nuzivedu
-
చంద్రబాబుకు షాక్.. పార్టీ ఆఫీసులో చేదు అనుభవం!
సాక్షి, నూజివీడు: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. టీడీపీ ఆఫీసులో చంద్రబాబును నూజివీడు టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాల ప్రకారం.. నూజివీడుకు చెందిన పార్టీ నేతలు కాపా శ్రీనివాసరావు వర్గం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తమ గోడును చంద్రబాబును చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే, కాపా వర్గానికి చెందిన మండల తెలుగు యువత అధ్యక్షుడిని ఇటీవలే నూజివీడు జిల్లా అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబుకు తెలిపేందుకు కాపా వర్గం ప్రయత్నించింది. ఈ విషయమై చంద్రబాబును వారు నిలదీశారు. దీంతో, ఆగ్రహానికి లోనైన చంద్రబాబు.. కాపా వర్గంపై చిందులు తొక్కాడు. కాపా వర్గంపై బాబు మండిపడ్డారు. ఇది పార్టీ ఆఫీసు అనుకుంటున్నారా? ఏమనుకుంటాన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా చేస్తే పార్టీ ఆఫీసు కాంపౌండ్‌లోకి కూడా రానివ్వనని బాబు హెచ్చరించారు. పది మంది ఇక్కడకు వచ్చి అరిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కాగా, చంద్రబాబు తీరుపై కాపా వర్గం అసహనం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. కాపా వర్గం నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ ముద్రబోయిన వర్గానికి వ్యతిరేకంగా ఉంది. ఇది కూడా చదవండి: జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది: మంత్రి కాకాణి -
రైలు ప్రమాదంలో గ్రామ వలంటీర్ మృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక నూజివీడు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గ్రామ వలంటీర్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. నూజివీడు మండలం మొఖసా నరసన్నపాలెం గ్రామంలో బోయపాటి రవీంద్రకుమార్ (35) వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రైలు ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న ఏలూరు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన వలంటీర్ ఐడీ కార్డు ఆధారంగా మొఖసా నరసన్నపాలెం గ్రామ వలంటీర్ బోయపాటి రవీంద్రకుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే ఎస్ఐ వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవీంద్రకుమార్ ప్రమాదవశాత్తూ రైలు క్రింద పడి మరణించడా లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు -
అలర్ట్ : ఈనెల 13 వరకు భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మూలంగా ఈనెల 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. అలాగే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం టెలీ కాన్సెరెన్స్ ద్వారా అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. (కొనసాగుతున్న వాయుగుండం) భారీ వర్షాలు కారణంగా పాడుపడిన, మట్టి గోడలతో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులెవరు సముద్రంలోకి వేటకు పోవద్దని ఆదేశించారు. విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు వారివారి ప్రాంతాల తహశీల్దార్లను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీచేశారు. కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు : బందరు కలెక్టరేట్ : 08672-252572 విజయవాడలో ని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805 సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454 సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు 08656- 232717 రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486 రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697 -
తల్లి కళ్లుగప్పి బిడ్డను అమ్మేసిన తండ్రి
-
సంపూర్ణ ఆరోగ్యమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, కృష్ణాజిల్లా: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపునందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వి నియోగ పరుచుకోవాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో "వైఎస్సార్ కంటి వెలుగు" పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు బాలికలతో పాటు ఎమ్మెల్యే ప్రతాప్ సయితం వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకున్న బాలికలకు కార్డులు అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ నాయకుడి లక్ష్యం అన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఉపవైద్య అధికారి డి.ఆశా, వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు తీరును వివరించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికే: ఎమ్మెల్యే అనిల్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన"వైఎస్సార్ కంటి వెలుగు" పథకం చాలా అద్బుతం అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా పామర్రు జడ్పీ హైస్కూల్లో "వైఎస్సార్ కంటివెలుగు" పథకాన్ని అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు వల్ల కంటి సమస్యలను గుర్తించి కళ్ళజోళ్ళను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్ది దశలోనే కంటి సమస్యలను గుర్తిస్తే వారి భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు.. మాటతప్పని మడమతిప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు అంబరాన్నంటాయి. కూచిపూడి ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక నాలుగురోడ్ల కూడలిలో ఆటోవాలాలు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ను ఊరేగింపుగా తీసుకెళ్ళి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానసభలో ఎమ్మెల్యేను ఆటోవాలాలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 1.37 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో సఫలీకృతులయ్యారని.. దీన్ని కూడా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వటం ఏ ప్రభుత్వం చేయలేదని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఆటో కార్మికుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక్క వైసీపీ మాత్రమే ఆలోచించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆటో కార్మికులకు రూ.10 వేలు నగదు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోయూనియన్ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు గంజాయి అమ్మిన వ్యక్తి అరెస్టు
సాక్షి, నూజివీడు(కృష్ణా జిల్లా) : ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద జగన్నాధ పండు అనే పాత నేరస్తుడు ఇంజినీరింగ్ విద్యార్థులతో గంజాయి విక్రయానికి బేరసారాలు చేస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అతని దగ్గర నుంచి 359 గ్రాముల ముడి గంజాయితో పాటు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయిని కొనుగోలు చేస్తున్న విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ రామచంద్రరావు, డీఎస్పీ శ్రీనివాస్‌లు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
సాక్షి, చాట్రాయి(నూజివీడు): ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండలంలోని చీపురుగూడెం, నరసింహారావుపాలెం గ్రామాల్లో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు భారీగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెంది జగన్మోహనరెడ్డిపై ఉన్న నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో పార్టీ ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడని ఎద్దేవా చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహనరెడ్డిని ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ టీడీపీ నాయకుడు ఓబిళ్లనేని వెంకటేశ్వరావుతో పాటు 20 టీడీపీ కుటుంబాల వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు చెలికాని బాబ్జీ, మండల అధ్యక్షుడు మిద్దె బాలకృష్ణ, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చింతగుంట్ల వెంకటేశ్వరావు, చీపురుగూడెం ఎంపీటీసీ మేకల చందూ తదితరులు పాల్గొన్నారు. నరసింహారావుపాలెం: మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు సమక్షంలో గౌరసాని వెంకటరెడ్డితోపాటు 21 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ పుచ్చకాయల లక్ష్మీకాంతమ్మ, మండల పార్టీ నాయకులు దామెర ప్రసాద్‌బాబు, వైఎస్సార్ సీపీ సేవాదళ్ మండల కార్యదర్శి బి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
వెంకటాయపాలెంలో దాహం కేకలు
సాక్షి, వెంకటాయపాలెం(నూజివీడు): మండలంలోని వెంకటాయపాలెంలో ఓసీ ఏరియాలో మంచినీటి సమస్య నెలకొనడంతో స్థానికులు దాహం కేకలు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మంచినీటి కష్టాలు మరింతగా పెరిగాయి. పంచాయతీ బోరుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్ కాలిపోయి నెలరోజులు గడిచినప్పటికీ మరమ్మతులు చేయించలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. దీంతో స్థానికులు మంచినీళ్ల కోసం, వాడుకోవడానికి వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఎన్నిసార్లు పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దాదాపు 50 గృహాల వారికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎస్సీ ఏరియాలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంక్ నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే వస్తున్నాయని, ఆ నీరు తాగడానికి పనికిరావని మహిళలు పేర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఇంకేమీ పట్టించుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల క్రితం మోటర్లో వైరింగ్ కాలిపోవడంతో మరమ్మతుల కోసమని తీసుకెళ్లారే గాని ఇంత వరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడం దారుణం. మరమ్మతులు అయ్యే వరకు నీళ్లు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక పాలన అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో సమస్యను పరిష్కరించలేకపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన బోరుకు మోటర్‌ను బిగించేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేవు నెలరోజుల నుంచి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మోటర్ కాలిపోయి నెలరోజులు అయినా ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. వేసవి వచ్చిన నేపథ్యంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి – పూజారి సుజాత, వెంకటాయపాలెం అధికారులు పట్టించుకోవడం లేదు నెలరోజులుగా నీటి సమస్య ఉంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు గ్రామానికి వస్తున్నారో, రావడం లేదో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటే గ్రామస్తులు ఎలా బతకాలో అధికారులే చెప్పాలి. – షేక్ ఆషా, వెంకటాయపాలెం -
కూతుర్ని ప్రేమించాడని..
