తేలడం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఇదే సందర్భంలో ఇక్కడి భూమి పొరల్లో ఉన్న బొగ్గును వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కృష్ణా జిల్లా ముసునూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వీటిని తవ్వితీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికిలేఖ పంపించింది. ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిపుణులు రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండల పరిధిలోని సోమవరం ప్రాంతంలో సర్వే చేపట్టారు. సింగరేణి గనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గుకంటే నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఇప్పటికే జీఎస్ఐ నిపుణులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో సర్వే పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మన జిల్లాలోని చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిక్షేపాలపై త్వరలోనే సర్వే చేయనున్నారు. ఇది పూర్తయితే బొగ్గు వెలికితీత పనులను ప్రభుత్వం శరవేగంగా చేపట్టనుందని సమాచారం. కృష్ణా జిల్లా సోమవరం నుంచి చింతలపూడి వరకు 3 వేల మిలియన్ మెట్రిక్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్టు ప్రాథమిక సర్వేలోనే గుర్తించారు. 2013లో లక్నోకు చెందిన బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ సంస్థ కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధ్యయనం చేసి కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాలలో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ లభించే బొగ్గు అత్యంత నాణ్యమైనదని ఆ సంస్థ నిర్ధారించింది. భూమి ఉపరితలానికి 400 మీటర్ల నుంచి 1,400 మీటర్ల లోతున ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నివేదించింది. ఎంతో ప్రయోజనం రాష్ట్ర విభజన తరువాత సింగరేణి బొగ్గును కోల్పోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడింది. దీంతో మన ప్రభుత్వం ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమీకరించే విషయంలో రానున్న నాలుగేళ్లలో సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ లోగానే చింతలపూడి ప్రాంతం నుంచి బొగ్గు నిల్వలను వెలికితీయగలిగితే.. 60 ఏళ్ల పాటు ఏటా 8 వేల మెగావాట్ల విద్యుత్‌ను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని అంచనా. మరోవైపు ఇక్కడి బొగ్గు తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మన ప్రాంతంలోనే థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య తీరుతుంది. రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. బొగ్గు ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయానికీ, పరిశ్రమలకు విద్యుత్ కొరత తీరుతుందని భావిస్తున్నారు. గత సర్వేల్లోనే వెలుగులోకి .. 1964 నుండి 2006 వరకు సుమారు 4 దఫాలుగా ఇక్కడి బొగ్గు నిక్షేపాలపై సర్వేలు చేశారు. ఈ నేపథ్యంలో చింతలపూడి ప్రాంతంలో అపార బొగ్గు నిల్వలు ఉన్నాయని, త్వరలో వెలికితీత పనులు చేపడతామని ఏపీ గనుల శాఖ సీఎండీ ఎండీ శాలినీమిశ్రా గత ఏడాది ఆగస్టులో ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమ, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాలను ఆనుకుని 2,500 చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. మన జిల్లాకు సరిహద్దున గల ఖమ్మం జిల్లా రేజర్ల, నారాయణపురం నుంచి గురుభట్లగూడెం, రాఘవాపురం గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు వెయ్యి అడుగుల మందంతో నిక్షేపాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా రాఘవాపురం, పట్టాయిగూడెం, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం, సీతానగరం, చింతలపూడి గ్రామాల్లో అంతకంటే తక్కువ లోతులోనే నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టునిర్థారించారు. -
నూజివీడు ప్రాంతంలో నల్ల బంగారం!
