
ఆ దుంగలు.. అటవీ శాఖవే
పరిశీలనలో వెల్లడి
శాఖాపరమైన విచారణ జరుపుతామంటున్న డీఎఫ్‌వో
నూజివీడు : పట్టణంలో బుధవారం స్వాధీనం చేసుకున్న 25 ఎర్రచందనం దుంగలు అటవీ శాఖవేనని తేలింది. అటవీ శాఖ అధికారులు గురువారం తమ కార్యాలయ ఆవరణలోని లారీలో ఉన్న దుంగలను కిందికి దింపి సరిచూడగా ఈ విషయం బయటపడింది. బాపులపాడు మండలం మల్లవల్లిలో 2012 జనవరి 24న పోలీసులు ఈ లారీని పట్టుకున్నారు. 11 టన్నుల బరువు కలిగిన 465 దుంగలను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కోర్టులో కేసు నడుస్తున్నందున ఆ దుంగల లారీ ఇప్పటికీ నూజివీడు అటవీశాఖ కార్యాలయం ఆవరణలోనే ఉంది. అందులోని దుంగలను లెక్కించగా 440 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బుధవారం స్వాధీనం చేసుకున్న దుంగలపై ఉన్న నంబర్లను పరిశీలించగా అవన్నీ లారీలోనివేనని తేలింది. దీంతో అటవీశాఖ ఆధీనంలోని దుంగలే బయటకు వెళ్లినట్టు నిర్ధారణ అయింది. ఎఫ్‌ఆర్‌వో బి.శ్రీరామారావు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారుల ఆరా!
ఈ ఘటన వెనుక ఎవరి పాత్ర ఉన్నదనే అంశంపై అటవీశాఖ ఉన్నతాధి కారులు ఆరా తీస్తున్నారు. కార్యాలయానికి నైట్ వాచ్‌మెన్ లేకపోవడంతో ఈ ఘటనకు ఆస్కారం ఏర్పడిందని భావిస్తున్నారు. బయటివారు ఈ ఘటనకు పాల్పడ్డారా.. లేక ఇంటి దొంగలే చేసి ఉంటారా అనేది తేలాల్సి ఉంది.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నాం
అటవీశాఖ ఆధీనంలో ఉన్న ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లిన ఉదంతంపై పోలీసు కేసు పెట్టనున్నట్లు డీఎఫ్‌వో ఎస్.రాజశేఖర్ తెలిపారు. శాఖాపరమైన విచారణ కూడా జరుపుతామని ఆయన చెప్పారు. తమ సిబ్బంది ప్రమేయముందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుంగలకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నందున న్యాయమూర్తి అనుమతి తీసుకుని తిరుపతిలోని డిపోకు తరలిస్తామని డీఎఫ్‌వో చెప్పారు.