
కోర్టు గేటుకు తాళాలు!
నూజివీడు :
నూజివీడు బార్‌అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం నిర్వహించిన సమైక్యాంధ్ర ఆందోళన తీవ్రరూపం దాల్చింది. తెలుగుజాతిని విడగొట్టేందుకు కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును న్యాయవాదులు ఎండగట్టారు. కోర్టు వద్ద నూజివీడు-మైలవరం రహదారిపై ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఆందోళన నిర్వహించారు.
ఆందోళన నిర్వహించే సమయంలోనే కోర్టువిధులకు వచ్చిన 15వ అదనపు జిల్లా జడ్జి ఎంఆర్.సత్యన్నారాయణ, సీనియర్ సివిల్‌జడ్జి ఏ లక్ష్మీ, ప్రిన్సిపల్ సివిల్‌జడ్జి డీ శేషయ్య, జూనియర్ సివిల్‌జడ్జి ఏ ప్రసూనలను న్యాయవాదులు కోర్టు లోపలకి వెళ్లకుండా ప్రధానగేట్లకు తాళాలు వేసి అడ్డగించారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు న్యాయమూర్తులు మద్దతు పలకాలని కోరారు. కేంద్రప్రభుత్వ మొండివైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. జడ్జిలను ఆడ్డుకున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న సీఐ కేవీ సత్యన్నారాయణ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని న్యాయవాదులను పక్కకు తోసేసి గేట్లు తెరచి జడ్జిలను కోర్టులోపలికి పంపారు. అనంతరం న్యాయవాదులు రోడ్డుపైకి చేరుకుని సమైక్యాంధ్రకు మద్ధతుగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌ఏ ఖాన్ మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి 2వందల రోజులు అయినా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామన్నారు. జీవోఎం సభ్యుల ఫొటోలను ముద్రించిన బ్యానర్‌ను ఏర్పాటు చేసి వారి ఫొటోలను కోడిగుడ్లు, టమోటాలతో కొట్టారు. అలాగే బ్యానర్‌ను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దాదాపు మూడు గంటల సేపు ప్రధాన రహదారిపై ఆందోళన చేయడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమైక్యాంధ్రకు మద్ధతుగా సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు కారును న్యాయవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వేరే మార్గంలో వెళ్లిపోయారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.మురళీకృష్ణ, మాజీ అధ్యక్షులు ఏఏపీ స్వామి, న్యాయవాదులు బసవారాజు రామకృష్ణ, ఇందుపల్లి సత్యప్రకాష్, జేడీ గాంధీ, ఉప్పలూరి నాగప్రసాద్, ఎస్‌కేడీ ప్రసాద్, రమాకుమారి, నాగరాజు, రామారావు, సూర్యనాధ్ పాల్గొన్నారు.