నెలరోజుల క్రితం గోప్యంగా సర్వే నమూనాల కోసం డ్రిల్లింగ్కు ఏర్పాట్లు 20 నెలల పాటు కొనసాగనున్న పనులు నూజివీడు : సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిలో ఉన్న నూజివీడు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ ఉధృతంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నెల రోజుల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సంస్థకు చెందిన జియాలజిస్టులు సర్వే చేసి నివేదిక ఇవ్వడంతో ఆ సంస్థ డ్రిల్లింగ్కు సిద్ధమైంది. రాజధాని అయ్యే అవకాశాన్ని తృటిలో తప్పిపోవడంతో నూజివీడు ప్రాంత వాసులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు స్పష్టమైతే పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదేళ్ల క్రితమే సర్వే... ఈ ప్రాంతంలోని చాట్రాయి మండలం తుమ్మగూడెం, చిత్తపూరు, సోమవరం, కొత్తగూడెం, ముసునూరు మండలం బాస్వరప్పాడు, లోపూడి, సూరేపల్లి, ఎల్లాపురం, చెక్కపల్లి ప్రాంతాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు పదేళ్ల క్రితమే సర్వే చేసి తేల్చారు. ఆ తరువాత బొగ్గు నిక్షేపాల అన్వేషణ మూలన పడింది. గత ఏడాది రాష్ట్ర విభజన జరగడం, అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులన్నీ తెలంగాణలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగింది. అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాన ఇంధనం బొగ్గు కావడంతో బొగ్గు అవసరం రాష్ట్రంలో తీవ్రంగా పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం అధిక ధరను వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేస్తోంది. దీంతో ప్రభుత్వంపై ఆర్థికంగా తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో నూజివీడు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు వెలుగుచూస్తే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాష్ట్రానికే మంచి సహజ సంపదగా మారనుంది. డ్రిల్లింగ్ పనులకు సన్నాహాలు జీఎస్ఐ సంస్థకు చెందిన జియాలజిస్ట్ నెల రోజుల క్రితం మండలంలోని తుక్కులూరు పరిధిలో బొగ్గు నమూనాలు తీయడం కోసం రెండుచోట్ల పాయింట్లు గుర్తించారు. కార్యనిర్వాహక ఇంజనీర్ నర్సప్ప ఆధ్వర్యంలో నమూనాలను తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన యంత్రాలను ఇప్పటికే ఆ ప్రాంతానికి తరలించారు. మొదట తుక్కులూరు నుంచి జంగంగూడెం వెళ్లే మార్గంలో గుర్తించిన పాయింట్ వద్ద డ్రిల్లింగ్ నిర్వహించడానికి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యి మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయనున్నారు. వెయ్యి మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయడానికి దాదాపు 10నెలల వరకు సమయం పడుతుంది. ఇక్కడ నమూనాల సేకరణ పూర్తయిన తరువాత రెండో పాయింట్ వద్ద డ్రిల్లింగ్ నిర్వహించనున్నారు. అక్కడ కూడా అదే సమయం పడుతుంది. తీసిన నమూనాలను పరీక్షల నిమిత్తం జీఎస్ఐకి పంపుతారు. ఈ డ్రిల్లింగ్ వల్ల భూమిలో బొగ్గు ఎన్ని మీటర్ల లోతులో ఉందనేది కచ్చితంగా తేలుతుంది. ఆ తరువాత అది నాణ్యమైన బొగ్గయితే.. భూమి లోపల ఎంత విస్తీర్ణంలో, ఎంత పరిమాణంలో ఉందనేది తెలుసుకోవడానికి మరింత విస్తృతంగా డ్రిల్లింగ్ పనులు చేపడతారు. ఇవన్నీ పూర్తవడానికి దాదాపు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు సమయం పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
భూపాలపల్లి -2
