కూతుర్ని ప్రేమించాడని.. | Kidnap Attempt In Vijayawada | Sakshi
Sakshi News home page

యువకుడి కిడ్నాప్‌కు యత్నం

Published Sat, Sep 22 2018 7:49 PM | Last Updated on Sat, Sep 22 2018 7:49 PM

Kidnap Attempt In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కృష్ణలంక(విజయవాడ తూర్పు): తన కూతురును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడితోపాటు అతని స్నేహితుడిని అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్‌ చేయడానికి యత్నించి పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కిడ్నాప్‌ ఘటన ఈ నెల 16న జరగ్గా పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను 17న అరెస్టు చేశారు. కోరువాడ శ్రీనివాసరావు జెంట్స్‌ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తూ విజయవాడ చుట్టుగుంటలో నివాసముంటున్నాడు. కొడుకు నాగసాయి నూజివీడులోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నాడు. ప్రసాదంపాడుకు చెందిన వడ్ల శ్రీనివాసరావు కుమార్తె, నాగసాయి   ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తండ్రి తన కూతురును, నాగసాయిని మందలించాడు.

నాగసాయి తండ్రికి ఫోన్‌ చేసి ‘మీ అబ్బాయిని అదుపులో పెట్టుకో.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని’ హెచ్చరించాడు. నాగసాయిని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన యువతి ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నాగసాయి అమ్మాయికి ఫోన్‌ చేయగా.. తాను అమ్మవారి గుడివద్ద ఉన్నానని తెలియజేయడంతో నాగసాయి, అతని స్నేహితుడు మణిదీప్, తండ్రి కలసి అక్కడకు వెళ్లి అమ్మాయిని తీసుకుని ఆమె తండ్రికి ఫోన్‌చేసి సమాచారమిచ్చారు. ఇదంతా చేసింది నాగసాయేనంటూ  దుర్భాషలాడుతూ అమ్మాయి తండ్రితోపాటు మరికొంతమంది యువకులు అతడిని ఇష్టానుసారంగా కొట్టారు. అంతటితో ఆగకుండా నాగసాయితోపాటు అతని స్నేహితుడిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.

అబ్బాయి తండ్రి కోరివాడ శ్రీనివాసరావు తన కొడుకును కొంతమంది కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారధి వద్ద కారును గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు దాన్ని అడ్డగించి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నాగసాయి, అతని స్నేహితుడిని కిడ్నాప్‌ చేశారని అమ్మాయి తండ్రి శ్రీనివాసరావు, తల్లి చంద్ర, సుబ్రమణ్యం, వేణు, శివ, జగదీష్, రూపేష్‌సాయి, సాయివివేక్, ధీరజ్‌లను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement