ప్రత్యేక హోదాకోసం.. కదం తొక్కిన విద్యార్థిలోకం
ప్రత్యేక హోదాకోసం.. కదం తొక్కిన విద్యార్థిలోకం
Published Mon, Sep 19 2016 9:12 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
చింతలపూడి : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు ఆరోపించారు. చింతలపూడిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే పార్లమెంట్‌లో చెబితే పదేళ్లు కావాలని అడిగిన బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక హోదా ఊసే ఎత్తడం లేదన్నారు. 64 లక్షల జనాభా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే ఆ రాష్ట్రానికి రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 3 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.
ఓటుకు నోటు కేసు మాఫీ కోసం చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కె సలాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కె.దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చింతలపూడి పట్టణంలో ప్రత్యేక హోదా కోరుతూ నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో సలాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాతబస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రత్యేక హోదా ఉద్యమం బలపడుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, మేము మాత్రమే తీసుకురాగలమని టీడీపీ చెప్పి ప్రజలను మోసం చేశాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పత్యేక హోదా పోరులో విద్యార్థులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త డి.నవీన్‌బాబు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పోరాటం చేసి హోదాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులు, నిరుద్యోగులేనన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకపల్లి డేవిడ్, రాష్ట్ర కార్యదర్శి కె.దినేష్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ దయాల నవీన్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి పాల్గొన్నారు.
Advertisement