- సింగరేణిలో అవతరించనున్న 12వ డివిజన్ - ఆమోదముద్ర వేసిన ఉన్నతాధికారులు - నూతన గనుల ఏర్పాటుపై దృష్టి కోల్‌బెల్ట్ : అపారమైన బొగ్గు నిక్షేపాలున్న భూపాలపల్లి ప్రాంతంలో నూతన గనులను చేపట్టేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఇందులో భాగంగా భూపాలపల్లి డివిజన్లోని ఘణపురం, వెంకటాపురం, పస్రా మండలాల పరిధిలో నూతన గనులకు శ్రీకారం చుట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులను పొందేందుకు కసరత్తు వేగిరం చేసింది. ఈ క్రమంలో సింగరేణిలో 12వ డివిజన్‌గా భూపాలపల్లి-2 అవతరించనుంది. తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భవిష్యత్‌లో విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బొగ్గు నిల్వలు కలిగిన ప్రాంతాలను గుర్తించడంతో పాటు వెలికితీసే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలోని 32 భూగర్భ గనులు, 15 ఉపరితల గనుల ద్వారా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. ములుగు కోల్‌బెల్ట్ పరిధిలో... ములుగు కోల్‌బెల్ట్ పరిధిలో కరీంనగర్ జిల్లా తాడిచర్ల నుంచి ఖమ్మం జిల్లా గుండాల వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని 100 కిలోమీటర్ల దూరంలోని భూగర్బంలో 1056 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ 765 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికితీసే అవకాశాలున్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం గుర్తించింది. సుమారు 10 బ్లాకుల్లో ఇట్టి నిల్వలు ఉన్నాయని ప్రభుత్వానికి జియాలాజికల్ రిపోర్టును సమర్పించింది. ఇందులో తాడిచర్ల 1, 2 బ్లాక్‌లో 337 మిలియన్ టన్నులు, ఖాసింపల్లి 2, కేటికే-1 ఎక్స్టెన్షన్లలో 25, మంజూర్‌నగర్‌లో 50, పెద్దాపూర్‌లో 180, మల్లయ్యపల్లిలో 300, వెంకటాపూర్‌లో 100, లక్ష్మిదేవిపేటలో 60, పాలంపేటలో 35, పస్రాలో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. భూపాలపల్లి పరిధిలో 1988లో గనుల తవ్వకానికి శ్రీకారం చుట్టగా.. 1990లో కేటికే 1, 1ఏలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం కేటికే 1, 2, 5, 6, ఓసీపీ, లాంగ్వాల్ ప్రాజెక్టుల నుంచి ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఏరియాలో నూతన గనులు.. భూపాలపల్లి డివిజన్ పరిధిలో ఘణపురం మండలం పెద్దాపురం సమీపంలో పెద్దాపూర్ బ్లాక్‌లో, వెంకటాపురం మండలం పరిధిలో వెంకటాపూర్ బ్లాక్‌లో ఒక్కొక్కటి చొప్పున, మల్లయ్యపల్లి, లక్ష్మిదేవిపేట, పస్రా బ్లాక్‌లో నూతన గనులను చేపట్టేందుకు సింగరేణి యూజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సింగరేణి సంస్థ ఒక్కో ఏరియాలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న గనుల్లో ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నందున, నూతన గనుల ఏర్పాటుతో మరో డివిజన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. భూపాలపల్లి మండలం మంజూర్‌నగర్ సమీపంలోని సింగరేణి ఆస్పత్రి వెనుక ఉన్న స్థలం నూతనంగా ఏర్పాటు కానున్న డివిజన్ కేంద్ర కార్యాలయానికి అనువైనదిగా గుర్తించారు. ఈమేరకు సింగరేణి సర్వేవిభాగం సర్వే పనులను సైతం నిర్వహించింది. ప్రత్యేక డివిజన్ ఏర్పాటు విషయంలో సింగరేణి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఆమోదముద్ర వేశారు. సింగరేణి కంపనీ పరిధిలో ప్రస్తుతం 11 డివిజన్లుండగా, భూపాలపల్లి-2 డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య 12కు చేరనుంది. -
బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు బిల్లు
మన దేశంలో జాతీయ బొగ్గు నిల్వల (coal deposits)ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిన తీరు దేశంలోనే అతి పెద్ద రాజకీయ కళంకం (political scandal) గా నిలిచింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) 2014 మార్చిలో విడుదల చేసిన డ్రాఫ్ట్ నివేదిక తేటతెల్లం చేసింది. 2004-09 మధ్య కాలంలో అప్పటి ఏలికలో ఉన్న ప్రభుత్వం బొగ్గు క్షేత్రాల కేటాయిపులలో అనుసరించిన విధానాలు అసంబద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో బొగ్గు క్షేత్రాల్లో అవినీతి మసి అంటిందనే విషయం బయట పడింది. బొగ్గు క్షేత్రాల ధారాదత్తంలో చోటుచేసుకున్న రూ. వేలకోట్లలో ముడుపుల వ్యవహారం దేశమంతటా తీవ్రదుమారం రేపింది. వ్యవహారంపై ఇంటా బయటా జరిగిన చర్చల ఫలితంగా ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు బిల్లు కార్యాచరణకు కంకణం కట్టుకుంది. భారత ప్రభుత్వం జాతీయ బొగ్గు నిల్వల (coal deposites)° ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు పంపిణీ చేసిన విధానం దేశంలోనే అతి పెద్ద రాజకీయ అవినీతి (ఞౌజ్టీజీఛ్చి టఛ్చిఛ్చీ)గా నిలిచింది. దీన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) 2014, మార్చిలో విడుదల చేసిన డ్రాఫ్ట్ నివేదిక వెల్లడించింది. 