నూజివీడు ప్రాంతంలో నల్ల బంగారం!
నెలరోజుల క్రితం గోప్యంగా సర్వే
నమూనాల కోసం డ్రిల్లింగ్‌కు ఏర్పాట్లు
20 నెలల పాటు కొనసాగనున్న పనులు
నూజివీడు : సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిలో ఉన్న నూజివీడు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ ఉధృతంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నెల రోజుల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) సంస్థకు చెందిన జియాలజిస్టులు సర్వే చేసి నివేదిక ఇవ్వడంతో ఆ సంస్థ డ్రిల్లింగ్‌కు సిద్ధమైంది. రాజధాని అయ్యే అవకాశాన్ని తృటిలో తప్పిపోవడంతో నూజివీడు ప్రాంత వాసులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు స్పష్టమైతే పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పదేళ్ల క్రితమే సర్వే...
ఈ ప్రాంతంలోని చాట్రాయి మండలం తుమ్మగూడెం, చిత్తపూరు, సోమవరం, కొత్తగూడెం, ముసునూరు మండలం బాస్వరప్పాడు, లోపూడి, సూరేపల్లి, ఎల్లాపురం, చెక్కపల్లి ప్రాంతాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు పదేళ్ల క్రితమే సర్వే చేసి తేల్చారు. ఆ తరువాత బొగ్గు నిక్షేపాల అన్వేషణ మూలన పడింది. గత ఏడాది రాష్ట్ర విభజన జరగడం, అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులన్నీ తెలంగాణలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగింది. అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాన ఇంధనం బొగ్గు కావడంతో బొగ్గు అవసరం రాష్ట్రంలో తీవ్రంగా పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం అధిక ధరను వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేస్తోంది. దీంతో ప్రభుత్వంపై ఆర్థికంగా తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో నూజివీడు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు వెలుగుచూస్తే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాష్ట్రానికే మంచి సహజ సంపదగా మారనుంది.
డ్రిల్లింగ్ పనులకు సన్నాహాలు
జీఎస్‌ఐ సంస్థకు చెందిన జియాలజిస్ట్ నెల రోజుల క్రితం మండలంలోని తుక్కులూరు పరిధిలో బొగ్గు నమూనాలు తీయడం కోసం రెండుచోట్ల పాయింట్లు గుర్తించారు. కార్యనిర్వాహక ఇంజనీర్ నర్సప్ప ఆధ్వర్యంలో నమూనాలను తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన యంత్రాలను ఇప్పటికే ఆ ప్రాంతానికి తరలించారు. మొదట తుక్కులూరు నుంచి జంగంగూడెం వెళ్లే మార్గంలో గుర్తించిన పాయింట్ వద్ద డ్రిల్లింగ్ నిర్వహించడానికి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యి మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయనున్నారు. వెయ్యి మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయడానికి దాదాపు 10నెలల వరకు సమయం పడుతుంది. ఇక్కడ నమూనాల సేకరణ పూర్తయిన తరువాత రెండో పాయింట్ వద్ద డ్రిల్లింగ్ నిర్వహించనున్నారు. అక్కడ కూడా అదే సమయం పడుతుంది. తీసిన నమూనాలను పరీక్షల నిమిత్తం జీఎస్‌ఐకి పంపుతారు. ఈ డ్రిల్లింగ్ వల్ల భూమిలో బొగ్గు ఎన్ని మీటర్ల లోతులో ఉందనేది కచ్చితంగా తేలుతుంది. ఆ తరువాత అది నాణ్యమైన బొగ్గయితే.. భూమి లోపల ఎంత విస్తీర్ణంలో, ఎంత పరిమాణంలో ఉందనేది తెలుసుకోవడానికి మరింత విస్తృతంగా డ్రిల్లింగ్ పనులు చేపడతారు. ఇవన్నీ పూర్తవడానికి దాదాపు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు సమయం పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.