కృష్ణలంక(విజయవాడ తూర్పు): తన కూతురును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడితోపాటు అతని స్నేహితుడిని అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి యత్నించి పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కిడ్నాప్ ఘటన ఈ నెల 16న జరగ్గా పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను 17న అరెస్టు చేశారు. కోరువాడ శ్రీనివాసరావు జెంట్స్ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ విజయవాడ చుట్టుగుంటలో నివాసముంటున్నాడు. కొడుకు నాగసాయి నూజివీడులోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ప్రసాదంపాడుకు చెందిన వడ్ల శ్రీనివాసరావు కుమార్తె, నాగసాయి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తండ్రి తన కూతురును, నాగసాయిని మందలించాడు. నాగసాయి తండ్రికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని అదుపులో పెట్టుకో.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని’ హెచ్చరించాడు. నాగసాయిని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన యువతి ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నాగసాయి అమ్మాయికి ఫోన్ చేయగా.. తాను అమ్మవారి గుడివద్ద ఉన్నానని తెలియజేయడంతో నాగసాయి, అతని స్నేహితుడు మణిదీప్, తండ్రి కలసి అక్కడకు వెళ్లి అమ్మాయిని తీసుకుని ఆమె తండ్రికి ఫోన్‌చేసి సమాచారమిచ్చారు. ఇదంతా చేసింది నాగసాయేనంటూ దుర్భాషలాడుతూ అమ్మాయి తండ్రితోపాటు మరికొంతమంది యువకులు అతడిని ఇష్టానుసారంగా కొట్టారు. అంతటితో ఆగకుండా నాగసాయితోపాటు అతని స్నేహితుడిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అబ్బాయి తండ్రి కోరివాడ శ్రీనివాసరావు తన కొడుకును కొంతమంది కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారధి వద్ద కారును గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు దాన్ని అడ్డగించి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నాగసాయి, అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారని అమ్మాయి తండ్రి శ్రీనివాసరావు, తల్లి చంద్ర, సుబ్రమణ్యం, వేణు, శివ, జగదీష్, రూపేష్సాయి, సాయివివేక్, ధీరజ్‌లను అరెస్టు చేశారు. -
తిండీ తిప్పలూ లేకుండా కౌన్సెలింగ్
నూజివీడు : నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణ సందర్భంగా సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం రాత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 555 సీట్ల భర్తీకి గాను వెయిటింగ్ జాబితాలో ఉన్న దాదాపు 1665 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు నూజివీడు ట్రిపుల్ఐటీకి పిలిచారు. అంతమంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రావడంతో దాదాపు 4వేల మంది అయ్యారు. వీరంతా మంగళవారం ఉదయం 8గంటలకు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కౌన్సెలింగ్ దాదాపు పగలు, రాత్రి కలిపి 24గంటల పాటు జరిగింది. వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుక్కునే వీలూ లేదు మధ్యాహ్న భోజనంను తక్కువ ధరకు అందజేసినా రాత్రి భోజనం ఏర్పాటు చేయలేదు. తాగునీరు, టాయ్‌లెట్ వసతీ లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా గొడవకు దిగారు. కొనుక్కుని తినడానికి కూడా భోజనం, నీరు లేదంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. చివరకు దిగివచ్చిన అధికారులు మహిళలు అక్కడి టాయ్లెట్లను వాడుకోవడానికి అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది. తల్లిదండ్రులు సిమెంట్‌రోడ్లపైన, సిబ్బంది క్వార్టర్ల సెల్లార్లలో పడుకుని నిద్రపోయారు. -
అంతా మాఇష్టం
ట్రిపుల్‌ఐటీలో అనధికార ఉద్యోగులు ఈసీ నిర్ణయం బేఖాతరు ఇష్టారాజ్యంగా పరిపాలన ట్రిపుల్ ఐటీలో పాలన గడితప్పుతోంది. కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంట్రాక్టు పోస్టుల్లో ఇష్టారాజ్యంగా సిబ్బందితో నింపేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే సిబ్బంది పనిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నూజివీడు : ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులున్నారు. వెయ్యి మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం వివాదస్పదమవుతోంది. ఈసీ అనుమతి లేకుండానే రెండు నెలల క్రితం డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు దాదాపు వంద మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇంతమంది ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోవాలంటే తప్పనిసరిగా ఈసీ అనుమతి ఉండాలి. ఈసీ అనుమతినివ్వనప్పటికీ బేఖాతరు చేస్తూ నియామకాలు జరపడం సంచలనంగా మారింది. సిబ్బంది నియామకంపై.. ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు సరిపోయిన సిబ్బంది ఆరువేల మందికి తగ్గినప్పుడు ఎందుకు సరిపోరనే వాదనను పలువురు తెచ్చిన లెక్కచేయకుండా కొందరు అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సంతృప్తి పరచడానికి అత్యుత్సాహంతో ఈ నియామకాలకు తెరలేపినట్లు ట్రిపుల్‌ఐటీలో వినికిడి. ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఈ ప్రాంతంలోని వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి ఎలా ఇస్తారని నూజివీడు పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు డైరెక్టర్‌ను ప్రశ్నించారు. రెండు నెలలుగా జీతాలు లేవు.. ఈసీ నిర్ణయాలను బేఖాతరు చేస్తూ ట్రిపుల్‌ఐటీలో సొంతంగా నియమించుకున్న దాదాపు వంద మంది అనధికార వ్యక్తులకు రెండు నెలలు గడిచినా ఇంత వరకు జీతాలు చెల్లించలేదు. అసలు మా పోస్టులు ఉంటాయా, ఉండవా..? పనిచేసిన కాలానికైనా జీతాలు ఇస్తారా, ఇవ్వరా...? ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా దాదాపు రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని కేటాయిస్తున్న విద్యాసంస్థలో నియామకాలను ఒక పద్ధతి లేకుండా నియమించుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు: ఉన్నం వెంకయ్య, ఆర్జీయూకేటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు. నియమించుకున్న వారిని వెంటనే తొలగించమని కూడా చెప్పడం జరిగింది. -
నూజివీడు ప్రాంతంలో నల్ల బంగారం!
నెలరోజుల క్రితం గోప్యంగా సర్వే నమూనాల కోసం డ్రిల్లింగ్కు ఏర్పాట్లు 20 నెలల పాటు కొనసాగనున్న పనులు నూజివీడు : సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిలో ఉన్న నూజివీడు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ ఉధృతంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నెల రోజుల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సంస్థకు చెందిన జియాలజిస్టులు సర్వే చేసి నివేదిక ఇవ్వడంతో ఆ సంస్థ డ్రిల్లింగ్కు సిద్ధమైంది. రాజధాని అయ్యే అవకాశాన్ని తృటిలో తప్పిపోవడంతో నూజివీడు ప్రాంత వాసులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు స్పష్టమైతే పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదేళ్ల క్రితమే సర్వే... ఈ ప్రాంతంలోని చాట్రాయి మండలం తుమ్మగూడెం, చిత్తపూరు, సోమవరం, కొత్తగూడెం, ముసునూరు మండలం బాస్వరప్పాడు, లోపూడి, సూరేపల్లి, ఎల్లాపురం, చెక్కపల్లి ప్రాంతాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు పదేళ్ల క్రితమే సర్వే చేసి తేల్చారు. ఆ తరువాత బొగ్గు నిక్షేపాల అన్వేషణ మూలన పడింది. గత ఏడాది రాష్ట్ర విభజన జరగడం, అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులన్నీ తెలంగాణలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగింది. అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాన ఇంధనం బొగ్గు కావడంతో బొగ్గు అవసరం రాష్ట్రంలో తీవ్రంగా పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం అధిక ధరను వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేస్తోంది. దీంతో ప్రభుత్వంపై ఆర్థికంగా తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో నూజివీడు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు వెలుగుచూస్తే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాష్ట్రానికే మంచి సహజ సంపదగా మారనుంది. డ్రిల్లింగ్ పనులకు సన్నాహాలు జీఎస్ఐ సంస్థకు చెందిన జియాలజిస్ట్ నెల రోజుల క్రితం మండలంలోని తుక్కులూరు పరిధిలో బొగ్గు నమూనాలు తీయడం కోసం రెండుచోట్ల పాయింట్లు గుర్తించారు. కార్యనిర్వాహక ఇంజనీర్ నర్సప్ప ఆధ్వర్యంలో నమూనాలను తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన యంత్రాలను ఇప్పటికే ఆ ప్రాంతానికి తరలించారు. మొదట తుక్కులూరు నుంచి జంగంగూడెం వెళ్లే మార్గంలో గుర్తించిన పాయింట్ వద్ద డ్రిల్లింగ్ నిర్వహించడానికి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యి మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయనున్నారు. వెయ్యి మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయడానికి దాదాపు 10నెలల వరకు సమయం పడుతుంది. ఇక్కడ నమూనాల సేకరణ పూర్తయిన తరువాత రెండో పాయింట్ వద్ద డ్రిల్లింగ్ నిర్వహించనున్నారు. అక్కడ కూడా అదే సమయం పడుతుంది. తీసిన నమూనాలను పరీక్షల నిమిత్తం జీఎస్ఐకి పంపుతారు. ఈ డ్రిల్లింగ్ వల్ల భూమిలో బొగ్గు ఎన్ని మీటర్ల లోతులో ఉందనేది కచ్చితంగా తేలుతుంది. ఆ తరువాత అది నాణ్యమైన బొగ్గయితే.. భూమి లోపల ఎంత విస్తీర్ణంలో, ఎంత పరిమాణంలో ఉందనేది తెలుసుకోవడానికి మరింత విస్తృతంగా డ్రిల్లింగ్ పనులు చేపడతారు. ఇవన్నీ పూర్తవడానికి దాదాపు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు సమయం పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆ దుంగలు.. అటవీ శాఖవే
పరిశీలనలో వెల్లడి శాఖాపరమైన విచారణ జరుపుతామంటున్న డీఎఫ్‌వో నూజివీడు : పట్టణంలో బుధవారం స్వాధీనం చేసుకున్న 25 ఎర్రచందనం దుంగలు అటవీ శాఖవేనని తేలింది. అటవీ శాఖ అధికారులు గురువారం తమ కార్యాలయ ఆవరణలోని లారీలో ఉన్న దుంగలను కిందికి దింపి సరిచూడగా ఈ విషయం బయటపడింది. బాపులపాడు మండలం మల్లవల్లిలో 2012 జనవరి 24న పోలీసులు ఈ లారీని పట్టుకున్నారు. 11 టన్నుల బరువు కలిగిన 465 దుంగలను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కోర్టులో కేసు నడుస్తున్నందున ఆ దుంగల లారీ ఇప్పటికీ నూజివీడు అటవీశాఖ కార్యాలయం ఆవరణలోనే ఉంది. అందులోని దుంగలను లెక్కించగా 440 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బుధవారం స్వాధీనం చేసుకున్న దుంగలపై ఉన్న నంబర్లను పరిశీలించగా అవన్నీ లారీలోనివేనని తేలింది. దీంతో అటవీశాఖ ఆధీనంలోని దుంగలే బయటకు వెళ్లినట్టు నిర్ధారణ అయింది. ఎఫ్ఆర్వో బి.శ్రీరామారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆరా! ఈ ఘటన వెనుక ఎవరి పాత్ర ఉన్నదనే అంశంపై అటవీశాఖ ఉన్నతాధి కారులు ఆరా తీస్తున్నారు. కార్యాలయానికి నైట్ వాచ్మెన్ లేకపోవడంతో ఈ ఘటనకు ఆస్కారం ఏర్పడిందని భావిస్తున్నారు. బయటివారు ఈ ఘటనకు పాల్పడ్డారా.. లేక ఇంటి దొంగలే చేసి ఉంటారా అనేది తేలాల్సి ఉంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నాం అటవీశాఖ ఆధీనంలో ఉన్న ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లిన ఉదంతంపై పోలీసు కేసు పెట్టనున్నట్లు డీఎఫ్‌వో ఎస్.రాజశేఖర్ తెలిపారు. శాఖాపరమైన విచారణ కూడా జరుపుతామని ఆయన చెప్పారు. తమ సిబ్బంది ప్రమేయముందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుంగలకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నందున న్యాయమూర్తి అనుమతి తీసుకుని తిరుపతిలోని డిపోకు తరలిస్తామని డీఎఫ్‌వో చెప్పారు. -
పొట్టకూటి కోసం వెళితే..
పొట్టకూటి కోసం వెళ్లినవారిని మృత్యువు వెంటాడింది. సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. కలిదిండిలో పేటకలిదిండికి చెందిన అనిత (14), నూజివీడు శివారులో అదే పట్టణానికి చెందిన గులిపిల్లి తిరుపతిరావు (35) మృత్యువాతన పడ్డారు. కలిదిండి ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ అతివేగం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ఘటనలకు కారణాలయ్యాయి. -
హత విధీ...!
‘గత మున్సిపల్ ఎన్నికల్లో జగ్గయ్యపేటలో 22వ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది... కానీ ఇప్పుడు నిస్తేజంగా మారింది.. పార్టీని చాలా మంది వీడటంతో ఇబ్బందికరంగా మారింది.. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులకు అభ్యర్థులను పోటీ పెట్టాలా? వద్దా? అనేది ఆలోచిస్తున్నాం’.. ఇది జగ్గయ్యపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్ ఆవేదన. ‘మీకు నేను ఎన్నో పనులు చేసిపెట్టాను.. కనీసం నన్ను సంప్రదించకుండా వైఎస్సార్సీపీలోకి వెళ్లిపోతారా.. మీ సంగతి చూస్తాను’.. ఇవి పెడన మున్సిపాలిటీలో ఒక కాంగ్రెస్ నేత బెదిరింపులు. ‘బాబ్బాబు.. కనీసం ఐదు వార్డులైనా ఇవ్వండని గుడివాడలో వేడుకుంటూ..‘ఒంటరిగా గెలవలేం.. కనీసం కలసిమెలిసి పోటీ చేస్తే కొన్ని వార్డులైనా వస్తాయంటూ’....నూజివీడులో వేడుకుంటున్న వైనం.. ఇవి జిల్లాలో కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతున్న సంఘటనలు కొన్ని మాత్రమే. 2004, 2009 ఎన్నికల్లో దివంగత వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్‌కు అధికారంలోకి తీసుకుని వచ్చారు. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అందించడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా లోక్‌సభ, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నెగ్గుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంది. అండదండగా ఉండే ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా చీల్చి సీమాంధ్ర ప్రాంత ప్రజలతో ఛీకొట్టించుకునే పరిస్థితికి వచ్చింది. జిల్లాలో కాంగ్రెస్‌పై ప్రజాగ్రహం మిన్నంటడంతో ఎన్నికల్లో పోటీకి సైతం అభ్యర్థులు దొరకని దుస్ధితి దాపురించింది. ఇప్పటికే జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించే నేతలు కాంగ్రెస్ నుంచి పొరుగు పార్టీలకు వలస పోతుంటే గ్రామ, పట్టణ స్ధాయిలో క్యాడర్ లేని పార్టీగా కాంగ్రెస్ మారిపోతోంది. ఇటువంటి పరిస్థితిలో ఇంకా అరకొరగా మిగిలిన కొందరు నేతలు ఉనికిని చాటుకునేందుకు అవస్థలు పడుతున్నారు. పెడన మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ, ప్రత్యర్ధి పార్టీకు ధీటుగా నువ్వానేనా అనే రీతిలో అభ్యర్థుల ఎంపికను చేపట్టడంతో కాంగ్రెస్ నేతలకు కంగారు పట్టుకుంది. రెండు రోజలు క్రితం వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి రావడంతో కంగారు పడిన కాంగ్రెస్ కీలక నేత రంగంలోకి దిగి అభ్యర్థులను, కొందరు ముఖ్యులను బెదిరింపులుకు దిగినట్టు సమాచారం. ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరగడంతో కాంగ్రెస్ క్యాడర్ చేజారిపోతోంది. దీంతో తనతోపాటే మీరు రావాలంటూ ఆయన వత్తిళ్లు ప్రారంభించారు. ఉయ్యూరులో కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని కూడా ప్రకటించే పరిస్థితి లేదు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పార్టీ మారే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కానిలేని నావలా మారింది. తిరువూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. తిరువూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగోటి ఆదినారాయణ మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌కు అభ్యర్థిని పోటీ పెట్టే పరిస్ధితి లేదు. దీంతో మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు ఎన్నికల ఏర్పాట్లు చూస్తున్నారు. ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. నందిగామ నగర పంచాయతీలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వేల్పుల పరమేశ్వరరావు అభ్యర్థులను పోటీ పెడతామని చెబతున్నప్పటికీ ఆ దిశగా ఎంటువంటి కదలిక లేదు. జిల్లాలో ప్రధానమైన జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడులలో కూడా పార్టీకి అభ్యర్ధులు కూడా దొరకడం లేదు. మొత్తానికి ఎన్నికలు కాంగ్రెస్‌కు చెల్లుచీటి రాసేలా మారాయి. -
ఆ విధంగా ముందుకుపోదాం..