2004-09 మధ్య కాలానికి కేంద్రం చేసిన బొగ్గు క్షేత్రాలు కేటాయింపులు అసంబధ్ధంగాగా ఉన్నట్లు పేర్కొంది. అప్పటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బొగ్గు క్షేత్రాల పంపిణీ పోటీ బిడ్డింగ్ (competitve bidding) ద్వారా కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ విధంగా జరగలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తక్కువ ధరకే బొగ్గు గనులను సొంతం చేసుకున్నాయని తద్వారా ఆ సంస్థలకు 170 బిలియన్ డాలర్ల లబ్ధి చేకూరిందని తన నివేదికలో స్పష్టం చేసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తుది నివేదికలో కాగ్ ఈ మొత్తాన్ని 29 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. కాగ్ తన మొదటి నివేదికలో ప్రభుత్వం కోల్ కేటాయింపులను సమర్థవంతంగా చేయాలని సూచించింది. 2012లో బొగ్గు క్షేత్రాల పంపిణీలో జరిగిన అవినీతి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీ ఫిర్యాదు ఫలితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఈ పక్రియలో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కోరింది. దర్యాప్తు చేసిన సీబీఐ తన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో 12 భారతీయ సంస్థలపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేసింది. సదరు సంస్థలు తమ నికర విలువలను అధికంగా చూపించటం, ఇంతకు ముందు జరిగిన కోల్ కేటాయింపులను వెల్లడించకపోవడాన్ని సీబీఐ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశాల ఆధారంగా బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు సీబీఐ అధికారులు అంచనాకొచ్చారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ప్రజలు, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ కేసు దర్యాప్తులో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అప్పటి ప్రతిపక్షం బీజేపీ ప్రధాన మంత్రి రాజీనామాకి డిమాండ్ చేయటంతో పాటు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అందుకు నిరాకరించటంతో 20 రోజులు జరగాల్సిన సమావేశాలు ఏడు రోజులకే పరిమితమయ్యాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివే దిక 1993 నుంచి 2008 మధ్య కాలంలో జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపు పూర్తి సవ్యంగా లేదంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (పీఎస్సీ) స్పష్టం చేసింది. ఈ పక్రియ ఏ మాత్రం పారదర్శకంగా జరగలేదని ఫలితంగా ప్రభుత్వం రూ.కోట్ల మేర నష్టపోయిందని తేల్చింది. కేటాయింపులపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. దాంతో పాటు ఉత్పత్తి ప్రారంభించని గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాల్సిందిగా నివేదికలో సూచించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా గనుల కేటాయింపు ప్రక్రియతో సంబంధమున్న అందరిపైనా, కేటాయింపుల్లో వారి పాత్రపైనా దర్యాప్తు జరపాలని చెప్పింది. 1993-2004 మధ్య జరిగిన కేటాయింపులు, ఎలాంటి ప్రభుత్వ సమాచారం లేకుండా జరిగాయని కమిటీ నివేదికలో తప్పుబట్టింది. సుప్రీం కోర్టు జోక్యం: బొగ్గు క్షేత్రాల అవినీతి తీరుతెన్నులు (కోల్ స్కాం స్టేటస్) నివేదికలోని అంశాలను న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్‌తో పంచుకున్నట్లు అప్పటి సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా 2013, ఏప్రిల్ 26న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తమ నివేదికలోని 20 అంశాలను ప్రభుత్వం మార్చినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకి 2013, ఏప్రిల్ 29న తెలిపింది. దీంతో