అంతా మాఇష్టం
ట్రిపుల్‌ఐటీలో అనధికార ఉద్యోగులు
ఈసీ నిర్ణయం బేఖాతరు
ఇష్టారాజ్యంగా పరిపాలన
ట్రిపుల్ ఐటీలో పాలన గడితప్పుతోంది. కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంట్రాక్టు పోస్టుల్లో ఇష్టారాజ్యంగా సిబ్బందితో నింపేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే సిబ్బంది పనిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
నూజివీడు :
ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులున్నారు. వెయ్యి మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం వివాదస్పదమవుతోంది. ఈసీ అనుమతి లేకుండానే రెండు నెలల క్రితం డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు దాదాపు వంద మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇంతమంది ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోవాలంటే తప్పనిసరిగా ఈసీ అనుమతి ఉండాలి. ఈసీ అనుమతినివ్వనప్పటికీ బేఖాతరు చేస్తూ నియామకాలు జరపడం సంచలనంగా మారింది.
సిబ్బంది నియామకంపై..
ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు సరిపోయిన సిబ్బంది ఆరువేల మందికి తగ్గినప్పుడు ఎందుకు సరిపోరనే వాదనను పలువురు తెచ్చిన లెక్కచేయకుండా కొందరు అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సంతృప్తి పరచడానికి అత్యుత్సాహంతో ఈ నియామకాలకు తెరలేపినట్లు ట్రిపుల్‌ఐటీలో వినికిడి. ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఈ ప్రాంతంలోని వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి ఎలా ఇస్తారని నూజివీడు పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు డైరెక్టర్‌ను ప్రశ్నించారు.
రెండు నెలలుగా జీతాలు లేవు..
ఈసీ నిర్ణయాలను బేఖాతరు చేస్తూ ట్రిపుల్‌ఐటీలో సొంతంగా నియమించుకున్న దాదాపు వంద మంది అనధికార వ్యక్తులకు రెండు నెలలు గడిచినా ఇంత వరకు జీతాలు చెల్లించలేదు. అసలు మా పోస్టులు ఉంటాయా, ఉండవా..? పనిచేసిన కాలానికైనా జీతాలు ఇస్తారా, ఇవ్వరా...? ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా దాదాపు రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని కేటాయిస్తున్న విద్యాసంస్థలో నియామకాలను ఒక పద్ధతి లేకుండా నియమించుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు: ఉన్నం వెంకయ్య, ఆర్జీయూకేటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు
నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు. నియమించుకున్న వారిని వెంటనే తొలగించమని కూడా చెప్పడం జరిగింది.