అధికార దాహం అవకాశ వాదానికి అర్రులు చాస్తోంది. మరోమారు కుమ్మక్కు కుట్రలు పెనవేసుకుంటున్నాయి. మున్సిపాల్టీలే వేదికగా మురికి రాజకీయం బీజం వేసుకుంటోంది. జిల్లాలోని గుడివాడ, నూజివీడు మున్సిపాల్టీల్లో పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు మళ్లీ చట్టాపట్టాలేసుకుంటున్నాయి. ఐదు వార్డులిచ్చినా చాలంటూ గుడివాడలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ రాయబేరం సాగిస్తుంటే నూజివీడు కాంగ్రెస్‌కు కరువైన అభ్యర్థులు సర్పంచి ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్థితే మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోంది. పట్టణంలో మొత్తం 30వార్డులున్నప్పటికీ అందులో నాలుగోవంతు వార్డు పదవులకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్కపోవటంతో కాంగ్రెస్‌కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నూజివీడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలడుగు వెంకట్రావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేసే నాయకుడే కరువయ్యాడు. దీంతో నలుగురైదుగురు మాజీ కౌన్సిలర్లు పొత్తులపై టీడీపీతో రాయబేరాలు నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా గుడివాడలో ఐదు వార్డులిచ్చినా చాలు ఐదు వార్డులిచ్చినా చాలు అన్ని చోట్ల మీకు మద్దతిస్తామంటూ గుడివాడ మునిసిపాల్టీల కాంగ్రెస్‌కు దేబిరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి కాంగ్రెస్ ధీనస్థితి అద్దం పడుతోంది. ఎలాగో గెలవలేమనుకునే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కనీసం ఐదు వార్డులనైనా దక్కించుకునేందుకు టీడీపీ నేతలతో మంత్రాంగం నెరపుతున్నారు. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ వారికి మద్దతిస్తే మిగిలిన వార్డుల్లో టీడీపీకి దన్నుగా నిలుస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇలాంటి నీచ రాజకీయాలను గమనిస్తున్న స్థానికులు ఛీత్కరించుకుంటున్నారు. -
కోర్టు గేటుకు తాళాలు!
నూజివీడు : నూజివీడు బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం నిర్వహించిన సమైక్యాంధ్ర ఆందోళన తీవ్రరూపం దాల్చింది. తెలుగుజాతిని విడగొట్టేందుకు కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును న్యాయవాదులు ఎండగట్టారు. కోర్టు వద్ద నూజివీడు-మైలవరం రహదారిపై ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహించే సమయంలోనే కోర్టువిధులకు వచ్చిన 15వ అదనపు జిల్లా జడ్జి ఎంఆర్.సత్యన్నారాయణ, సీనియర్ సివిల్‌జడ్జి ఏ లక్ష్మీ, ప్రిన్సిపల్ సివిల్‌జడ్జి డీ శేషయ్య, జూనియర్ సివిల్‌జడ్జి ఏ ప్రసూనలను న్యాయవాదులు కోర్టు లోపలకి వెళ్లకుండా ప్రధానగేట్లకు తాళాలు వేసి అడ్డగించారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు న్యాయమూర్తులు మద్దతు పలకాలని కోరారు. కేంద్రప్రభుత్వ మొండివైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. జడ్జిలను ఆడ్డుకున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న సీఐ కేవీ సత్యన్నారాయణ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని న్యాయవాదులను పక్కకు తోసేసి గేట్లు తెరచి జడ్జిలను కోర్టులోపలికి పంపారు. అనంతరం న్యాయవాదులు రోడ్డుపైకి చేరుకుని సమైక్యాంధ్రకు మద్ధతుగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఏ ఖాన్ మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి 2వందల రోజులు అయినా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామన్నారు. జీవోఎం సభ్యుల ఫొటోలను ముద్రించిన బ్యానర్‌ను ఏర్పాటు చేసి వారి ఫొటోలను కోడిగుడ్లు, టమోటాలతో కొట్టారు. అలాగే బ్యానర్‌ను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దాదాపు మూడు గంటల సేపు ప్రధాన రహదారిపై ఆందోళన చేయడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమైక్యాంధ్రకు మద్ధతుగా సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు కారును న్యాయవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వేరే మార్గంలో వెళ్లిపోయారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.మురళీకృష్ణ, మాజీ అధ్యక్షులు ఏఏపీ స్వామి, న్యాయవాదులు బసవారాజు రామకృష్ణ, ఇందుపల్లి సత్యప్రకాష్, జేడీ గాంధీ, ఉప్పలూరి నాగప్రసాద్, ఎస్కేడీ ప్రసాద్, రమాకుమారి, నాగరాజు, రామారావు, సూర్యనాధ్ పాల్గొన్నారు. -
"సాక్షి" చైతన్యపథం - నూజివీడు