సుప్రీం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో స్పందించింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు అడిషినల్ సొలిసిటర్ జనరల్ హరిన్ రావల్ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా సీబీఐ ప్రభుత్వంలోని విభాగమని, స్వయం ప్రతిపత్తిలేని సంస్థని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా సుప్రీంకోర్టుకి తెలిపారు. స్పందించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం నివేదికలోని అంశాలను పంచుకోవటం వల్ల ఏమేరకు దర్యాప్తుపై ప్రభావం పడిందనే అంశాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో అప్పటి న్యాయ శాఖ మంత్రి అశ్వినీకుమార్ రాజీనామా చేశారు. తదనంతరం విచారణలో భాగంగా 2013, జూన్11న, నవీన్ జిందాల్, దాసరి నారాయణరావులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2013, అక్టోబర్ 16న ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, మాజీ కోల్ సెక్రటరీ పి.సి ఫరేఖ్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బొగ్గు కుంభకోణం కేసు విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు 2014 జులైలో ప్రత్యేక సీబీఐ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంజాబ్ మాజీ అడ్వకేట్ జనరల్ రాజిందర్ సింగ్ ఛీమాను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, రోజూవారీ కేసు విచారణ జడ్జిగా జస్టిస్ భరత్ పరాషర్ని ప్రత్యేక కోర్టులో సుప్రీం నియమించింది. వివిధ కోర్టుల్లో కుంభకోణంపై పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదలాయించాలని నిర్ణయించింది. 214 క్షేత్రాల రద్దు - సుప్రీం తీర్పు బొగ్గు క్షేత్రాల తీరుపై కొనసాగిన వాదోపవాదాల పరంపరను క్షుణ్నంగా పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. 2014, సెప్టెంబర్ 24న చారిత్రక తీర్పు వెలువరించింది. 1993 తర్వాత కేటాయించిన 218 బొగ్గు క్షేత్రాల్లో 214 క్షేత్రాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ బొగ్గు క్షేత్రాల్లో రూ.రెండు లక్షల కోట్ల పెట్బుడులు ఉన్నట్లు అంచనా. దీంతో పాటు బొగ్గు వెలికితీత ప్రారంభించి, కార్యకలాపాలను కొనసాగిస్తున్న గనుల్లో ప్రతి టన్నుకు రూ.295 జరిమానా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. బొగ్గు గనుల బిల్లు 2015 బొగ్గు గనుల రెండో ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటు బొగ్గు గనుల బిల్లు-2015ను ఆమోదించింది. ఈ బిల్లును 2015, మార్చి 4న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. బిల్లులోని ముఖ్యాంశాలు 1.గనుల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించేందుకు గనుల కేటాయింపుల్లో వేలం పక్రియను ప్రవేశపెట్టడం. 2. ఈ-వేలం రూపంలో బొగ్గు గనుల తవ్వకాల కార్యకలాపాలను కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల బొగ్గు వనరుల వినియోగం అభిలషణీయంగా ఉంటుంది. 3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రత్యక్షంగా గనుల కేటాయింపు. 4. ఈ- వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు. 5. బొగ్గు గనుల వేలానికి చట్టబద్దత. 6. గనుల నుంచి లభించే ఆదాయంలో నిర్దిష్ట శాతాన్ని స్థానిక ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలి. 7. 50 సంవత్సరాల వరకు లెసైన్స్ కాలపరిమితి. 8. ఆయా ప్రాంతాల నుంచి తరలించే ప్రజలకు పటిష్టమైన పునరావాసం, నష్టపరిహార చర్యలు. బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు బిల్లు-2015 లక్షణాలు 1. రద్దైన 204 బ్లాకులను ‘షెడ్యూల్ -1 బొగ్గు గనులు’గా నిర్వచించారు. 2. బొగ్గు గనుల (కోల్ మైన్) ఉత్పత్తికి సిద్ధంగానూ, ప్రస్తుతం ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న 42 క్షేత్రాలను ‘షెడ్యూల్ - 2 బొగ్గు గనులు’గా పేర్కొన్నారు. 3. 32 అభివృద్ధిలో ఉన్న (Sub stantially developed) క్షేత్రాలను ‘షెడ్యూల్-3’లో చేర్చారు. 