పెడనలో ప్రజాస్వామ్యం గెలిచింది
– ఉప్పాల రాంప్రసాద్
పెడన టౌన్ (చిలకలపూడి) :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో పెడనలో ప్రజాస్వామ్యం గెలిచిందని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పెడన మండలంలో పది ఎంపీటీసీ సెగ్మెంట్లకు గానూ ఆరు ఎంపీటీసీ సభ్యులు గెలుచుకున్న తమలో ఒక సభ్యుడిని విచక్షణారహితంగా తీసుకెళ్లినపుడు ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. టీడీపీ కౌన్సిలర్ విప్ జారీచేసినా కాపాడుకోలేని నాయకులు ఏకతాటిపై నిబద్ధతతో నిలబడిన తమపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. తాను అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నానని అంటున్నారని, గీత కార్మిక కుటుంబంలో పుట్టిన తాను కులవృత్తి ద్వారా న్యాయపరంగా వ్యాపారం చేస్తున్నానని రాంప్రసాద్ చెప్పారు. గీత కార్మికులను అవమానపరిచేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన లంకే స్రవంతికి లక్షల్లో సొమ్ము అందజేశామని వ్యాఖ్యలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు ఈ సంఘటనపై విచారణ జరిపి ఎలాంటి చర్య తీసుకున్నా అంగీకరిస్తానన్నారు. మునిసిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్ లంకే స్రవంతి అధికార పార్టీకి మద్దతుగా చేయి ఎత్తనప్పుడు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియపై వీడియో చిత్రీకరణను చూసిన అనంతరం అధికార పార్టీలో ఉన్న మీరు విచారణ చేయించుకోవచ్చని, దానికి తామంతా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మీరు ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, కౌన్సిలర్లు మెట్ల గోపీప్రసాద్, కటకం ప్రసాద్, పెడన మండల కన్వీనరు దావు భైరవలింగం పాల్గొన్నారు.