
హత విధీ...!
‘గత మున్సిపల్ ఎన్నికల్లో జగ్గయ్యపేటలో 22వ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది... కానీ ఇప్పుడు నిస్తేజంగా మారింది.. పార్టీని చాలా మంది వీడటంతో ఇబ్బందికరంగా మారింది.. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులకు అభ్యర్థులను పోటీ పెట్టాలా? వద్దా? అనేది ఆలోచిస్తున్నాం’.. ఇది జగ్గయ్యపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్ ఆవేదన.
‘మీకు నేను ఎన్నో పనులు చేసిపెట్టాను.. కనీసం నన్ను సంప్రదించకుండా వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోతారా.. మీ సంగతి చూస్తాను’.. ఇవి పెడన మున్సిపాలిటీలో ఒక కాంగ్రెస్ నేత బెదిరింపులు.
‘బాబ్బాబు.. కనీసం ఐదు వార్డులైనా ఇవ్వండని గుడివాడలో వేడుకుంటూ..‘ఒంటరిగా గెలవలేం.. కనీసం కలసిమెలిసి పోటీ చేస్తే కొన్ని వార్డులైనా వస్తాయంటూ’....నూజివీడులో వేడుకుంటున్న వైనం..
ఇవి జిల్లాలో కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతున్న సంఘటనలు కొన్ని మాత్రమే. 2004, 2009 ఎన్నికల్లో దివంగత వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్‌కు అధికారంలోకి తీసుకుని వచ్చారు. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అందించడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా లోక్‌సభ, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నెగ్గుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంది.
అండదండగా ఉండే ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా చీల్చి సీమాంధ్ర ప్రాంత ప్రజలతో ఛీకొట్టించుకునే పరిస్థితికి వచ్చింది. జిల్లాలో కాంగ్రెస్‌పై ప్రజాగ్రహం మిన్నంటడంతో ఎన్నికల్లో పోటీకి సైతం అభ్యర్థులు దొరకని దుస్ధితి దాపురించింది. ఇప్పటికే జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించే నేతలు కాంగ్రెస్ నుంచి పొరుగు పార్టీలకు వలస పోతుంటే గ్రామ, పట్టణ స్ధాయిలో క్యాడర్ లేని పార్టీగా కాంగ్రెస్ మారిపోతోంది. ఇటువంటి పరిస్థితిలో ఇంకా అరకొరగా మిగిలిన కొందరు నేతలు ఉనికిని చాటుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
పెడన మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ, ప్రత్యర్ధి పార్టీకు ధీటుగా నువ్వానేనా అనే రీతిలో అభ్యర్థుల ఎంపికను చేపట్టడంతో కాంగ్రెస్ నేతలకు కంగారు పట్టుకుంది. రెండు రోజలు క్రితం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి రావడంతో కంగారు పడిన కాంగ్రెస్ కీలక నేత రంగంలోకి దిగి అభ్యర్థులను, కొందరు ముఖ్యులను బెదిరింపులుకు దిగినట్టు సమాచారం. ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరగడంతో కాంగ్రెస్ క్యాడర్ చేజారిపోతోంది. దీంతో తనతోపాటే మీరు రావాలంటూ ఆయన వత్తిళ్లు ప్రారంభించారు. ఉయ్యూరులో కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని కూడా ప్రకటించే పరిస్థితి లేదు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పార్టీ మారే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కానిలేని నావలా మారింది. తిరువూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. తిరువూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగోటి ఆదినారాయణ మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
దీంతో కాంగ్రెస్‌కు అభ్యర్థిని పోటీ పెట్టే పరిస్ధితి లేదు. దీంతో మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు ఎన్నికల ఏర్పాట్లు చూస్తున్నారు. ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. నందిగామ నగర పంచాయతీలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వేల్పుల పరమేశ్వరరావు అభ్యర్థులను పోటీ పెడతామని చెబతున్నప్పటికీ ఆ దిశగా ఎంటువంటి కదలిక లేదు. జిల్లాలో ప్రధానమైన జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడులలో కూడా పార్టీకి అభ్యర్ధులు కూడా దొరకడం లేదు. మొత్తానికి ఎన్నికలు కాంగ్రెస్‌కు చెల్లుచీటి రాసేలా మారాయి.