4. నష్టపరిహారాన్ని చెల్లించడానికి ‘కమిషనర్ ఆఫ్ పేమెంట్స్’ను నియమించారు. 5. వేలం ద్వారా గనుల కేటాయింపు జరిగే వరకు వాటి నిర్వహణ, యాజమాన్యం కోసం కేంద్ర ప్రభుత్వం కస్టోడియన్‌ను నియమించవచ్చు. 6. వేలం ద్వారా లభించిన మొత్తాన్ని నామినేటెడ్ అథారిటీ వసూలు చేసి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంది. నూతన గనుల యుగం (New mining era) ఏప్రిల్ 1, 2014 నాటికి దేశంలో 301.56 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. 2013-14లో కోల్ ఇండియా ఉత్పత్తి 462.53 మిలియన్ టన్నులు. 2013-14లో స్వాధీనత బ్లాకుల్లో ఉత్పత్తి లక్ష్యం 50 మిలియన్ టన్నులు కాగా 2014 ఫిబ్రవరి నాటికి 38.88 మిలియన్ టన్నులకు చేరింది. 1993 నుంచి 2011 మధ్య కాలంలో 50 బిలియన్ టన్నుల రిజర్వ్‌తో కూడిన 218 బొగ్గు గనుల క్షేత్రాల కేటాయింపు జరిగింది. ప్రత్యేక కేటాయింపు బిల్లు 2015 వల్ల స్వదేశీ, విదేశీ కంపెనీలు బొగ్గును వెలికితీయడంతోపాటు బహిరంగ మార్కెట్లో విక్రయించుకొనే అవకాశం ఏర్పడింది. దీనిద్వారా బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ ఏకస్వామ్య ధోరణికి కాలం చెల్లింది. కోల్ ఇండియా శ్రామికుల ప్రయోజనాలను పరిరక్షించ గలమని ప్రభుత్వం ప్రకటించింది. కోల్ ఇండియా కార్యకలాపాలపై ఈ బిల్లు ప్రభావం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు బిల్లు 2015 ప్రకారం ముందుకాలంలో ప్రైవేటు కంపెనీలు తమ సొంత ఫ్యాక్టరీలకు ఇంధనంగా వినియోగించుకోవడానికి మాత్రమే బొగ్గు తవ్వకాల్లో అనుమతి ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం బహిరంగ మార్కెట్లోనూ విక్రయించే అవకాశం కల్పించినందువల్ల అధిక విదేశీ పెట్టుబడులను ఆశించవచ్చు. భారతీయ అనుబంధ కంపెనీల సహకారంతో విదేశీ కంపెనీలు కమర్షియల్ కోల్మైనింగ్లోనూ పాల్గొనవచ్చు. కమర్షియల్ మైనింగ్ ఆఫ్ కోల్ బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు బిల్లు-2015 ద్వారా ప్రభుత్వం వాణిజ్యపరమైన తవ్వకాల్లో అనుమతించ డానికి అన్ని చర్యలు చేపట్టింది. ఈ విషయంలో మొదటగా ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు జరిపినట్లు బొగ్గు శాఖ కార్యదర్శి (కోల్ సెక్రటరీ) అనిల్ స్వరూప్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 204 బొగ్గు క్షేత్రాలను పారదర్శకతతో కూడిన ప్రక్రియ ద్వారా కేటాయిస్తుందని, వీటిలో 67 క్షేత్రాలను వేలం లేదా నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించగలమని ఆయన ప్రకటించారు. గనుల్లో వాణిజ్యపరమైన తవ్వకాలు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని, దీన్ని అదే విధంగా కొనసాగించాలని భావిస్తున్నట్లు అనిల్ స్వరూప్ తెలిపారు. ఏప్రిల్ చివర్లో త రువాత దశలో నిర్వహించే వేలం ద్వారా 15 నుంచి 20 బొగ్గు క్షేత్రాలు విక్రయించడానికి నిర్ణయించినట్లు బొగ్గు, పునరుత్పాదక శక్తి వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రక టించారు. బిల్లు - ప్రముఖుల అభిప్రాయాలు ఆర్థిక వ్యవస్థపై ఈ బిల్లు ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. బొగ్గు రంగం పనితీరు సక్రమంగా ఉన్నట్లయితే అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపడి ఆర్థిక వృద్ధి రేటు వేగవంతమవుతుంది. - సౌమ్యకాంతి ఘోష్, ముఖ్య ఆర్థిక కార్యదర్శి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బొగ్గు గనుల కేటాయింపుతో పారదర్శకత ఏర్పడుతుంది. గనుల తవ్వకం రంగంలో ప్రగతి ఏర్పడగలదు. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్. బొగ్గు క్షేత్రాల బిల్లు ద్వారా టాటాస్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) అధిక ప్రయోజనాలను పొందగలవని ఆయా సంస్థల ఆధీనంలోని గనులు మార్చి 2030 వరకు వాటి పరిధిలోనే కొనసాగగలవు. - కమలేశ్ బగ్మర్, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్. బొగ్గు గనుల్లో పని షరతులను మెరుగుపరిచే ఎలాంటి చర్యలను బిల్లులో పొందపరచలేదు. - జ్యోతిరాదిత్య సింథియా, మాజీ కేంద్రమంత్రి.