గోదావరి బేసిన్‌లో అపార బొగ్గు నిల్వలు
3వేల మిలియన్ మెట్రిక్
టన్నుల బొగ్గు లభించే అవకాశం
30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్నట్టు గుర్తింపు
మొదలైన సర్వే పనులు
చింతలపూడి :మన రాష్ట్రంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తేలడం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఇదే సందర్భంలో ఇక్కడి భూమి పొరల్లో ఉన్న బొగ్గును వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కృష్ణా జిల్లా ముసునూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వీటిని తవ్వితీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికిలేఖ పంపించింది.
ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నిపుణులు రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండల పరిధిలోని సోమవరం ప్రాంతంలో సర్వే చేపట్టారు. సింగరేణి గనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గుకంటే నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఇప్పటికే జీఎస్‌ఐ నిపుణులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో సర్వే పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మన జిల్లాలోని చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిక్షేపాలపై త్వరలోనే సర్వే చేయనున్నారు. ఇది పూర్తయితే బొగ్గు వెలికితీత పనులను ప్రభుత్వం శరవేగంగా చేపట్టనుందని సమాచారం.
కృష్ణా జిల్లా సోమవరం నుంచి చింతలపూడి వరకు 3 వేల మిలియన్ మెట్రిక్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్టు ప్రాథమిక సర్వేలోనే గుర్తించారు. 2013లో లక్నోకు చెందిన బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ సంస్థ కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధ్యయనం చేసి కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాలలో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ లభించే బొగ్గు అత్యంత నాణ్యమైనదని ఆ సంస్థ నిర్ధారించింది. భూమి ఉపరితలానికి 400 మీటర్ల నుంచి 1,400 మీటర్ల లోతున ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నివేదించింది.
ఎంతో ప్రయోజనం
రాష్ట్ర విభజన తరువాత సింగరేణి బొగ్గును కోల్పోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడింది. దీంతో మన ప్రభుత్వం ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమీకరించే విషయంలో రానున్న నాలుగేళ్లలో సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ లోగానే చింతలపూడి ప్రాంతం నుంచి బొగ్గు నిల్వలను వెలికితీయగలిగితే.. 60 ఏళ్ల పాటు ఏటా 8 వేల మెగావాట్ల విద్యుత్‌ను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని అంచనా. మరోవైపు ఇక్కడి బొగ్గు తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మన ప్రాంతంలోనే థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య తీరుతుంది. రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. బొగ్గు ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయానికీ, పరిశ్రమలకు విద్యుత్ కొరత తీరుతుందని భావిస్తున్నారు.
గత సర్వేల్లోనే వెలుగులోకి ..
1964 నుండి 2006 వరకు సుమారు 4 దఫాలుగా ఇక్కడి బొగ్గు నిక్షేపాలపై సర్వేలు చేశారు. ఈ నేపథ్యంలో చింతలపూడి ప్రాంతంలో అపార బొగ్గు నిల్వలు ఉన్నాయని, త్వరలో వెలికితీత పనులు చేపడతామని ఏపీ గనుల శాఖ సీఎండీ ఎండీ శాలినీమిశ్రా గత ఏడాది ఆగస్టులో ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమ, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాలను ఆనుకుని 2,500 చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. మన జిల్లాకు సరిహద్దున గల ఖమ్మం జిల్లా రేజర్ల, నారాయణపురం నుంచి గురుభట్లగూడెం, రాఘవాపురం గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు వెయ్యి అడుగుల మందంతో నిక్షేపాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా రాఘవాపురం, పట్టాయిగూడెం, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం, సీతానగరం, చింతలపూడి గ్రామాల్లో అంతకంటే తక్కువ లోతులోనే నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టునిర్థారించారు.
నిండా నిక్షేపాలు
Published Sat, Sep 5 2015 12:52 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement